అధికారులు అప్రమత్తం
ABN , First Publish Date - 2020-04-26T10:17:16+05:30 IST
డివిజన్ పరిధిలోగల పాతపట్నం మండలంలోని సీది గ్రామంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ..

సీది గ్రామస్థులతో సంబంధం ఉన్న వారిపై ఆరా
పాలకొండ/భామిని/ఆమదాలవలస, ఏప్రిల్ 25: డివిజన్ పరిధిలోగల పాతపట్నం మండలంలోని సీది గ్రామంలో ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో పాలకొండ, భామిని, సీతంపేట మండలాల అధికారులు అప్ర మత్తమయ్యారు. సీదితో లింకులు, సంబంధం ఉన్న వారిపై ఆరాతీస్తున్నారు. ఇం దులో భాగంగా పాలకొండ నగరపంచాయతీ కమిషనర్ ఈ.లిల్లీపుష్ప నాధం, సీఐ ఆదాం, ఎస్‌ఐ జనార్దనరావు పట్టణంలో పలు వీధుల్లో పర్యటించి పాతపట్నం మండలంలోని గ్రామాలతో సంబంధాలను అడిగి తెలుసుకుంటున్నారు. పాతపట్నానికి చెందిన వారు మూడు రోజుల కిందట పాలకొండలోని ఓ వీధిలోకి వచ్చి వెళ్లారని తెలుసుకొని ఆ కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారిని బయట తిరగవద్దని హోంక్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారి బి.రాజగోపాల్, తహసీల్దార్ జె.రామారావులు శనివారం సంకిలి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును పరిశీలించారు.
ఇతర మండలాల వారు మండలంలోకి రాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే సీది గ్రామానికి భామిని మండలంతోని పలు గ్రామాలతో ఉన్న బంధుత్వాల గురించి ఆరా తీస్తున్నారు. భామినిలో మూడు, బాలేరులో రెండు కుటుం బాలు ఆ గ్రామానికి రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయా కుటుంబాలను ఇంటి నుంచి బయటకు రాకూడదని అధికారులు చర్యలు తీసుకున్నారు. వారి అండ్రాయిడ్ ఫోన్‌లో కరోనా యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు.కార్యక్రమంలో వీఆర్వో గిరీష్‌ప ట్నాయక్‌తోపాటు హెల్త్ అసిస్టెంట్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
క్వారంటైన్‌కు తరలించాలని నిలదీత
ఆమదాలవలసకు చెందిన ఓ మహిళ చెన్నై నుంచి శుక్రవారం చేరుకోవడంతో స్థానికులు శనివారం కమిషనర్ ఎం.రవిసుధాకర్‌కు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆమెను క్వారంటైన్‌కు తరలించాలని కమిషనర్‌ను నిలదీశారు. భయపడవలసిన పనిలేదని స్థానికులకు నచ్చజెప్పి పంపించారు.చెన్నై నుంచి వచ్చిన వ్యక్తికి వైద్యునితో పరీక్షించి హోంక్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. తాను చెన్నైలో నిర్వహించిన పరీక్ష నివేదిక, అక్కడ అధికారులు వచ్చేందుకు ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూపించారు. కాగా గ్రామీణ ప్రాంతంలోని ఓ వార్డుకు కృష్ణా జిల్లా నుంచి వలస కూలి రెండు రోజుల కిందట వచ్చారు. ఆయనకు జలుబు, దగ్గు ఉన్నట్లు గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రిమ్స్ క్వారంటైన్‌కు అధికారులు తరలించారు.