స్వామి భక్తి... విధులకు స్వస్తి!

ABN , First Publish Date - 2020-11-20T05:10:36+05:30 IST

ప్రజా ప్రతినిధుల సేవలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తరిస్తున్నారు. స్వామి భక్తి సేవలో మునిగిపోతూ.. బాధ్యతగా చేపట్టాల్సిన విధులకు ఎగనామం పెడుతున్నారు. సీసీఏ నిబంధనల ప్రకారం.. రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనరాదనే విషయాన్ని మరచి.. నేతల మెప్పు కోసం పాకులాడుతున్నారు. ఇటీవల అధికార పార్టీ నేతలు చేపట్టిన ‘పాదయాత్ర’లో కొంతమంది కీలకపాత్ర పోషిస్తూ.. నిబంధనలు ఉల్లంఘించారు. దీనిపై ఫిర్యాదులు అందినా.. ఉన్నతాధికారులు మొక్కుబడి నోటీసులతోనే వదిలేయడం చర్చనీయాంశమవుతోంది.

స్వామి భక్తి... విధులకు స్వస్తి!

 ప్రజాప్రతినిధుల సేవలో ఉద్యోగులు

 పార్టీ కార్యకర్తలుగా మారిపోతున్న వైనం

 నేతల మెప్పు కోసం పాకులాట

 వైసీపీ నాయకుల పాదయాత్రలో కీలకపాత్ర 

 అయినా కానరాని చర్యలు

 మొక్కుబడి నోటీసులతో సరిపెడుతున్న ఉన్నతాధికారులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రజా ప్రతినిధుల సేవలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తరిస్తున్నారు. స్వామి భక్తి సేవలో మునిగిపోతూ.. బాధ్యతగా చేపట్టాల్సిన విధులకు ఎగనామం పెడుతున్నారు. సీసీఏ నిబంధనల ప్రకారం.. రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనరాదనే విషయాన్ని మరచి.. నేతల మెప్పు కోసం పాకులాడుతున్నారు. ఇటీవల అధికార పార్టీ నేతలు చేపట్టిన ‘పాదయాత్ర’లో కొంతమంది కీలకపాత్ర పోషిస్తూ.. నిబంధనలు ఉల్లంఘించారు. దీనిపై ఫిర్యాదులు అందినా.. ఉన్నతాధికారులు మొక్కుబడి నోటీసులతోనే వదిలేయడం చర్చనీయాంశమవుతోంది. 

.....................

ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు రాజకీయ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. రాజకీయ పార్టీల సభలు, ఇతర కార్యక్రమాలకు వారు దూరంగా ఉండాలి. కానీ, జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పంచకు చేరడం.. అనతికాలంలోనే నేతల మెప్పు కోసం వారితో చెట్టాపట్టాల్‌ వేసుకొని తిరగడం పరిపాటిగా మారింది.  సీసీఏ నిబంధనలు మరచి.. పార్టీ కార్యకర్తలుగా మారిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో విధులకు సైతం దూరంగా ఉంటున్నారు. బాధ్యత గల ప్రభుత్వ శాఖలో ఉద్యోగిగా ఉంటూ అధికార పార్టీ నేతల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేవారు కొందరైతే.. ప్రజాప్రతినిధుల మెప్పు పొందేందుకు మరికొందరు పాకులాడుతుండడం విమర్శలకు తావిస్తోంది. అధిష్టానం పిలుపు మేరకు ఇటీవల వైసీపీ నాయకులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే మంచి అవకాశం అనుకున్నారో.. ఏమో.. కొందరు మండల స్థాయి అధికారులు ఏకంగా వైసీపీ వ్యవహారాలను తమ భుజాలకెత్తుకున్నారు. పొందూరు, బూర్జ మండల అభివృద్ధి అధికారులైతే తమ అభిమాన నాయకుల పాదయాత్రలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పాల్గొని తరించాలంటూ ఏకంగా లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసేశారు. ఈ విషయం ఎస్‌ఎస్‌ఆర్‌ (సబ్‌ ఆర్డినేట్‌ సర్వీస్‌) రూల్స్‌కు వ్యతిరేకమని టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు సంబంధిత ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొక్కుబడిగా నోటీసులు జారీ చేసి మిన్నకుండిపోయారు.  లావేరు మండలం వెంకటాపురం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు తన సతీమణితో కలిసి వైసీపీ పాదయాత్రలో పాల్గొన్నారు. పార్టీ కండువా ధరించి మరీ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ చిత్రం మీడియాలో బహిర్గతమైనా ఉపాధ్యాయుడిపై చర్యలు లేవు.


