‘జగనన్న తోడు’.. రుణానికి దూరం!

ABN , First Publish Date - 2020-10-12T10:44:21+05:30 IST

‘జగనన్న తోడు’ పఽథకానికి జిల్లాలో స్పందన కరువవుతోంది. కరోనా వేళ..

‘జగనన్న తోడు’.. రుణానికి దూరం!

 చిరు వ్యాపారుల్లో కనిపించని ఆసక్తి

 6,492 మంది వలంటీర్ల పరిధిలో దరఖాస్తులు నిల్‌

 రుణం తక్కువ కావడమే ప్రధాన కారణం


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి): ‘జగనన్న తోడు’ పఽథకానికి జిల్లాలో స్పందన కరువవుతోంది. కరోనా వేళ.. చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం రూ.10వేల చొప్పున రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కానీ వ్యాపారుల్లో ఈ పథకంపై  ఆసక్తి కనిపించడం లేదు. దీంతో గడువు ముగుస్తున్నా.. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు అందలేదు. జిల్లాలో ఇప్పటివరకు 36,321 దరఖాస్తులు నమోదయ్యాయి.


జిల్లాలో 15,052 మంది గ్రామ, వార్డు వలంటీర్లు ఉండగా... 8,560 మంది పరిధిలోనే దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన 6,492 మంది వలంటీర్ల పరిధిలో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఇటీవల శ్రీకాకుళం నగరంతో పాటు జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో సచివాల యాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తులు చాలా తక్కువ రావడంపై వలంటీర్లను ప్రశ్నించారు. దరఖాస్తుల నమోదుకు చిరు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని వారు బదులిచ్చారు.


రుణం తక్కువ కావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గతంలో వ్యాపారులకు వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.లక్షల్లో రుణాలు అందేవి. అందులో సబ్సిడీ లభించేది. దీంతో రుణాల కోసం పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చేవి. ప్రస్తుతం ఈ పఽథకం ద్వారా వచ్చే రుణం తక్కువగా ఉండటంతో పాటు బ్యాంకుల చుట్టూ పలుసార్లు తిరిగే కంటే వదులుకోవడమే మేలని చాలామంది వ్యాపారులు భావిస్తున్నారు. తీసుకున్న రుణాన్ని ఆరు నెలల్లోనే తిరిగి చెల్లించాల్సి ఉండడంతో వ్యాపారులు ఈ పథకంపై ఆసక్తి చూపడం లేదు.


ఈ నేపథ్యంలో ఈ పథకంపై వ్యాపారులకు మరింత అవగాహన కల్పిస్తున్నారు. ‘ప్రధాని సన్నిధి’ పథకం లబ్ధిదారులు మినహా మిగిలిన వ్యాపారులకు ఈ పథకం అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వలంటీర్లు తమ పరిధిలోని చిరు వ్యాపారులందరినీ కలిసి దరఖాస్తు చేయాలని కోరుతున్నారు. 


నిబంధనలివీ.. 

జగనన్న తోడు పథకానికి చిరు వ్యాపారులు అర్హులు. ఫుట్‌పాత్‌లపై పండ్లు, కూరగాయలు, అల్పాహారం, ఆహార పదార్థాలు విక్రయించేవారు, తోపుడు బండ్లు, ఆటోలు, చక్రాల బండ్లు, సైకిళ్లు, తలపై బుట్టలు పెట్టుకొని వస్తువులు అమ్మేవారు... వాహనాలపై వ్యాపారాలు చేసేవారు అర్హులు. యంత్ర సాయం లేకుండా నైపుణ్యంతో వస్తువులు తయారుచేసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


18 సంవత్సరాలు నిండినవారై ఉండాలి. గ్రామీణ ప్రాంతాల వారైతే రూ. 10వేల లోపు ఆదాయం ఉండాలి. మూడెకరాల మాగాణి, పదెకరాలు మెట్ట భూమి ఉండవచ్చు. దరఖాస్తు చేస్తే బ్యాంకుల నుంచి రూ.10వేలు అందిస్తారు. ఆరు నెలల్లో తిరిగి చెల్లించాలి. బ్యాంకులు అంగీకరిస్తే ఎక్కువ మొత్లాల్లోనూ రుణాలు పొందొచ్చు. 


అవగాహన కల్పిస్తున్నాం

జేసీ శ్రీనివాసులు 

‘జగనన్న తోడు’ పథకానికి చిరు వ్యాపారులు దరఖాస్తు చేసుకునేలా అవగాహన పెంపొందిస్తున్నాం. సచివాలయాల వారీగా సమీక్షలు నిర్వహిస్తునే ఉన్నాం. కొన్ని చోట్ల దరఖాస్తులు అందుతున్నాయి. వ్యాపారస్తులకు అవగాహన పెరిగితే మరిన్ని దరఖాస్తులు వస్తాయి.

Updated Date - 2020-10-12T10:44:21+05:30 IST