నిరుద్యోగ యువతకు తోడ్పాటు

ABN , First Publish Date - 2020-11-22T05:14:53+05:30 IST

నిరుద్యోగ యువతకు సదావకాశం కల్పిస్తూ.. సబ్సిడీపై సరుకు రవాణా వాహనాలను మంజూరు చేయనున్నట్లు కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. దీనికి సంబంధించి ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లతో కలెక్టర్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

నిరుద్యోగ యువతకు తోడ్పాటు
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

  సబ్సిడీపై సరుకు రవాణా వాహనాలు

 27లోగా దరఖాస్తు చేసుకోవాలి

 పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక 

 కలెక్టర్‌ నివాస్‌ 

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, నవంబరు 21: నిరుద్యోగ యువతకు సదావకాశం కల్పిస్తూ.. సబ్సిడీపై సరుకు రవాణా వాహనాలను మంజూరు చేయనున్నట్లు కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. దీనికి సంబంధించి ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లతో కలెక్టర్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బియ్యం కార్డుదారుల ఇళ్ల వద్దకే  బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను వాహనాల ద్వారా నేరుగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం సరుకు రవాణా వాహనాలను ప్రజాపంపిణీ వ్యవస్థతో అనుసంధానం చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు సబ్సిడీపై వాహనాలు అందించేం దుకు చర్యలు చేపట్టింది. లబ్ధిదారుని వాటా కింద రూ.58,119 (పది శాతం) చెల్లించాలి. బ్యాంకు రుణం కింద రూ.1,74,357 (30 శాతం) అందిస్తుంది. సబ్సిడీ రూ.3,48,714 ఉంటుంది. అర్హత గల నిరుద్యోగులు స్థానిక గ్రామ, వార్డు సచివాల యాల్లో ఈనెల 27వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. సంక్షేమ సహాయకుల నుంచి దరఖాస్తును ఉచితంగా పొందవచ్చు. ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో డిసెంబరు 4న సంబంధిత మండల, మునిసిపల్‌, కార్పొరేషన్‌ కార్యాలయాల్లో  లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. దరఖాస్తుల సరఫరా, స్వీకరణ పారదర్శకంగా నిర్వహించాలి. పరిశ్రమల సర్వేలో భాగంగా మండలాల్లో ఉన్న నమోదైన పరిశ్రమలు, నమోదు కాని పరిశ్రమలను కూడా సర్వే చేయాలి. ఏ ఒక్క పరిశ్రమనూ విడిచి పెట్టరాదు. వాస్తవమైన డేటా ఉండాలి.’ అని తెలిపారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్లు సుమిత్‌కుమార్‌, శ్రీనివాసులు, డీటీసీ వడ్డి సుందర్‌, డీఎస్‌వో వెంకటరమణ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రామారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-22T05:14:53+05:30 IST