రైతుకు అండ... అదే అజెండా!
ABN , First Publish Date - 2020-12-17T05:38:51+05:30 IST
రైతుల సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా.. టీడీపీ పోరుబాటకు సిద్ధమవుతోంది. రైతులపై నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ... ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన బాటకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బాధితులకు తుఫాన్ నష్ట పరిహారం చెల్లించడంతో పాటు వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించి రైతులపై గుదిబండ మోపడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రైతు సమస్యలపై పోరాడేందుకు వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నేతలను సంఘటితం చేయాలని భావిస్తోంది.

పోరుబాటకు సిద్ధమవుతున్న టీడీపీ
దశల వారీగా ఆందోళనకు కార్యాచరణ
సంఘాలు, వివిధ పార్టీలను సంఘటితం చేసే యోచన
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)
రైతుల సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా.. టీడీపీ పోరుబాటకు సిద్ధమవుతోంది. రైతులపై నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ... ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన బాటకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బాధితులకు తుఫాన్ నష్ట పరిహారం చెల్లించడంతో పాటు వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించి రైతులపై గుదిబండ మోపడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రైతు సమస్యలపై పోరాడేందుకు వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నేతలను సంఘటితం చేయాలని భావిస్తోంది.
--------------------------
రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. రైతు పక్షపాతి అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నదాతలకు తీరని అన్యాయం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు బాసటగా నిలిచి.. వారి సమస్యలపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తోంది. వైసీపీ పాలనలో అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తుఫాన్‌ల కారణంగా పంట నష్టం వాటిల్లినా ప్రభుత్వం నుంచి పరిహారం సక్రమంగా అందడం లేదు. తితలీ బాధితులకు రెట్టింపు పరిహారం చెల్లిస్తామని చెప్పి.. మీనమేషాలు లెక్కిస్తోంది. ఇటీవల నివర్ తుఫాన్‌కు నష్టపోయిన రైతులకు పరిహారం మాట అటుంచితే.. కనీసం పరామర్శించే నాయకుడే లేడు. కౌలు రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రకటించినా.. పరిహారం చెల్లింపుల సందర్భంలో వివిధ సాంకేతిక కారణాలను సాకుగా చూపి వారికి అన్యాయం చేస్తోంది. దీనికి తోడు రైతులకు గుదిబండగా మారనున్న వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రయోగాత్మకంగా సిక్కోలు నుంచే దీనికి శ్రీకారం చుడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ.. రైతులకు అండగా నిలిచేలా టీడీపీ పోరుబాటకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సోమవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ల ఆధ్వర్యంలో నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు జిల్లా టీడీపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడాలని నిర్ణయించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే.. సిక్కోలు నుంచే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నివర్ తుఫాన్ ప్రభావంతో రైతులు నష్టపోయిన పంట వివరాలను కలెక్టర్ నివాస్‌కు నివేదిక రూపంలో అందజేశారు. బాధిత రైతులకు పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇచ్చిన హామీ మేరకు తితలీ తుఫాన్ బాధిత రైతులకు సంక్రాంతిలోగా రెట్టింపు పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
ధాన్యం కొనుగోళ్లు ఏవీ?
ప్రస్తుతం వరికోతలు పూర్తయి.. సీజన్ దాటిపోతున్నా జిల్లాలో ఎక్కడా ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు. రైతులు ధాన్యం విక్రయించాలంటే ముందుగా రైతుభరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం మెలిక పెట్టింది. దీంతో మిల్లర్లు ఇంతవరకు ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదు. రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతి గింజా కొనుగోలు చేస్తామని చెప్పిన వైసీపీ నేతలు ఆచరణలో మీనమేషాలు లెక్కిస్తున్నారని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. కౌలు రైతులను కనీసం పట్టించుకోవడం లేదు. ఇలా రైతుల సమస్యలన్నింటిపైనా దశలవారీగా క్షేత్రస్థాయిలో ఉద్యమించేందుకు టీడీపీ నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నారు. రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నేతలను సంఘటితం చేసి.. అన్ని వర్గాలనూ కలుపుకుని ప్రభుత్వం దృష్టికి ముందుగా రైతుల సమస్యలు తీసుకెళ్లనున్నారు. నిర్ధిష్ట గడువులోగా పరిష్కారం చూపని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.
వైసీపీ ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటం
‘రైతుభరోసా’ అక్రమాల నిగ్గుతేల్చండి
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, డిసెంబరు 16: ‘రైతుభరోసా’ పథకంలో అక్రమాలు జరిగాయని చెప్పినా ప్రభుత్వం వినిపించుకోలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే తప్ప పథకాల అమలులో చిత్తశుద్ధి కనిపించడం లేదన్నారు. నిజమైన లబ్ధిదారుల విషయంలో కొర్రీలు పెడుతున్న ప్రభుత్వం..పథకాల అమలులో అక్రమాలు జరిగినట్టు తేలినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. సంతబొమ్మాళి మండలంలో రైతుభరోసా అక్రమాల విషయాన్ని పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సమగ్ర దర్యాప్తు చేసి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చేతకాకుంటే టీడీపీ ఆధ్వర్యంలో విచారణ చేపడతామని సవాల్ విసిరారు.