సీఎం అరాచకానికి రైతులు బలి కావాలా?

ABN , First Publish Date - 2020-10-13T08:00:58+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అరాచకానికి రైతులు బలి కావాల్సిందేనా? అని శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ ప్రశ్నించారు.

సీఎం అరాచకానికి రైతులు బలి కావాలా?

దళితుల భూములు అభివృద్ధి చెందకూడదా?

రాష్ట్రానికి ఒకే రాజధాని.. అదే అమరావతి 

శ్రీకాకుళం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌


(శ్రీకాకుళం): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అరాచకానికి రైతులు బలి కావాల్సిందేనా? అని శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌   ప్రశ్నించారు. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. 300 రోజులుగా ఉద్యమిస్తున్న అమరావతి రైతులకు మద్దతుగా టీడీపీ నేతలు జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం శ్రీకాకుళం  తహసీల్దార్‌ కార్యాలయం వద్ద కూన రవికుమార్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిల ఆధ్వర్యంలో ధర్నా చేశారు.


ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కూన రవికుమార్‌ మాట్లాడుతూ.. ‘అమరావతి రైతుల న్యాయ పోరాటానికి అండగా ఉంటాం. రాష్ట్రానికి రాజధాని అమరావతే. అక్కడ రైతుల త్యాగాలకు ఫలితం దక్కాల్సిందే. అందుకే వారికి మద్దతుగా నిరసనలు చేపడుతున్నాం. సీఎం అరాచకానికి, నిరంకుశానికి, ఫ్యాక్షన్‌ రాజకీయాలకు రైతులు బలికావాలా?’ అని ప్రశ్నించారు. ‘తరచూ రైతుల రాజ్యం అని వల్లెవేస్తూ రైతులకే శఠగోపం పెట్టారు. సేద్యానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్రాలు లభ్యంకాని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో హైదరాబాద్‌ నుంచే నూటికి 65శాతం ఆదాయం లభిస్తుంది.


అమరావతి పూర్తయితే ఏకంగా రూ.3లక్షల కోట్లు ఆదాయం లభించేది. అక్కడ 130 సంస్థలకు భూములు ఇవ్వడం వల్ల 12లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగి.. అమరావతి వర్ధిల్లేది. ఉత్తరాంధ్రలో కంటే  ఎక్కువ సంఖ్యలో అమరావతి ప్రాంతంలో దళితులు నివసిస్తున్నారు. దళితుల భూములు అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో అమరావతిని ప్రభుత్వం నాశనం చేస్తోంది’ అని రవికుమార్‌ విమర్శించారు. అంతటా దళితులకు శిరోముండనాలు, దళిత బాలికలపై గ్యాంగ్‌రేప్‌లు, భూములు లాక్కోవడం జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘రీమేక్‌ సినిమాలో హీరో మారినట్లే వైసీపీ ప్రభుత్వ పథకాలు ఉన్నాయి.


పాత పథకాలకే రంగులేస్తూ.. శవాలపైనే కాకుండా, పశువుల కళేబరాలపైనా చిల్లరేరుకుంటున్నారు’ అని ముఖ్యమంత్రి తీరును ఆయన విమర్శించారు. 2024లో వైసీపీని అమరావతి రైతు ఉద్యమమే తుంగలోకి తొక్కుతుందని మంత్రి బొత్సనుద్దేశించి రవికుమార్‌ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ రాష్ట్రానికి ఒకే రాజధాని అని అమరావతికి మద్దతు పలికిన వైసీపీ.. అధికారంలోకి రాగానే  అక్కడి రైతులను ఇబ్బందుల పాల్జేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ తీరు మారాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు ఎం.వెంకటేష్‌, చిట్టి నాగభూషణం, కె.సుశీల, ఎస్‌.సుధాకర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-13T08:00:58+05:30 IST