మంచి ‘సీటు’ కావలె!

ABN , First Publish Date - 2020-03-02T10:24:52+05:30 IST

మంచి ‘సీటు’ కావలె!

మంచి ‘సీటు’ కావలె!

కార్యదర్శుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

పంచాయతీల్లో రాజకీయ పైరవీలు 

నచ్చిన చోటు కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు

అనుకూలమైన వారిని నియమించేందుకు సిఫారసులు


(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. త్వరలో జరగనున్న ‘స్థానిక’ సమరం నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మూడేళ్లు ఒకే పంచాయతీలో పని చేస్తున్న కార్యదర్శులను బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కార్యదర్శుల బదిలీల్లో రాజకీయ పైరవీలు సాగుతున్నాయి. నచ్చిన పంచాయతీల్లో కొలువుదీరేందుకు కొందరు కార్యదర్శులు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘స్థానిక’ ఎన్నికలు సజావుగా సాగేలా.. తమకు అనుకూలమైన వారిని నియమించేందుకు అధికారపార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. 

 

స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల  ప్రక్రియలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే కార్యదర్శులే కీలకం. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మూడేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో తమకు అనుకూలమైన పంచాయతీ కార్యదర్శులను నియమించుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలకు గ్రామాల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా.. ముందస్తుగా పావులు కదుపుతున్నారు. సందట్లో సడేమియా అన్నచందంగా పంచాయతీ అధికారులు తమకు అనుకూలమైన కార్యదర్శులను, ఆర్థికంగా ఆదుకునే వారికి సముచిత స్థానాలు కల్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో 1181 గ్రామ పంచాయతీలుండగా.. ఇటీవల నాలుగు కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటిలో 564 క్లస్టర్లకు 530 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మరో 835 మంది కొత్తగా విధుల్లో చేరారు. మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న కార్యదర్శులు బదిలీ చేయాలనే ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు డీపీఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 20 మండలాల నుంచి మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వివరాల జాబితా వచ్చిందని వివరించాయి. జిల్లాలో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న కార్యదర్శులు 150 మంది వరకు ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది జులైలో జిల్లాలో 200 మంది కార్యదర్శులను బదిలీ చేశారు. వీరు ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నారు. బదిలీలకు అర్హులైన కార్యదర్శులు.. తమకు అనుకూలమైన కేంద్రాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారపార్టీ నేతలు మాత్రం ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేసే కార్యదర్శుల కోసం వేట ప్రారంభించారు. మరోవైపు ప్రతిపక్షమైన టీడీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో దీటుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో నిబంధనలు పాటించకపోయినా.. అక్రమాలు జరిగినా ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు సన్నద్ధమవుతోంది.  


జాబితాలు అందాల్సి ఉంది : రవికుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి 

జిల్లాలో సగం మండలాలకు సంబంధించి సమాచారం వచ్చింది. ఇంకా 18  మండలాల నుంచి జాబితాలు అందాల్సి ఉంది. నిబంధనల ప్రకారమే బదిలీల ప్రక్రియ చేపడతాం. 


Updated Date - 2020-03-02T10:24:52+05:30 IST