‘కరోనా’ భోజనంపై కన్ను!

ABN , First Publish Date - 2020-04-18T10:49:24+05:30 IST

కరోనా మహమ్మారి ప్రభావంలోనూ కొందరు అక్రమాలకు తెర తీస్తున్నారు. కార్వంటైన్‌ కేంద్రంలో ఉన్న వారికి భోజనం అందజేసే విషయంలో టెండ‘‘రింగ్‌’ అవుతున్నారు.

‘కరోనా’ భోజనంపై కన్ను!

క్వారంటైన్‌ కేంద్రాల్లో మెనూకి ‘టెండరింగ్‌’


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి) 

కరోనా మహమ్మారి ప్రభావంలోనూ కొందరు అక్రమాలకు తెర తీస్తున్నారు. కార్వంటైన్‌ కేంద్రంలో ఉన్న వారికి భోజనం అందజేసే విషయంలో  టెండ‘‘రింగ్‌’ అవుతున్నారు. కొంతమంది అధికారులు, వ్యాపారుల సహకారంలో నిధులు వెనకేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా కట్టడిలో భాగంగా విదేశాలు, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్న వారిని అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. వారికి పేస్టు నుంచి రాత్రి భోజనం వరకూ ప్రభుత్వం తరఫున వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ‘అక్షయపాత్ర’ ద్వారా కొంత ఆహారాన్ని సమకూర్చగా.. శ్రీకాకుళంలో ఓ హోటల్‌ నుంచి సుమారు రోజుకి ఒక్కొక్కరికీ రూ.220 చొప్పున ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. రానున్న రోజుల్లో క్వారంటైన్‌ కేంద్రాల్లో సంఖ్య మరింత పెరగనున్న నేపథ్యంలో టెండర్లు వేసి మెనూ అందజేయాలని అధికారులు నిర్ణయించారు.  ప్రస్తుతం ఆహారాన్ని సరఫరా చేస్తున్న హోటల్‌ యజమానే.. అక్రమంగా ఈ ‘టెండరింగ్‌’ను దక్కించుకోవడం చర్చనీయాంశమవుతోంది. 


ఇదోరకమైన టెండరింగ్‌.... 

జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నవారికి ఉదయం మెనూ ప్రకారం 6.30 గంటలకు రాగిమాల్ట్‌(అంబలి), 7 గంటలకు టీ లేదా కాఫీ, 7.30 నుంచి 8 గంటలకు రెండు రకాల టిఫిన్‌, 11 గంటలకు ఫ్రూట్‌ సలాడ్‌ ఇవ్వాలి. ఇక మధ్యాహ్నం విషయానికొస్తే.. 12 గంటలకు గుడ్డు కూరతో పాటు రెండు రకాల శాఖాహార కూరలతో భోజనం పెట్టాలి. సాయంత్రం నాలుగు గంటలకు టీతోపాటు స్నాక్స్‌ అందజేయాలి. రాత్రి 7 గంటలకు రెండు రకాల శాఖాహార కూరలతో భోజనం పెట్టాలి. అలాగే రూమ్‌లో 20లీటర్ల నీళ్ల బాటిల్‌, మట్కా ఇతరత్రా సమకూర్చాలి. వీటన్నింటినీ సమకూర్చేందుకు అధికారులు ఈ నెల 7న టెండర్లు పిలిచారు. 9న బిడ్స్‌ తెరచి క్లోజ్‌ చేసేశారు. విశాఖపట్నానికి చెందిన ఇద్దరు, శ్రీకాకుళం నగరానికి చెందిన 14 మంది హోటళ్ల నిర్వాహకులు టెండర్లు దాఖలు చేశారు. విశాఖకు చెందిన ఇద్దరినీ ఓ అధికారి వెనక్కి పంపేసినట్టు సమాచారం. దీంతో మిగిలినవారంతా ఒక్కటయ్యారు. టెండరులో.. రోజుకి 2,570 మంది వరకు సరిపడేలా మెనూ అందజేయాలని అధికారులు తెలిపారు. కానీ ఆహారంలో ఏవేవి... ఎంత పరిమాణం (క్వాంటిటీ)లో సమకూర్చాలన్నదీ స్పష్టం చేయలేదు.


