-
-
Home » Andhra Pradesh » Srikakulam » The final list of all voters
-
లెక్క తేల్చరా?
ABN , First Publish Date - 2020-03-13T10:30:38+05:30 IST
స్థానిక ఎన్నికలు వరుసగా రావడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. వరుసగా ప్రాదేశిక, మునిసిపల్, పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. కానీ ఇంతవరకూ ఓటర్ల తుది జాబితాలు

అందని ఓటర్ల తుది జాబితా
అధికారులకు అవగాహన లేకపోవడమే కారణం
తక్కువ వ్యవధిలో ఎన్నికలతో ఒత్తిడి
ఆందోళనలో ‘స్థానిక’ అభ్యర్థులు
(కలెక్టరేట్)
స్థానిక ఎన్నికలు వరుసగా రావడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. వరుసగా ప్రాదేశిక, మునిసిపల్, పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. కానీ ఇంతవరకూ ఓటర్ల తుది జాబితాలు వెల్లడికాకపోవడంతో అన్ని పార్టీల్లో ఆందోళన నెలకొంది. ఎవరి ఓట్లు ఉన్నాయి? కొత్త ఓటర్లు ఎంతమంది? తొలగింపులు ఉన్నాయా? అన్న వివరాలు తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తుది జాబితా వెల్లడైతే కానీ ఓటర్లను నేరుగా కలవడం, వలస ఓటర్లను తెప్పించడం కష్టం. అందుకే జాబితాల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారులకు అవగాహన లేకపోవడమే జాప్యానికి కారణమని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా తయారీ ప్రక్రియకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించిన జాబితాలు ఎప్పటికప్పుడే సిద్ధం చేస్తుంటారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటరు తుది జాబితా జిల్లా పంచాయితీ అధికారులు ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల సంఘం నుంచి సాఫ్ట్ కాపీ వచ్చి వారం రోజులు కావస్తున్నా ఇంతవరకు జాబితా సిద్ధం కాలేదు.
ఇదీ పరిస్థితి
గత నెల 23న ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. దీని ప్రకారం జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి 22 లక్షల 29,071 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక సంస్థలకు జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశముంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి జిల్లా పంచాయితీ కార్యాలయానికి ఈ నెల 7న సాఫ్ట్ కాపీ వచ్చింది. గత నెల 23 వరకూ ఉన్న ఓటర్లతో సప్లమెంటరీ -1 కింద జాబితాలు సిద్ధం చేయాలి. 23 నుంచి మార్చి 6 వరకూ కొత్తగా చేరిన ఓటర్లు, తొలగింపులు సరిచేసి సప్లమెంటరీ-2 జాబితా సిద్ధం చేయాలి. ఈ రెండు జాబితాలు కలిపి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు తుదిజాబితా కింద వస్తాయి. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా మునిసిపాల్టీ కమిషనర్లు తుది జాబితాలు సిద్ధం చేయాలి. ఈ నెల 8తో ఓటరు నమోదు ముగిసింది.
9న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల జరిగే మునిసిపాల్టీలకు సాఫ్ట్ కాపీ అందించింది. కానీ తుది జాబితా ఇంతవరకూ ప్రచురించలేదు. పంచాయతీలకు సంబంధించి ఈ నెల 12 నమోదుకు చివరి తేదీగా ప్రకటించారు. కొత్తగా చేరిన ఓటర్లుతో ఈ నెల 13కు ఎన్నికల సంఘం నుంచి సాఫ్ట్ కాపీ అందాల్సి ఉంది. గతంలో ఉన్న మూడు జాబితాలు ఈ నెల 12 వరకు వచ్చిన కొత్తఓటర్లుతో సప్లమెంటరీ -4 జోడించి తుదిజాబితా జిల్లా పంచాయితీ అధికార్లు ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల సంఘం నుంచి శాసన సభ నియోజకవర్గాలవారీ ఓటర్లు వివరాలు సాప్ట్‌కాపీ కింద వస్తాయి. వీటిని మండలాలా వారీ విడదీయాలి. తరువాత పోలింగ్ బూత్‌లు వారీ తుదిజాబితాలు సిద్థం చేయాలి. పోలింగ్ సమీపిస్తున్నా ప్రక్రియలో పురోగతి లేదు. అధికారులు మాత్రం సిబ్బందిపై తప్పులు నెట్టేస్తున్నారు. వీలైనంత త్వరగా ఓటరు తుది జాబితాలను అందించాలని అన్ని పార్టీల అభ్యర్థులు కోరుతున్నారు.
త్వరితగతిన జాబితాలు
ఓటరు తుది జాబితాలు అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అధికారులు, సిబ్బంది ఇదే పనిమీద ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి వచ్చిన సాఫ్ట్ కాపీ మండలాలకు పంపించాం. వీలైనంత త్వరగా ఓటరు జాబితాలను అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.
-వి.కోటేశ్వరరావు, జడ్పీ కార్యాలయ సూపరింటిండెంట్