దయనీయం!

ABN , First Publish Date - 2020-04-28T18:21:50+05:30 IST

ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని..

దయనీయం!

ఊరు పొమ్మంది.. అధికారులు పట్టించుకోరు

ఓ యువకుడి దీనగాథ


పాతపట్నం(శ్రీకాకుళం): ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని అధికారులు ఆదేశిస్తున్నారు. కానీ వ్యయప్రయసలకోర్చి స్వగ్రామాలకు చేరుతున్న వలస కూలీల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ‘నాకు స్వీయ గృహ నిర్బంధానికి అవకాశం ఇవ్వండి... లేకుంటే క్వారంటైన్‌ కేంద్రానికైనా తరలించండి’ అంటూ ఓ యువకుడి ఆవేదనను ఎవరూ పట్టించుకోవడం లేదు. రోజంతా మండుటెండలో తిరుగుతూ కనిపించిన ఆ యువకుడు చివరకు విలేకరులకు తన గోడును వెళ్లబోసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. 


పాతపట్నం మండలంలోని ఆర్‌ఎల్‌పురం పంచాయతీ అనంతగిరికి చెందిన యువకుడు రాజ్‌కుమార్‌ చెన్నైలో దినసరి కూలీ. కుటుంబంతో కలిసి కొద్దిరోజుల కిందట వలస వెళ్లాడు సమీప బంధువులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు లాక్‌డౌన్‌కు ముందుగానే గ్రామానికి చేరుకున్నారు. యువకుడు మాత్రం లాక్‌డౌన్‌లో చిక్కుకున్నాడు. అక్కడ ఆశ్రయం లేక ఎలాగోలా సోమవారం పాతపట్నం చేరుకున్నాడు. తహసీల్దారు కార్యాలయాన్ని ఆశ్రయించగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఇదే విషయంపై గ్రామంలోని వలంటీరుకు ఫోన్‌చేయగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న తరువాతే గ్రామానికి రావాలని సూచించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించగా వారు పంచాయతీ కార్యదర్శిని కలవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శిని కలవగా.. కాగువాడలోని ప్రత్యేక క్లినిక్‌కు వెళ్లాలని తెలిపారు. తీరా అక్కడకు వెళ్తే  తన వివరాలు స్థానికంగా అందుబాటులో లేవని చెబుతున్నారని   యువకుడు కన్నీటిపర్యంతమయ్యాడు. ఉన్నతాధికారులు స్పందించి స్వీయ గృహ నిర్బంధానికో... క్వారంటైన్‌ కేంద్రానికో తరలించాలని వేడుకుంటున్నాడు.

Updated Date - 2020-04-28T18:21:50+05:30 IST