సిక్కోలులో.. మాటల మంటలు!

ABN , First Publish Date - 2020-10-07T19:29:50+05:30 IST

జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రస్తుతం ఎటువంటి ఎన్నికలు లేకున్నా..

సిక్కోలులో.. మాటల మంటలు!

డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ వ్యాఖ్యలతో దుమారం

వైసీపీ, టీడీపీ నేతల మధ్య వివాదం

ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న  వైనం

పోలీస్‌స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రస్తుతం ఎటువంటి ఎన్నికలు లేకున్నా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార, ప్రధాన విపక్ష నేతలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకుంటున్నారు. పత్రికా సమావే శాలు ఏర్పాటుచేసి దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కొద్దిరోజుల కిందట డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌  నరసన్నపేటలో చేసిన వ్యాఖ్యలే ఈ మంటలకు కారణం. విపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి ఆయన పురుష పదజాలం ఉపయోగించడం... మీడియాలో రాసుకోండి అని వ్యాఖ్యానించడం... అవి వివాదా స్పదం కావడంతో మార్ఫింగ్‌ చేశారని  ఆరో పించడం తెలిసిందే. అటు తరువాత డిప్యూటీ సీఎం మౌనం దాల్చినా టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగు తోంది. అందరి సమక్షంలో సభా వేదికపై మైకు పట్టుకొని మరీ నోరుజారిన అమాత్యుడికి అండగా వైసీపీ నాయకులు నిలిచేందుకు ఉత్సాహం చూపుతున్నారు. 


ఈ విషయంపై  ఆ తరువాత ఆయన ఎక్కడా మాట్లాడడం లేదు. అంటే తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లే భావించాల్సి వస్తోం ది.  కానీ ఆయన అనుచర గణం మాత్రం మంత్రి  మాటలు వక్రీకరించారంటూ గగ్గోలు పెడుతున్నారు.ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి అందరి ముందు, సభలో ప్రతిపక్ష నేతను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి టీడీపీ నేతలు కూడా దీటుగా బదులిస్తున్నారు.  తమ అధినేతను కించపరుస్తూ మాట్లాడతారా అంటూ వైసీపీ శ్రేణులపై మండిపడుతున్నారు. గత మూడు రోజులుగా ఇరు పార్టీల నేతలు  ‘తప్పు మీదంటే... కాదు మీదే’ అంటూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. 


ఏకతాటిపైకి తెలుగుదేశం శ్రేణులు

మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో  టీడీపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌, మహిళా నేత గౌతు శిరీష తదితరులు డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఆక్షేపించారు. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసు కోవాలని నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. అటు తరువాత వైసీపీ శ్రేణులు కూడా ఈ ఘటనపై స్పందించాయి.   తమ మాటలు వక్రీకరించారంటూ ఆరోపించారు. కొందరు నేతలు మంత్రి మెప్పు కోసం నానా హడావుడి సృష్టించారు. నోరు జారిన అమాత్యుడు మౌనంగా ఉన్నా, కొందరు వైసీపీ నాయకులు మాత్రం అదే పనిగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ టీడీపీ నాయకులపై ఎదురు దాడికి దిగుతున్నారు. మరో మంత్రి ఏకంగా పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలు రికార్డెడ్‌గా ఉన్నా, అది మార్ఫింగ్‌ అంటూ వైసీపీ నేతలు మడత పేచీ పెట్టడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. 



Read more