అమ్మకు.. ఆర్థిక భారం!

ABN , First Publish Date - 2020-10-12T10:46:52+05:30 IST

ప్రభుత్వం విద్యా కానుక పేరుతో పంపిణీ చేసిన యూనిఫారాల కుట్టు చార్జీలు తల్లిదండ్రులకు భారంగా మారాయి.

అమ్మకు.. ఆర్థిక భారం!

 విద్యాకానుక కిట్లలో యూనిఫారాల వస్త్రాల పంపిణీ

 ఒక్కో జతకు ప్రభుత్వం ఇచ్చే కుట్టు కూలి రూ.40 మాత్రమే

 విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం): ప్రభుత్వం విద్యా కానుక పేరుతో పంపిణీ చేసిన యూనిఫారాల కుట్టు చార్జీలు తల్లిదండ్రులకు భారంగా మారాయి. ఒక జత యూనిఫారం కుట్టు చార్జీల కింద  ప్రభుత్వం రూ.40 వంతున ఇవ్వాలని నిర్ణయించింది. 9, 10 తరగతి విద్యార్థులకు సంబంధించి ఒక్కో జతకు రూ.80 చొప్పున చెల్లించనున్నట్టు ప్రకటించింది. బయట మార్కెట్‌లో దర్జీలు ఒక్కో జత యూనిఫారం కుట్టేందుకు రూ.250 నుంచి రూ.300 వరకూ వసూలు చేస్తున్నారు. దీంతో తమపై అదనపు భారం పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం కుట్టు కూలి నిధులు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫారం దుస్తుల కుట్టు భారం తల్లిదండ్రులపై పడుతోంది. ప్రభుత్వం ఇటీవల విద్యార్థులకు ‘విద్యాకానుక’ కిట్లను పంపిణీ ప్రారంభించింది. ఒకసెట్‌ పాఠ్యపుస్తకాలు, మూడు జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, టై, వర్క్‌బుక్స్‌, స్కూలు బ్యాగును ఒక కిట్‌ రూపంలో అందజేస్తోంది. రెండు రోజుల కిందట ప్రారంభమైన పంపిణీ ప్రక్రియ జిల్లాలో ఇంకా కొనసాగుతోంది. ఈ ఏడాది యూనిఫారాలు కుట్టించకుండా.. వస్ర్తాలను విద్యార్థులకు అందజేస్తుండడంతో కుట్టు చార్జీల భారం తమపై పడుతోందని తల్లిదండ్రుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. విద్యా కానుక పథకం కింద జిల్లాలో 3,300 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 2,49,405 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.


కిట్ల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.38.16 కోట్లు కేటాయించింది. కానీ యూనిఫారం  కుట్టు చార్జీలను మాత్రం చాలా స్పల్పంగా నిర్ణయించింది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒక జతకు రూ.40 చొప్పున.. మూడు జతల యూనిఫారాల కుట్టు కూలి కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.120 వంతున త్వరలో జమ చేస్తామని ప్రకటించింది.  9, 10 తరగతులకు సంబంధించిజతకు రూ.80 చొప్పున చెల్లిస్తామని స్పష్టం చేసింది. పాఠశాలలు ప్రారంభించేలోగా యూనిఫారాలు కుట్టించుకోవాలని సూచించింది.


టైలర్లు ఒక్కో జత యూనిఫాం కుట్టేందుకు రూ.250 నుంచి రూ.300 వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో జతకు రూ.40 చొప్పున ఇస్తామని ప్రకటించినా.. ఇంతవరకూ ఆ నిధులు జమ చేయలేదు. దీంతో తమపై ఆర్థిక భారం పడుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో యూనిఫారాలను విద్యాశాఖ ఆధ్వర్యంలోనే కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేసేవారు.


మహిళా సంఘాలకు, కొందరు టైలరింగ్‌ కాంట్రాక్టర్లకు టోకుగా యూనిఫారాల కుట్టు బాధ్యతలు అప్పగించేవారు. అయితే కొన్నిచోట్ల విద్యార్థులకు పంపిణీ చేసిన దుస్తుల్లో కొలతలు తేడా రావడంతో వేసుకోవడానికి పనికిరాకుండా పోయేవి. దీంతో కొంతమంది తల్లిదండ్రులు మళ్లీ కొత్త యూనిఫారాలు కొనుగోలు చేసుకుని కుట్టించుకునే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు వస్ర్తాలను పంపిణీ చేస్తే.. సరైన కొలతల్లో కుట్టించుకుంటారని భావించింది.


ఇంతవరకు బాగానే ఉన్నా.. కుట్టు చార్జీల పెంపు విషయంలో కనీస ఆలోచన చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో టోకుగా మహిళా సంఘాలకు ఒక్కో జతకు రూ.40 ఇవ్వగా,.. వ్యక్తిగతంగా కుట్టుంచుకునేందుకు కూడా అదే ధర నిర్ణయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కుట్టు కూలి మొత్తాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Updated Date - 2020-10-12T10:46:52+05:30 IST