అలర్ట్‌..మరొకరికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-04-28T10:51:04+05:30 IST

కరోనా మహమ్మారి... మరొకరికి సోకింది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా పాతపట్నంలో ఇప్పటికే అతడి అత్త, మామ, మరదలికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

అలర్ట్‌..మరొకరికి పాజిటివ్‌

నాలుగుకి చేరిన కరోనా కేసులు

అధికారికంగా హెల్త్‌ బులెటిన్‌ విడుదల

రెడ్‌జోన్‌గా పాతపట్నం

క్వారంటైన్‌కు 120 మంది తరలింపు

ఆంక్షలు మరింత కఠినతరం 


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 27: కరోనా మహమ్మారి... మరొకరికి సోకింది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా పాతపట్నంలో ఇప్పటికే అతడి అత్త, మామ, మరదలికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తాజాగా అతడి బంధువుల్లో మరొకరికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. మొత్తం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నాలుగుకు చేరుకున్నాయి. వీళ్లందరికీ శ్రీకాకుళం మండలం రాగోలులో ఉన్న జిల్లా కొవిడ్‌ ఆసుపత్రి(జెమ్స్‌)లో చికిత్స అందిస్తున్నారు. వాస్తవానికి ఆదివారానికే జిల్లాలో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. కానీ, సోమవారం అధికారికంగా ప్రభుత్వం హెల్త్‌ బులెటిన్‌ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా క్లోజ్‌ కాంటాక్ట్‌ అయిన వ్యక్తికి సోమవారం చేసిన కరోనా పరీక్షల్లో ట్రూనాట్‌ ద్వారా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. 


తుది నిర్ధారణకుగాను కాకినాడ ప్రయోగశాలకు స్వాబ్‌ను పంపారు. పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు వచ్చినవారు.. ఎవరిని కలిశారు? ఎవరెవరితో మాట్లాడారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. పాతపట్నం మండలంలోని కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలో ఉన్న గ్రామాలను రెడ్‌జోన్‌లో చేర్చేశారు. మరింతగా రాకపోకలను అడ్డుకున్నారు. కేవలం నిత్యావసరాలకు మాత్రమే.. అదీ ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు వచ్చేలా ఆంక్షలు విధించారు.


ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు సైతం రోడ్లపైనే మకాం వేసి లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేస్తున్నారు. మాస్క్‌లు ధరించకుండా బయట తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా.. అధికారులు అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌ స్ర్పే చేయిస్తున్నారు. పారిశుధ్య కార్మికుల నుంచి.. వైద్యుల వరకు అందరికీ ఇప్పటికే శానిటైజర్లను, మాస్కులను పంపిణీ చేశారు. 265 మంది వలంటీర్లు, 265 మంది ఆశ కార్యకర్తలు.. ఐదు బృందాలకు ఒక హెల్త్‌ సూపర్‌వైజర్‌... ఇలా 43 మంది... అలాగే 23 మంది వైద్యులతో ప్రస్తుతం స్ర్కీనింగ్‌ జరుగుతోంది. ఇప్పటివరకు 120 మందిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో చాలావరకు ప్రజలు స్వీయ రక్షణ పాటించి గ్రామాల ముందు కంచెలను ఏర్పాటు చేసుకున్నారు. 

Updated Date - 2020-04-28T10:51:04+05:30 IST