ఆ విషయాన్ని టెండర్‌లో ప్రస్తావించడం మరిచిపోయినట్లు.. కొంతమంది అఽధికారులు చెబుతూ.. మొత్తానికి టెండర్‌ను ఖరారు చేశారు.  అప్పటికే టెండర్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఓ హోటల్‌ నిర్వాహకుడు.. ‘రింగ్‌ అవుదాం.. అందరం పంచుకుందాం’ అని ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం క్వారంటైన్‌ కేంద్రాలకు ఆహారాన్ని సరఫరా చేస్తున్న ఓ హోటల్‌ యజమాని ఈ టెండర్‌ను దక్కించుకున్నారు. వెంటనే పోస్టుడేటెడ్‌ చెక్‌లను సుమారు 14 మందికి అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఎక్కడా పోటీ లేకుండా... సాఫీగా టెండరింగ్‌ జరిగిపోయింది. క్వాంటిటీ ఎంతమొత్తమన్నదీ లేకపోవడంతో.. అందరం లాభాలను పంచుకోవచ్చన్నది వ్యాపారుల మధ్య ప్రస్తావన నడుస్తున్నట్లు తెలిసింది.  టెండరింగ్‌ అవ్వడంతో ఇప్పటికే శ్రీకాకుళం టౌన్‌హాల్‌కు ఎదురుగా ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆహారాన్ని తయారు చేసేందుకు సామగ్రిని భారీగా సిద్ధం చేసేశారు. ఇద్దరు అధికారులు కూడా సైట్‌ విజిట్‌ చేసేసి అంగీకరించేశారు. దీంతో రూ.20లక్షల వరకు అడ్వాన్సులు ఇవ్వడానికి రంగం సిద్ధమవుతోంది. శ్రీకాకుళం ఆర్డీవో తెలిపిన వివరాల ప్రకారం క్వారంటైన్‌లో ఉండే వ్యక్తికి రోజుకు సుమారు రూ.500 వరకు ఖర్చు చేయనున్నారు. 


విచారణ చేయాలి 

ఎప్పటికప్పుడు జాగ్రత్తలపైనా.. పారిశుధ్య నిర్వహణ, విపత్తుల విషయంలోనూ ప్రభుత్వ పరంగా సహకారం కోసం హోటళ్ల యజమానులను జిల్లా అధికారులు పిలిచి సమావేశం నిర్వహిస్తుంటారు. వారి నుంచి కొన్నిరకాల సహకారాన్ని ప్రభుత్వం పేరుతో తీసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నవారికి పెద్దమొత్తంలో ఆహారం సరఫరా చేసేందుకు హోటళ్ల అసోసియేషన్‌ ప్రతినిధులకు సమాచారం ఇస్తే బాగుండేదని కొంతమంది వ్యాపారులు పేర్కొంటున్నారు. ఎంతమొత్తంలో ఆహారం సమకూర్చాలన్నది స్పష్టత లేకుండా టెండరింగ్‌ జరిగిందని.. దీనిపై కలెక్టర్‌ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు హోటళ్ల నిర్వాహకులు కోరుతున్నారు.  ఇదే అంశంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 


జిల్లాలో ఇదీ పరిస్థితి....

జిల్లావ్యాప్తంగా 35 క్వారంటైన్‌ కేంద్రాలు  ఉన్నాయి. వీటిలో 4048 మంది వరకు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. గురువారం వరకు 768 మంది  క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండగా, కొత్తగా 46 మంది చేరారు. క్వారంటైన్‌ 21 రోజులు పూర్తవడంతో 199 మందిని డిశ్చార్జి చేసేశారు. ఇంకా 615 మంది అందులోనే ఉన్నారు. ఈ నెల 20 తర్వాత పెద్దమొత్తంలో క్వారంటైన్‌ కేంద్రాలకు చేరే అవకాశముంది. కొత్తగా ఖరారైన టెండర్‌ల ద్వారా ఇంకా ఆహారం సరఫరా చేయడంలేదు. త్వరలో సరఫరా చేస్తారు. 


అక్రమాలకు చోటు లేదు : ఎన్వీ రమణ, జిల్లా క్వారంటైన్‌ అధికారి

టెండర్లలో ఎక్కడా అక్రమాలు జరగలేదు. కలెక్టర్‌ నివాస్‌, జేసీ శ్రీనివాసులు కూడా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. టెండర్‌ ప్రక్రియ మొత్తం ఐదుగురితో వీడియో తీయించాం. ఇందుకు సంబంధించి ఫైల్‌ కలెక్టరేట్‌లోని చక్రవర్తి అనే ఉద్యోగి వద్ద ఉంచాం. సందేహాలు ఉంటే.. ఎవరైనా సరి ఆ ఫైల్‌ పరిశీలించవచ్చు. ఈ నెల 20 నుంచి 2,500 మందికి కొత్త టెండర్‌ ద్వారా ఆహారాన్ని అందజేస్తాం. ఇప్పటివరకూ అడ్వాన్సు కూడా ఇవ్వలేదు. 


Updated Date - 2020-04-18T10:49:24+05:30 IST