 టెక్కలిలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు...

టెక్కలి నియోజకవర్గ పరిధిలో ఇద్దరు వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ నియోజకవర్గానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇద్దరు వైసీపీ నేతల్లో ఒకరు తనకు అధిష్టానం వద్ద పెద్ద పేరుందని చెప్పుకుంటూ హవా కొనసాగిస్తున్నారు. ఆ నేతకు ఎటువంటి పదవి లేకపోయినా తనను  కలవాలని ఉద్యోగులకు హకుం జారీ చేశారు. దీంతో  కొందరు జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి ఉద్యోగులు ఆయన్ను తరచూ కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే ఉండగా.. సదరు వైసీపీ నేత ప్రొటోకాల్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఏకంగా ఉద్యోగులు, అధికారులతో సభలు, సమావేశాలు నిర్వహించడమే కాకుండా అభివృద్ధి పనులపై తరచూ సమీక్షిస్తున్నారు. దీనికి జిల్లాస్థాయిలో కీలక స్థానంలో ఉన్న ఓ ఉన్నతాధికారే కారణమని చెబుతున్నారు. దీంతో అదే పార్టీకి చెందిన కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ ప్రొటోకాల్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. దీంతో టెక్కలి నేతను తరచూ కలుస్తున్న ఒక జిల్లా స్థాయి అధికారితో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన  ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. ఎస్‌ఎస్‌ఆర్‌ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై వివరణ ఇవ్వాలని ఉద్యోగులను కోరినట్లు సమాచారం. 


పార్టీతో మమేకం అవుతూ...

వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఓ దిగువ స్థాయి ఉద్యోగి జిల్లాకు చెందిన ఒక సీనియర్‌ మంత్రి వద్ద పీఎస్‌గా పనిచేస్తున్నారు. ఈ ఉద్యోగి మంత్రి పర్యటన స్వాగత బ్యానర్లపై తన ఫొటో కూడా వేయించుకొని నాయకుడిలా ఫోజులిచ్చారు. మంత్రి పర్యటించే మండలాల్లోని నాయకులకు పీఎస్‌ స్వయంగా ఫోన్‌చేసి స్వాగత బ్యానర్‌లో మంత్రితో పాటు తన ఫొటో వేయాలని సూచించినట్లు సమాచారం. టెక్కలిలో ఇటీవల ఒక కార్యక్రమంలో ఆ ఉద్యోగి ఫొటోలు ఉన్న స్వాగత బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. 


ఉద్యోగుల తీరుపై చర్చ....

టెక్కలి, ఎచ్చెర్ల, ఆమదాలవలస నియోజకవర్గాల్లోనే కాదు.. జిల్లాలోని చాలా మండలాల్లో ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రజాప్రతినిధుల ప్రాపకం పాకులాడుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. తమ వర్గానికి చెందిన నేతల అండదండలతో కొందరు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ముసుగేసుకున్న మరికొందరు ఇలా జిల్లాలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పెద్దలను ప్రసన్నం కోసం వెంపర్లాడుతున్నారు. ప్రజాప్రతినిధుల అండదండలతో చాలామంది ఉద్యోగులు ఏళ్లతరబడి బదిలీ ప్రస్తావన లేకుండా పబ్బం గడిపేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మొన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీ పాలకులతో సత్సంబంధాలు నెరిపిన కొందరు ఉద్యోగులే మళ్లీ ఇప్పుడు చక్రం తిప్పుతుండడం విశేషం. ఎవరు అధికారంలోకి వస్తే వారి పంచన చేరడం, తమ బదిలీలు జరగకుండా చూడడం, ఇతర కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా నేతలతో పబ్బం గడపడం వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. అదేవిధంగా నేతలకు ముడుపులు సమర్పిస్తూ కొందరు అధికారులు ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తూ... పార్టీ కార్యక్రమాల్లో దర్జాగా మునిగి తేలుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

Updated Date - 2020-11-20T05:10:36+05:30 IST