వైద్యుల కొరత... రోగులకు వ్యథ
ABN , First Publish Date - 2020-10-04T10:44:05+05:30 IST
కరోనా వేళ.. ప్రజలకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి.
సక్రమంగా అందని 104 సేవలు
గ్రామీణ ప్రజలకు తప్పని ఇబ్బందులు
(ఇచ్ఛాపురం, అక్టోబరు 3) కరోనా వేళ.. ప్రజలకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘104’ వాహనాలకు వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో వైద్యసేవలు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి.. మందులు ఉచితంగా అందజేసేందుకు ప్రభుత్వం ‘104’ పేరుతో మొబైల్ మెడికల్ యూనిట్లతో సేవలు అందజేస్తోంది.
జిల్లాలో గతంలో ‘104’ వాహనాలు 21 ఉండేవి. కానీ, అత్యాధునిక వైద్య సదుపాయాలతో మండలానికి ఒక కొత్త వాహనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జూలై 1న సీఎం జగన్ కొత్త 104 వాహనాలను ప్రారంభించారు. ఈ వాహనంలో ఒక వైద్యాధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఆశా కార్యకర్తలు ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లాకు సంబంధించి 38 మండలాలకు 36 వాహనాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం రూరల్, ఆమదాలవలస మండలాలకు ఇంకా కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న 36 వాహనాలకు గానూ 12 చోట్ల వైద్యులు లేరు.
ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, నందిగాం, పోలాకి, ఎల్.ఎన్.పేట, భామిని, కొత్తూరు, వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, పలాస మండలాల్లో వైద్యుల కొరత కారణంగా 104 వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. గతంలో ఒక్కో వాహనంలో డాక్టర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్‌ఎం ఉండి గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించేవారు. కానీ ప్రస్తుతం ఒక్కో వాహనంలో డాక్టర్, డ్రైవర్, డేటాఎంట్రీ ఆపరేటర్‌ను మాత్రమే నియమించారు. అది కూడా పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవటంతో వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి సత్వరమే వైద్యులను నియమించాలని గ్రామీణ ప్రాంతవాసులు కోరుతున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం
పి.వి.రమణ, 104 జిల్లా మేనేజర్
ప్రభుత్వం అధునాతనమైన పరికరాలతో కొత్త వాహనాలను మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసింది. జిల్లాలో 38 మండలాలకు 36 వాహనాలను ఏర్పాటు చేశాం. 12 చోట్ల వైద్యుల కొరత ఉంది త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం. మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాం. పీజీ కౌన్సెలింగ్ ఉండటంతో కొంతమంది డాక్టర్లు రావడం లేదు. కౌన్సెలింగ్ పూర్తయిన వెంటనే డాక్టర్లను నియమిస్తాం. ఇప్పటికే ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలని కలెక్టర్, డీఎంహెచ్‌వోల దృష్టికి తీసుకెళ్లాం.