కంచిలి నుంచి కాకినాడకు..!

ABN , First Publish Date - 2020-10-03T10:15:30+05:30 IST

సాధారణంగా చిన్నపాటి వ్యాన్‌లో నాలుగైదు పశువులనే తరలించడానికి వీలుంటుంది. దీనికి భిన్నంగా ఒకే వ్యాన్‌లో పదికిపైగా పశువులను కుక్కి కబేళాలకు తరలిస్తున్నారు.

కంచిలి నుంచి కాకినాడకు..!

కబేళాలకు 51 పశువుల రవాణా

లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు

ఐదు వ్యానుల్లో పరిమితికి మించి ఎక్కించిన వైనం

విలవిల్లాడుతూ కనిపించిన మూగ జీవాలు


పలాస, అక్టోబరు 2: సాధారణంగా చిన్నపాటి వ్యాన్‌లో నాలుగైదు పశువులనే తరలించడానికి వీలుంటుంది. దీనికి భిన్నంగా ఒకే వ్యాన్‌లో పదికిపైగా పశువులను కుక్కి కబేళాలకు తరలిస్తున్నారు. ఇలా ఐదు వ్యానుల్లో 51 పశువులను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాహనాల్లో మూగజీవాల దయనీయ స్థితిని చూసి పోలీస్‌ అధికారులు చలించిపోయారు. పలాస మండలం లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వెలుగుచూసిన ఘటనా వివరాలిలా ఉన్నాయి.


కంచిలి నుంచి కాకినాడకు అక్రమంగా పశువులను తరలిస్తున్నట్టు కాశీబుగ్గ పోలీసులకు సమాచారమందింది. దీంతో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల సమయాంలో సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. జాతీయ రహదారిపై కోసంగిపురం వద్ద మాటు వేశారు. పశువులతో వ్యాన్‌లు రాగా వెంబడించారు. లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద ఐదు వ్యాన్‌లను పట్టుకున్నారు.  కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనాలను పరిశీలించిన పోలీసులు నివ్వెరపోయారు. మూడు, నాలుగు పశువులకు సరిపడని స్థలంలో...12 నుంచి 14 పశువులు ఎక్కించారు. బలవంతంగా హింసించి వాహనాలు ఎక్కించిన ఆనవాళ్లు కనిపించాయి.


కొన్నింటిని పడుకోబెట్టగా..వాటిపైనే మరికొన్నింటిని నిలబెట్టారు. కనీసం ఊపిరి తీసుకోని స్థితిలో పశువులు వాహనాల్లో కనిపించాయి. వాహనదారులను ప్రశ్నిస్తే తాము రైతుల నుంచి కొనుగోలు చేశామని..నారాయణపురం సంతకు తరలిస్తున్నట్టు చెబుతున్నారు. పశువులు కొనుగోలు చేసినట్టు కానీ..రవాణాకు ఎటువంటి అనుమతులు కానీ చూపించలేదు. పశువులకు బీమా ట్యాగ్‌లు ఉండడంతో పోలీసులు పశుసంవర్థక శాఖ అధికారులకు సమాచారం అందించారు. పలాస పశుసంవర్ధకశాఖ సహాయసంచాలకులు డాక్టర్‌ పోతనపల్లి చంద్రశేఖర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు.


ఆరోగ్యంగా ఉన్న పశువులను కబేళాలకు తరలించడం నేరమన్నారు. ట్యాగ్‌ల ఆధారంగా సంబంధిత రైతులను గుర్తించవచ్చని పోలీసులకు సూచించారు. ఈ వ్యవహారంపై కాశీబుగ్గ సీఐ జి.శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించి ఎస్పీకి సమాచారమిచ్చినట్టు చెప్పారు. బాధ్యులపై కేసు నమోదు చేశామన్నారు. పశువులను విశాఖపట్నం పశుసంరక్షణ కేంద్రానికి తరలించి, వాహనాలను సీజ్‌ చేసినట్టు చెప్పారు.

Updated Date - 2020-10-03T10:15:30+05:30 IST