టీడీపీలో.. నూతనోత్తేజం!
ABN , First Publish Date - 2020-05-29T10:01:33+05:30 IST
‘మహానాడు’.. టీడీపీలో నూతనోత్తేజాన్ని నింపింది. తెలుగుదేశం పార్టీ పండుగలా నిర్వహించుకునే రెండురోజుల ‘మహానాడు’ ..

ఉత్సాహంగా ‘మహానాడు’
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి):
‘మహానాడు’.. టీడీపీలో నూతనోత్తేజాన్ని నింపింది. తెలుగుదేశం పార్టీ పండుగలా నిర్వహించుకునే రెండురోజుల ‘మహానాడు’ బుధవారం ప్రారంభమైంది. గురువారం కూడా ఈ కార్యక్రమం కొనసాగింది. కరోనా నేపథ్యంలో వెబినార్ ద్వారా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధినేత చంద్రబాబునాయుడ వెబినార్ ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. టీడీపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలిరోజు జిల్లాస్థాయి, నియోజకవర్గ నాయకులు లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ, ఎవరి ఇళ్లవద్ద వారే ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. రెండోరోజు గురువారం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని.. నివాళులర్పించారు. అనంతరం శ్రీకాకుళంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు పాల్గొని.. భౌతిక దూరం పాటిస్తూ.. అధినేత ప్రసంగాన్ని వెబినార్‌లో వీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష మాట్లాడుతూ.. ‘తెలుగుజాతి అభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేసిన ఘనత దివంగత నేత ఎన్టీఆర్కే దక్కుతుంది. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిరంతరం కృషి చేస్తున్నారు. గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా పేదల అభ్యున్నతే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోంది. అధినేత ప్రవేశపెట్టిన తీర్మానాలను తప్పకుండా అమలు చేసేందుకు కృషి చేస్తా’మని తెలిపారు. కష్టకాలంలో ఉన్నప్పుడు టీడీపీని వీడి వెళ్లినవారిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించవద్దని ప్రతి కార్యకర్త కోరుతున్నారు. ఈ విషయాన్ని అధినేత పరిశీలించాలని ఆమె కోరారు. ఎన్ని వేధింపులు ఎదురైనా.. క్రమశిక్షణతో పార్టీ పటిష్టత కోసం సైనికుల్లా పోరాడతామని తెలిపారు. బడుగు బలహీన, బీసీ వర్గాలే వెన్ను దన్నుగా పార్టీ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడులు ప్రసంగించారు. వైసీపీ ఏడాది పాలనలో ఎన్నో వైఫల్యాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీ పూర్వవైభవానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్, పొలిట్‌బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభాభారతి, మాజీమంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, గుండ లక్ష్మీదేవితో పాటు చౌదరి బాబ్జి, పి.విఠల్, శుభాకర్, ఎం.రమేష్, తదితరులు పాల్గొన్నారు.