ప్రభుత్వానికి చెంపపెట్టు

ABN , First Publish Date - 2020-05-30T10:35:52+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరో మొట్టికాయ వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగెడ్డ రమేష్‌కుమార్‌ తొలగింపు వ్యవహారంపై శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ..

ప్రభుత్వానికి చెంపపెట్టు

నిమ్మగెడ్డ రమేష్‌కుమార్‌ను ఈసీగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశం

తీర్పును స్వాగతించిన టీడీపీ నేతలు

ఇకనైనా జగన్‌ తీరు మార్చుకోవాలని హితవు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/టెక్కలి/ఎచ్చెర్ల/రాజాం)

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరో మొట్టికాయ వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగెడ్డ రమేష్‌కుమార్‌ తొలగింపు వ్యవహారంపై శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కొట్టేసింది. నిమ్మగెడ్డ రమేష్‌కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడేలా రాష్ట్ర  ఉన్నత న్యాయస్థానం వరుసగా తీర్పులను వెలువరించడం శుభ పరిణామమని తెలుగుదేశం పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ పరిణామం జగన్‌ సర్కారుకు చెంపపెట్టు వంటిందని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను, ప్రతినిధులను కించపరిచేలా కులాలను ఆపాదించడం అమానుషమ ని విమర్శించారు. న్యాయస్థానాల్లో వరుసగా దెబ్బలు తగులుతున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఇకనైనా తీరు మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని హితవు పలికారు.


ప్రజాస్వామ్యం బతికింది

న్యాయస్థానం తీర్పుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తే కమిషనర్‌ రమేష్‌కుమార్‌పై విమర్శలకు దిగారు. కులాన్ని ఆపాదించారు. అక్రమ మార్గంలో పదవి నుంచి తొలగించారు. దీనిని తప్పుపడుతూ హైకోర్టు తీర్పునివ్వడం హర్షణీయం. ఇకనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ రాజీనామా చేయాలి. 

-కింజరాపు అచ్చెన్నాయుడు, టెక్కలి ఎమ్మెల్యే


ప్రభుత్వ తీరు మారాలి

ప్రజాస్వామ్య విలువలను, వ్యవస్థలను కాపాడేలా కోర్టు తీర్పు ఉంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బే. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అక్రమంగా తొలగించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్‌, దానికి సంబంధించిన జీవోలను కోర్టు కొట్టివేయడం శుభ పరిణామం. ప్రభుత్వం కక్షతో వ్యవహరించిన వైఖరిని ప్రభుత్వం తప్పుపట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. 

-కిమిడి కళా వెంకటరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు


కనువిప్పు కలగాలి

వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుపడుతున్నా తీరు మార్చుకోకపోవడం విచారకరం.  అడుగడుగునా ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వానికి తాజా తీర్పు చెంపపెట్టు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంది. అందుకే న్యాయస్థానం తప్పుపట్టింది. ఇకనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి.

- గౌతు శిరీష, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు


వ్యక్తి కాదు.. వ్యవస్థలు ముఖ్యం

రాజ్యాంగ వ్యవస్థల గురించి అవహేళనగా మాట్లాడడం తగదు.   ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ సొంత నిర్ణయాలతో మొండిగా ముందుకెళ్తున్న సీఎం జగన్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు. వ్యక్తులు కాదు..వ్యవస్థలు ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలి. రాజ్యాంగ వ్యవస్థల ఔన్నత్యాన్ని కాపాడాలి. కోర్టు తీర్పులతోనైనా తీరు మార్చుకోవాలి. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలి.

-కూన రవికుమార్‌,  ప్రభుత్వ మాజీ విప్‌

Updated Date - 2020-05-30T10:35:52+05:30 IST