సార్వత్రిక సమ్మె విజయవంతం

ABN , First Publish Date - 2020-11-27T05:04:00+05:30 IST

కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. జిల్లావ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సార్వత్రిక సమ్మె విజయవంతం
శ్రీకాకుళంలో సార్వత్రిక సమ్మెకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

కదంతొక్కిన కార్మిక, ప్రజా సంఘాలు

కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనలు

గుజరాతీపేట, నవంబర్‌ 26 : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలు గురువారం చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. జిల్లావ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక చట్టాల మార్పును, కార్మిక వ్యతిరేక కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరారు. అసంఘితరంగ కార్మికులకు ఉపాధి, భద్రతతో కూడిన సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని, కనీస వేతనం రూ.21వేలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ కాలంలో ఇబ్బందులు పడిన కార్మికులకు నెలకు రూ.10వేల చొప్పున భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మెకు మద్దతుగా శ్రీకాకుళం జీటీ రోడ్డులోని యూనియన్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం వద్ద బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. నిరసన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిదులు శ్రీనివాసరావు, కరుణ, జయరాం, సత్యనారాయణ పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని ప్రధాన పోస్టాఫీసు వద్ద తపాలా శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. సమ్మె శిబిరాలు ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ, సోంపేట, ఇచ్ఛాపురం, మందస, టెక్కలి, రాజాం ప్రాంతాల్లో  కూడా సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తపాలా ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు గణపతి, చంద్రమోహన్‌, విజయకృష్ణలు తెలిపారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో ఏపీఎన్జీవోలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు, హమాలీలు, అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, స్కీం వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులతో కలిసి శ్రీకాకుళం డైమండ్‌ పార్కు  నుంచి జీటీ రోడ్డు, ఏడు రోడ్ల కూడలి, పొట్టి శ్రీరాములు జంక్షన్‌ల మీదుగా ఏన్జీవో హోం వరకు ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, కార్యదర్మి చల్లా శ్రీనివాసరావు, వామపక్ష నాయకులు బి.కృష్ణమూర్తి, సనపల నర్సింహులు, తాండ్ర ప్రకాష్‌, పెన్షనర్ల అసోసియేషన్‌ ప్రతినిధి ఎం.ఆదినారాయణమూర్తి, సీఐటీయూ నాయకులు టి.తిరుపతిరావు, కె.శ్రీనివాస్‌, ఆర్‌ సురేష్‌బాబు పాల్గొన్నారు. 

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల జిల్లా యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ డీసీసీబీ సీఈవో, సహకార అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంగనాఽథ్‌, జిల్లా అధక్షుడు లోలుగు మోహనరావు, ప్రధాన కార్యదర్శి రామారావు, దాసు, జగదీష్‌, పాపినాయుడులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-27T05:04:00+05:30 IST