అయ్యప్ప విగ్రహం.. నాలుగు దశాబ్దాల కిందటిది
ABN , First Publish Date - 2020-08-11T10:03:44+05:30 IST
సారవకోట మండలం కోదడ్డపనస గ్రామ సమీప కొండపై పుట్టలో లభ్యమైన అయ్యప్పస్వామి విగ్రహం సుమారు 40 ఏళ్ల కిందటిదని పురావస్తు ..

పురావస్తు శాఖ ఏడీ వెంకటరావు
సారవకోట, ఆగస్టు 10: సారవకోట మండలం కోదడ్డపనస గ్రామ సమీప కొండపై పుట్టలో లభ్యమైన అయ్యప్పస్వామి విగ్రహం సుమారు 40 ఏళ్ల కిందటిదని పురావస్తు శాఖ ఏడీ ఎస్.వెంకటరావు అభిప్రాయపడ్డారు. కొండపై నీలి రాతి అయ్యప్పస్వామి విగ్రహం పుట్టలో లభ్యమైన విషయం పాఠకులకు తెలిసిందే.
దీనిపై పత్రికల్లో టీవీల్లో కథనాలు రావడంతో విశాఖపట్నంకు చెందిన పురావస్తు శాఖ ఏడీ వెంకటరావు సోమవారం కోదడ్డపనస గ్రామ కొండపై ఉన్న అయ్యప్పస్వామి విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ పెట్టిన సన్ని గొడ్డ, పాదాలు మాత్రం పురాతనమైనవన్నారు. ఈ కొండ చుట్టూ ఏవైనా వస్తువులు లభిస్తాయన్న ఆలోచనతో పరిశీలించామన్నారు. పూర్తి నివేదిక కలెక్టరుకు నివేదిస్తామన్నారు. ఆయనతో పాటు తహసీల్దారు బి.రాజమోహన్, ఎంపీడీవో ఎం.ఈశ్వరరావు, ఎస్ఐ వై.రవికుమార్, మాజీ సర్పంచ్ లు బోర ధర్మారావు, కత్తిరి వెంకటరమణ తదితరులు ఉన్నారు.
పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం:గ్రామస్థులు
మా గ్రామ సమీప కొండపై అయ్యప్పస్వామి విగ్రహం లభించడంతో దీనిని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని గ్రామస్థులు పేర్కొన్నారు. సోమవా రం శ్రీరామ మందిరం వద్ద సమావేశమై చర్చించారు. కొండకు తూర్పున చెరువు, పడమర, దక్షిణ దిశగా వంశధార కాలువ ఉందని, కేరళలో తరహాలో ఇక్కడ కూడా రెండో పుణ్యక్షేత్రంగా రూపు దిద్దాలని పలువురు తమ అభిప్రాయపడ్డారు. ఎంత నిధులైనా ఆలయం కట్టేందుకు గ్రామస్థులు నిర్ణయించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు విరాళాలు ప్రకటించారు. అయ్యప్పస్వామి గురువైన బగ్గు జగన్ స్వామి అధ్వర్యంలో ఆలయం నిర్మించేందుకు నిర్ణయించారు. ఈ కొండపైకి విద్యుత్ సరఫరాకు ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు హామీ ఇచ్చారని కత్తిరి వెంకటరమణ తెలిపారు.