ఉసురుతీసిన ఈత సరదా

ABN , First Publish Date - 2020-10-27T09:35:05+05:30 IST

ఈత సరదా ఇద్దరు యువకులను కబళించింది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పండుగపూట దంపతులు సముద్ర స్నానానికి దిగగా అలలకు భార్య కొట్టుకుపోయింది.

ఉసురుతీసిన ఈత సరదా

 భావనపాడు బీచ్‌లో ఇద్దరు యువకుల దుర్మరణం

 భార్యను కాపాడే ప్రయత్నంలో  భర్త, వారిద్దర్నీ రక్షించేందుకు   దిగి యువకుడు గల్లంతు

 మృత్యుంజయురాలిగా ఆమె..

 గంట తరువాత ఒడ్డుకు   ఇరువురి మృతదేహాలు


సంతబొమ్మాళి/పోలాకి/పాతపట్నం, అక్టోబరు 26:  ఈత సరదా ఇద్దరు యువకులను కబళించింది. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పండుగపూట దంపతులు సముద్ర స్నానానికి దిగగా అలలకు భార్య కొట్టుకుపోయింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో భర్త దిగగా ఆయనా గల్లంతయ్యాడు. పక్కన ఉన్న యువకుడు గమనించి వారిద్దర్నీ రక్షించడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె మాత్రమే మృత్యుంజయురాలిగా నిలిచి తీరానికి చేరుకోగా..భర్తతో పాటు కాపాడేందుకు ప్రయత్నించిన యువకుడు  మృతిచెందారు. ఈ విషాద ఘటన సోమవారం మధ్యాహ్నం భావనపాడు తీరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి నౌపడ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. 


పోలాకి మండలం పిన్నింటిపేట సమీపంలోని అప్పారావుపేట కాలనీకి చెందిన పైల సురేష్‌ (34) భార్య కావ్య, రెండేళ్ల కుమారుడు జశ్వంత్‌, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం సముద్ర స్నానానికి వెళ్లారు. కొద్దిసేపు తీరంలో సరదాగా తిరిగిన వారు స్నానానికి దిగారు. అక్కడకు కొద్దిసేపటికే భార్య కావ్య అలలో కొట్టుకుపోయింది. భర్త సురేష్‌ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించి గల్లంతయ్యాడు. పక్కనే స్నేహితులతో కలిసి స్నానం చేస్తున్న పాతపట్నం శివశంకర్‌ కాలనీకి చెందిన పలికిల వంశీ (21) వారిద్దర్నీ కాపాడేందుకు ప్రయత్నించాడు. ఇంతలో కావ్య ప్రాణాలతో  తీరానికి కొట్టుకొచ్చింది. కానీ సురేష్‌, వంశీల ఆచూకీ గల్లంతైంది. దీంతో కుటుంబసభ్యులు, స్నేహితులు వెతికినా ఫలితం లేకపోయింది. గంట తరువాత వారి మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. సురేష్‌ మృతదేహం వద్ద భార్య కావ్య గుండెలలిసేలా రోదించింది. వంశీ మృతదేహం వద్ద స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు.


ఈ ఘటనతో భావనపాడు తీరంలో విషాదఛాయలు నెలకొన్నాయి.  సీమెన్‌గా పనిచేస్తున్న సురేష్‌ లాక్‌డౌన్‌లో ఇంటికి చేరాడు. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వచ్చి మృత్యువాత పడ్డాడు. వంశీ ఎల్‌అండ్‌టీ కంపెనీలో జూనియర్‌ ఇంజనీర్‌గా ఒడిశాలో విధులు నిర్వహిస్తున్నాడు. దసరాకు ఇంటికిరాగా స్నేహితులతో కలిసిన సరదాగా భావనపాడు తీరానికి వచ్చాడు. నౌపడ ఇన్‌చార్జి ఎస్‌ఐ గోవింద్‌ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2020-10-27T09:35:05+05:30 IST