అడవి మాటున అక్రమాలు!

ABN , First Publish Date - 2020-11-06T18:17:27+05:30 IST

జిల్లాలో గ్రానైట్‌ మాఫియా మళ్లీ కోరలు..

అడవి మాటున అక్రమాలు!

సొంటినూరు కొండపై నేతల కన్ను

గ్రానైట్‌ తవ్వకాల కోసం దరఖాస్తు

అధికారులపై తీవ్ర ఒత్తిడి

వేగంగా కదులుతున్న ఫైలు

ఇప్పటికే గుట్టుగా క్వారీయింగ్‌


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రానైట్‌ మాఫియా మళ్లీ కోరలు చాస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది నేతలు రెచ్చిపోతున్నారు. రూ.కోట్ల విలువైన గ్రానైట్‌ నిక్షేపాలు ఎక్కడున్నా,  వెతికి మరీ ఆక్రమించి సొంతం చేసుకొనేందుకు పైరవీలు సాగిస్తున్నారు. మొన్న కొత్తూరు మండలం గురండి కొండపై గురిపెట్టిన మాఫియా.. ఇప్పుడు నందిగాం మండలంలో సొంటినూరు రిజర్వు ఫారెస్టుపై కన్నేసింది. అధికారపార్టీ అండతో ఇక్కడ గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతి పొందేలా ఇద్దరు నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టి.. గ్రానైట్‌ను కొల్లగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. 


టెక్కలి రెవెన్యూ డివిజన్‌లోని పలు అటవీ ప్రాం తాల్లో కొన్నేళ్లుగా గ్రానైట్‌ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ అక్రమ వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష నేతల ప్రమేయం ఉండడంతో  అధికారులు ఎటు వంటి చర్యలు తీసుకోవడం లేదు. టెక్కలి రెవెన్యూ డివిజన్‌లోని నందిగాం మండలం సొంటినూరు గ్రామా నికి ఆనుకొని కొండ ఉంది. ఈ కొండను ఆనుకొని పలు గిరిజన గ్రామాలు ఉన్నాయి. సొంటినూరు కొండ.. సుమారు 1650 ఎకరాల్లో విస్తరించి ఉందని అధికారుల గతంలో నిర్వహించిన సర్వేలో తేల్చారు. ఇం దులో కొంత భాగం రిజర్వు అటవీ పరిధిలోకి వస్తుంది. కాగా, ఈ కొండల్లో అపారమైన గ్రానైట్‌ నిల్వలు ఉన్నాయి. అటవీ చట్టం ప్రకారం రిజర్వు ప్రాంతంలో ఎటువంటి గనులు ఉన్నా, తవ్వేందుకు అనుమతులు ఉండవు. కానీ, గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతానికి చెందిన కొందరు గ్రానైట్‌ వ్యాపారులు సొంటినూరు కొండను ఎలాగైనా కొల్లగొట్టి తమ జేబులు నింపుకోవాలని తీవ్ర యత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో గుట్టుగా రెండు అనధికార గ్రానైట్‌ క్వారీలు నడుస్తున్నాయి. యథేచ్ఛగా తవ్వకాలు చేసి.. రాత్రిపూట ఇక్కడ నుంచి గ్రానైట్‌ బ్లాక్‌లను తరలించుకుపోతున్నారు. ఈ తతంగం అంతా గనుల శాఖ, రెవెన్యూ ఉద్యోగులకు తెలిసినా పట్టించుకోవడం లేదు.


మళ్లీ తెరపైకి సొంటినూరు కథ...

2008లో సొంటినూరు కొండపై రాజకీయ ముసుగేసుకున్న ఒక గ్రానైట్‌ వ్యాపారి కన్నేశారు. అప్పట్లో ఈ కొండపై గ్రానైట్‌ తవ్వకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో కళ్లు మూసుకున్న యంత్రాంగం రిజర్వు కొండల్లో గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇచ్చేసింది. దీన్ని స్థానికులు  తీవ్రంగా వ్యతిరేకించారు. క్వారీ వద్దంటూ ఆందోళనలు చేశారు. దీంతో  కోర్టు ఉత్తర్వుల ప్రకారం 2016లో టీడీపీ ప్రభుత్వం సదరు నేతకు సంబంఽధించిన అనుమతులు రద్దు చేసింది. అప్పటి నుంచి ఆ నేత సొంటినూరు కొండ జోలికి వెళ్లలేదు. కానీ.. ప్రస్తుతం తన పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ కొండపై  కన్నేశారు. పైస్థాయి నుంచి జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి మరీ గ్రానైట్‌ కొండను కొల్లగొట్టేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనకు గతంలో మంజూరైన సుమారు 16 హెక్టార్ల గ్రానైట్‌ తవ్వకాలకు పావులు కదుపుతున్నారు. ఈయనతో పాటు మరో వ్యక్తి పేరుతో ఇదే కొండపై సుమారు 10 హెక్టార్ల గ్రానైట్‌ తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఇద్దరు నేతలూ అధికార పార్టీ అండదండలతో పైస్థాయి నుంచి ఒత్తిళ్లు తెస్తుండడంతో జిల్లా యంత్రాంగం కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.


ఆఘమేగాలపై ప్రజాభిప్రాయ సేకరణ

క్వారీకి అనుమతి ఇచ్చేందుకు ఇటీవల సొంటినూరులో ఆగమేఘాల మీద ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఓ ముఖ్య నేత సొంటినూరు క్వారీయింగ్‌కు అనుమతి ఇవ్వాలని హుకుం జారీ చేయడం, దీనికి జిల్లాకు చెందిన మరో ముఖ్య ప్రజాప్రతినిధి సమర్థించడంతో గనులు, రెవెన్యూ శాఖల్లో సొంటినూరు గ్రానైట్‌ లీజు ఫైలు చకచకా కదులుతోంది. గతనెల 21న జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి సొంటినూరులో సమావేశం ఏర్పాటు చేసి, ఏకంగా ప్రజల అభిప్రాయాలను సేకరించారు.  సదరు నేత ప్రజాభిప్రాయ సేకరణ తనకు అనుకూలంగా ఉండేలా చూసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుల్లూరు, సొంటినూరు, చిన్నగోకర్లపల్లి, బైరిబొడ్డపాడుకు చెందిన కొందరు ర్విజర్వు ఫారెస్టులో గ్రానైట్‌ తవ్వకాలను వ్యతిరేకించినా, అధికారులు పట్టించుకోలేదు.  నేతలు చెప్పినట్లే అంతా సవ్యంగా ఉందంటూ, నివేదికలు సిద్ధం చేసినట్లు బోగట్టా. గతంలో ప్రజాభిప్రాయం సేకరించిన సందర్భంలో తీవ్ర వ్యతిరేకత వచ్చినందున సొంటినూరులో గ్రానైట్‌ తవ్వకాలను నిలిపేశారు. ఈ విషయం తెలిసినా అధికార పార్టీ పెద్దల ఆదేశాలను పాటిస్తూ, యంత్రాంగం కూడా ముందుకు వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పచ్చగా ఉన్న సొంటినూరు రిజర్వు కొండల్లో గ్రానైట్‌ తవ్వకాలు జరిపితే పరిసరాల్లో నివాసముంటున్న గిరిజనుల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 


Updated Date - 2020-11-06T18:17:27+05:30 IST