పేదల సొంతింటి ఆశ నీరుగారింది

ABN , First Publish Date - 2020-11-07T05:28:46+05:30 IST

వైసీపీ పాలనలో పేదలకు సొంతింటి ఆశలు నీరుగారాయని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘నా ఇల్లు నా సొంతం- నా ఇంటి స్థలం నాకు కావాలి’ అనే కార్యక్రమాన్ని స్థానిక 28వ వార్డులో శుక్రవారం నిర్వహించారు.

పేదల సొంతింటి ఆశ నీరుగారింది
శ్రీకాకుళం 28వ వార్డులో పర్యటిస్తున్న లక్ష్మీదేవి

 మాజీ ఎమ్మెల్యే  గుండ లక్ష్మీదేవి

గుజరాతీపేట: వైసీపీ పాలనలో పేదలకు సొంతింటి ఆశలు నీరుగారాయని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘నా ఇల్లు నా సొంతం- నా ఇంటి స్థలం నాకు కావాలి’ అనే కార్యక్రమాన్ని స్థానిక 28వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ, పట్టణ పేదలు నాణ్యమైన జీవనాన్ని సాగించాలన్న తలంపుతో టీడీపీ పాలనలో కేంద్రం సహకారంతో రాష్ట్రంలో 7,58,788 టిడ్కో గృహాలను మంజూరు చేసినట్లు చెప్పారు.  ఈ గృహాలను పొందేందుకు పేదలు అప్పు చేసి నాటి ప్రభుత్వానికి డిపాజిట్లు చెల్లించారన్నారు. కానీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఈ ఇళ్లను పేదలకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందన్నారు. తిరిగి డబ్బులు కూడా చెల్లించడం లేదన్నారు. ఇప్పటికైనా టిడ్కో గృహాలను పేదలకు కేటాయించాలని ఆమె డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జి గుత్తు చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.

రెండేళ్లవుతున్నా ఇల్ల్లూ లేదు.. బిల్లూ లేదు:  మాజీ ఎమ్మెల్యే బగ్గు   

నరసన్నపేట: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు.. కట్టిన ఇంటికి బిల్లు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పట్టాల పేరిట రూ. 15 వేల కోట్లు వైసీపీ నాయకులు తినేశారని విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. కేవలం ఆవ భూముల పంపిణీ మాత్రమే నిలిపివేయాలని కోర్టు ఆదేశించగా దీనిని సాకుగా చూపి మిగతా పట్టాలను పంపిణీ చేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు పంచకుండా నిలిపి వేయటం దారుణమన్నారు. తక్షణం వాటిని పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎన్టీఆర్‌ గృహాలను లబ్ధిదారులకు అప్పగించండి

పాలకొండ (వీరఘట్టం): గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు మంజూరు చేసిన ఎన్టీఆర్‌ గృహాలను పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం కొట్టుగుమ్మడ, కిమ్మి గ్రామాల్లో ‘నా ఇళ్లు నాసొంతం, నా ఇంటి స్థలం నాకివ్వాలి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉదయాన హరిబాబు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.  

 వజ్రపకొత్తూరు : బెండిగేట్‌ కొండపై నిర్మించిన హుద్‌హుద్‌ ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ మండల మాజీ అధ్యక్షడు బి.శశిభూషణరావు ఆధ్వర్యంలో ఇళ్లను పరిశీలించి ర్యాలీ చేపట్టారు. నిర్మాణం పూర్తయినా ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సూరాడ మోహనరావు, అరసవల్లి ఉమామహేశ్వరరావు, మరడ దుర్యోధన రెడ్డి, ఆకుల భాస్కరావు, సూరాడ పెంటయ్య, అంబటి రామకృష్ణ పాల్గొన్నారు. Updated Date - 2020-11-07T05:28:46+05:30 IST