అంతన్నారు...ఇంతన్నారు..సచివాలయాల్లో సేవలు అంతంతే..!

ABN , First Publish Date - 2020-06-25T21:47:10+05:30 IST

సచివాలయాల ద్వారా ప్రజా సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయని ప్రగతి నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో 541 రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

అంతన్నారు...ఇంతన్నారు..సచివాలయాల్లో సేవలు అంతంతే..!

వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు

ప్రజలకు తప్పని ఇబ్బందులు


(ఇచ్ఛాపురం రూరల్‌/కలెక్టరేట్‌): సచివాలయాల ద్వారా ప్రజా సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయని ప్రగతి నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో 541 రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. నేటి వరకు సచివాలయాల్లో కేవలం 10 శాతం మాత్రమే ప్రజాసేవలు అందించినట్టు పంచాయతీ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా 15 రకాల సేవలనే ఎక్కువగా ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికీ ప్రజలు ఫోన్‌ బిల్లు, కరెంటు బిల్లు చెల్లించాలన్నా, ఆధార్‌ కార్డుల్లో మార్పులు చేసుకోవాలన్నా, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు పొందాలన్నా మీ సేవ కేంద్రాలకే వెళ్లిపోవాలని సాక్షాత్తూ సిబ్బందే సలహాలిస్తున్నారు. సచివాలయాల సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకే సచివాలయాలు పరిమితమయ్యాయని చాలామంది పెదవి విరుస్తున్నారు.


సాంకేతిక చిక్కులు

 జిల్లాలోని 1190 గ్రామ పంచాయతీల్లో 834 గ్రామ సచివాలయాలు, శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు మూడు మునిసిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లోని 165 వార్డులకు గాను 94 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. మొత్తం 928 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా సచివాలయాలకు సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం 10 శాతం సచివాలయాలకు మాత్రమే నెట్‌ సదుపాయం ఉంది. అది కూడా పట్టణ ప్రాంతాల్లో మాత్రమే. అన్ని సచివాలయాలకు ఏపీ ఫైబర్‌ నెట్‌ సౌకర్యం కల్పిస్తామని ప్రారంభంలో అధికారులు చెప్పినా.. ఇప్పుడు ఆ విషయాన్ని మరచిపోయారు. దీంతో మోడెమ్‌ ద్వారానే సేవలందిస్తున్నారు. నెట్‌వర్క్‌ లేకపోవడంతో సేవలు అర్ధాంతరంగా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా తలలు బాదుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఆన్‌లైన్‌ చేస్తుండడంతో సర్వర్‌ బిజీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వర్‌ సామర్థ్యాన్ని పెంచే పరిస్థితి లేకపోవడంతో సేవలు మరింత దూరమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు సచివాలయాల్లో 10 శాతం మాత్రమే ప్రజా సేవలను వినియోగించుకున్నారు. మీ సేవ కేంద్రాలలో మొత్తం 3.50 లక్షల మంది వివిధ రకాల సేవలు వినియోగించగా... సచివాలయాల్లో మాత్రం 42 వేల మంది ప్రజా సేవలు పొందారు. జిల్లాలో కొత్త రేషన్‌ కార్డుల కోసం ఒక్కో సచివాలయం నుంచి 20 నుంచి 50 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. 72 గంటల్లో కొత్త రేషన్‌ కార్డులు అందిస్తామని అధికారులు ప్రకటించినా, అది ఎక్కడా అమలు కావడం లేదు. తాజాగా దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో రేషన్‌ కార్డులు అందజేస్తామని చెబుతున్నా.. ఇదీ కార్యరూపం దాల్చలేదు. మరోపక్క ‘మీ-సేవ’లు కూడా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


అధికారుల పర్యవేక్షణ ఏదీ.. 

సచివాలయాల్లో పూర్తిస్థాయి సేవలు అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు ఎక్కువగా ఖాళీగా కనిపిస్తున్నారు. సెల్‌ఫోన్‌లతో కాలక్షేపం చేసుకుంటున్నారు. ఒకరిద్దరు ఉద్యోగులకే తప్ప మిగిలిన వారికి పనిలేకుండా పోతోంది. ఒక్కో సచివాలయానికి అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి 10 నుంచి 12 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఇద్దరు ముగ్గురు రెగ్యులర్‌ ఉద్యోగులు ఉండగా, మిగిలిన వారంతా కాంట్రాక్టు విధానంపై పని చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలతో పాటు సచివాలయ నిర్వాహణకు రూ.3లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.  మీసేవ కేంద్రాల్లో అందిస్తున్న సేవలన్నీ సచివాలయాల్లో అందించాలని ఉన్నతాధికారులు సిబ్బందికి సూచనలు చేసినా.. పర్యవేక్షణ కొరవడడంతో సేవలు అందడం లేదని పలువురు వాదిస్తున్నారు. సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడం, ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజా సేవలు వినియోగంలోకి రాలేదని తెలుస్తోంది. సచివాలయంలో 11 రకాల ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులను నియమించినా... చాలా తక్కువ మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి.. సచివాలయాల్లో సాంకేతిక సమస్యలు పరిష్కరించి.. పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.  


అందుబాటులోకి సేవలు

ప్రజా సేవల విషయంలో సచివాలయాలు వెనుకబడి ఉన్నాయి. దీనిపై పర్యవేక్షణ లోపం కనబడుతోంది. మే నెలలో డివిజన్‌ స్థాయిలో కంప్యూటర్‌ ఆపరేటర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాం. విస్తరణాధికారులు, డీఎల్‌పీవోలకు బాధ్యతలు అప్పగించనున్నాం. గ్రామ సచివాలయాలు అందిస్తున్న ప్రజా సేవల విషయంలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. 541 రకాల సేవలను సచివాలయాల ద్వారా అందుబాటులోకి తీసుకువస్తాం.

Updated Date - 2020-06-25T21:47:10+05:30 IST