కరోనా గుప్పిట్లో!

ABN , First Publish Date - 2020-12-29T05:07:15+05:30 IST

కరోనా సంవత్సరంగా.. 2020 జిల్లావాసుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంది. ప్రశాంతమైన సిక్కోలులో కరోనా కలకలం సృష్టించింది. తొలిదశలో పాజిటివ్‌ కేసుల ప్రభావం పెద్దగా లేకపోయినా.. తర్వాత ఉధృతి పెరిగింది. జిల్లావ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 351 మందిని బలిగొంది. వైరస్‌ భారిన పడిన ఎన్నో కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఎంతోమంది కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి కరువైంది. శుభకార్యాలు కళ తప్పాయి. రవాణా వ్యవస్థ తలకిందులైంది. సినిమాహాళ్లు మూతపడి వినోదం సైతం దూరమైంది. ఇలా ఈ ఏడాదంతా కరోనా మహమ్మారి.. జిల్లావాసులను కలవరపాటుకు గురిచేసింది.

కరోనా గుప్పిట్లో!
స్వగ్రామాలకు చేరుకుంటున్న వలసజీవులు (ఫైల్‌)

సిక్కోలువాసులపై ‘వైరస్‌’ పంజా

జిల్లాలో ఇప్పటివరకూ 351 మంది మృతి

వలస కూలీలపై పెను ప్రభావం

ఎంతోమంది ఉపాధికి దూరం

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

కరోనా సంవత్సరంగా.. 2020 జిల్లావాసుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకుంది. ప్రశాంతమైన సిక్కోలులో కరోనా కలకలం సృష్టించింది. తొలిదశలో పాజిటివ్‌ కేసుల ప్రభావం పెద్దగా లేకపోయినా.. తర్వాత ఉధృతి పెరిగింది. జిల్లావ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 351 మందిని బలిగొంది. వైరస్‌ భారిన పడిన ఎన్నో కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఎంతోమంది కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి కరువైంది. శుభకార్యాలు కళ తప్పాయి. రవాణా వ్యవస్థ తలకిందులైంది. సినిమాహాళ్లు మూతపడి వినోదం సైతం దూరమైంది. ఇలా ఈ ఏడాదంతా కరోనా మహమ్మారి.. జిల్లావాసులను కలవరపాటుకు గురిచేసింది. 

---------------

వలసల జిల్లాగా పేరొందిన సిక్కోలులో ఈ ఏడాది కరోనా వైరస్‌.. కలకలం సృష్టించింది. ఈ వైరస్‌ భారిన పడి ఎంతో మంది అనారోగ్యం పాలయ్యారు. వీరిలో 351 మంది మృతిచెందినట్టు అధికారికంగా ప్రకటించారు. వైరస్‌ వ్యాప్తి తొలిదశలో జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. కానీ వలసజీవుల రాకతో కరోనా ఉధృతి పెరిగింది. జిల్లాలో లక్షలాది మంది వలస కూలీలు ఉన్నారు. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, పలాస, సోంపేట, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, సారవకోట, ఎల్‌.ఎన్‌.పేట, జలుమూరు, పోలాకి, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల నుంచి అధిక శాతం మంది ఉపాధి కోసం వలసబాట పట్టారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబంగతో పాటు కువైట్‌, లిబియా, దుబాయ్‌ వంటి విదేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వీరంతా ఏటా దసరాకో.. సంక్రాంతికో... క్రిస్మస్‌కో... ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు మాత్రమే స్వగ్రామాలకు వచ్చేవారు. కొన్నిరోజులు ఉండి తిరుగు పయనమయ్యేవారు. కానీ ఈ ఏడాది కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా కేంద్రం లాక్‌డౌన్‌ విధించింది. దీంతో వారంతా స్వగ్రామాలకు చేరుకున్నారు. వలసజీవులు అందరినీ అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి.. కరోనా పరీక్షలు చేశారు. ఈ క్రమంలో చాలా మందిలో పాజిటివ్‌ లక్షణాలు బయటపడేవి. లాక్‌డౌన్‌ నెలల తరబడి కొనసాగడంతో వలసజీవులంతా ఉపాధి కోల్పోయారు. ప్రైవేటు ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు సైతం రోడ్డున పడ్డారు. ఉపాధి లేక ఇప్పటికీ ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వివాహాది శుభకార్యాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఉత్సవంలా నిర్వహించాల్సిన వివాహాలు, గృహ ప్రవేశాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈ రంగంపై ఆధారపడిన సప్లయర్స్‌, కేటరింగ్‌ కార్మికులు, కల్యాణ మండపాల నిర్వాహకులంతా ఉపాధి కోల్పోయారు.  ప్రజలు వినోద కార్యక్రమాలకూ దూరమయ్యారు. థియేటర్లు మూతపడడంతో వీటిపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయారు. మరోవైపు విద్యాసంస్థలు మూతపడడంతో ప్రైవేటు ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు. ఇంకోవైపు రవాణా రంగం తలకిందులైంది. కనీసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలన్నా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటున్నా.. మరోవైపు రెండో దశ కరోనా వ్యాప్తి భయం.. జిల్లావాసులను వెంటాడుతూనే ఉంది. 


ఐదుతో మొదలై... వేలకు చేరి...


జిల్లాలో మార్చిలో ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదు. ఏప్రిల్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన వారి కుటుంబంలో కేవలం ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కరోనా ఉధృతి పెరిగింది. మే నెలలో 143, జూన్‌లో 587, జూలైలో 6,435, ఆగస్టులో 17,982, సెప్టెంబర్‌లో 15,062, అక్టోబరులో 4108, నవంబరులో 1,437, డిసెంబరులో ఇప్పటివరకూ 212 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 


పరీక్షల నిర్వహణలో ముందంజ


కరోనా పరీక్షల నిర్వహణలో రాష్ట్రంలోనే సిక్కోలు ముందంజలో ఉంది. జిల్లాలో ఇప్పటివరకూ 7,61,715 నమూనాలు సేకరించగా.. పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య 46,213కు చేరింది. వీరిలో ఇప్పటికే చాలా మంది కోలుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 62 మంది, కొవిడ్‌కేర్‌ సెంటర్‌లో 6 మంది, కొవిడ్‌ ఆస్పత్రుల్లో 37 మంది చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ ఆస్పత్రి నుంచి సోమవారం 18 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 


మొత్తం 351 మంది మృతి


కొవిడ్‌ రాకాసి జిల్లాలో మొత్తం 351 మందిని బలిగొంది. వీరంతా కరోనాతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారికంగా యంత్రాంగం ప్రకటించింది. ఆసుపత్రిల్లో చేరి.. కరోనా తగ్గినప్పటికీ మూత్రపిండాలు పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల వైఫల్యం.. గుండె పోటు వంటివి సంభవించి కొంతమంది మృతిచెందారు. సామాన్యులు, పేదలు, రైతులు, ఉద్యోగులు, ప్రముఖులు ఇలా కరోనా భారినపడి అసువులు బాశారు. తొలుత కరోనా మృతుల అంత్యక్రియల్లోనూ మానవ సంబంధాలు మంట కలిసిపోయాయి. కలెక్టర్‌ నివాస్‌ చొరవతో పరిస్థితులు సద్దుమణిగాయి. ఈ నెలలో పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.  

Updated Date - 2020-12-29T05:07:15+05:30 IST