లక్ష్మీనగర్‌ పాఠశాల హెచ్‌ఎంకు బదిలీ!

ABN , First Publish Date - 2020-10-07T09:59:53+05:30 IST

ఏటా పదో తరగతిలో శతశాతం ఫలితాలు... ట్రిపుల్‌ ఐటీకి పదుల సంఖ్యలో ఎంపిక... మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు...

లక్ష్మీనగర్‌ పాఠశాల హెచ్‌ఎంకు బదిలీ!

విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన

అధికారుల తీరుపై విమర్శలు


 ఆమదాలవలస, అక్టోబరు 6: ఏటా పదో తరగతిలో శతశాతం ఫలితాలు... ట్రిపుల్‌ ఐటీకి పదుల సంఖ్యలో ఎంపిక... మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు... కంప్యూటర్‌ విద్య..ఇలా రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలుస్తోంది ఆమదాలవలస మునిసిపాల్టీలోని లక్ష్మీనగర్‌ పాఠశాల. అందుకే అక్కడ అడ్మిషన్లకు విపరీతమైన పోటీ. ఆ పాఠశాలలో సీటు కోసం రాజకీయ నేతల సిఫారసుల వరకూ పరిస్థితి వెళ్లిందంటే బోధన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ గుర్తింపు వెనుక పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణ, ఇతర ఉపాధ్యాయుల విశేష కృషి ఉంది.


కానీ అక్కడ  ఫలితాలు... విద్యా ప్రమాణాల కంటే ‘అధికారానికే’ ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. హెచ్‌ఎం రామకృష్ణను ‘అధికార’ కారణాలతో ఆకస్మికంగా బదిలీ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేవలకు బహుమానం బదిలీనా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆయనను అక్కడే కొనసాగించాలని కోరుతున్నారు. 


బదిలీ వెనుక కథ ఇదీ...

వాస్తవానికి ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సైతం లక్ష్మీనగర్‌ పాఠశాలలో  చేరుతున్నారు. సామాన్య, పేద విద్యార్థులు అధికశాతం అక్కడ చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనిపై ప్రైవేటు పాఠశాలలూ కొంత గుర్రుగా ఉన్నాయి. ఈ పాఠశాలలో చేరేందుకు ఎలాంటి సిఫారసులకు తావులేకుండా.. ప్రతిభనే కొలమానంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన చోటా నాయకుడు ఒకరు తనకు కావాల్సిన వారికి అడ్మిషన్‌ కావాలని హెచ్‌ఎంపై ఒత్తిడి తెచ్చారు.


కానీ హెచ్‌ఎం వినకపోవడంతో చోటా నాయకుడు మనసులో పెట్టుకున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సైతం తోడుకావడంతో హెచ్‌ఎం రామకృష్ణను చింతాడ పాఠశాలకు బదిలీ చేయించారు. అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని ఇచ్ఛాపురం పంపించి... అక్కడి ఉపాధ్యాయుడిని లక్ష్మీనగర్‌ పాఠశాలకు తెప్పించాలనేది  చోటా నాయకుడి పన్నాగం. ఇందుకుగాను ఆ ఉపాధ్యాయుడితో రూ.లక్షల్లో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. అటు తనకు అనుకూలంగా ఉన్న ఉపాధ్యాయుడిని ఇక్కడికి తెచ్చుకోవాలనుకోవడం...ఇటు తన మాటను ఇక్కడి హెచ్‌ఎం వినకపోవడం వంటి కారణాలతో ఆ చోటా నేత చక్రం తిప్పాడు.


లక్ష్మీనగర్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి బదిలీకి కారణమయ్యాడు. చోటా నేత తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై నియోజకవర్గ ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని  వారు  కోరుతున్నారు. లేకుంటే చోటా నేత తీరుతో అధికార పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెబుతున్నారు. హెచ్‌ఎం బదిలీపై మునిసిపల్‌ కమిషనర్‌ రవిసుధాకర్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. పని సర్దుబాటులో భాగంగానే హెచ్‌ఎం రామకృష్ణను చింతాడ పాఠశాలకు పంపించామని చెప్పారు. 

Read more