-
-
Home » Andhra Pradesh » Srikakulam » Send us home
-
మమ్మల్ని ఇళ్లకు పంపించండి!
ABN , First Publish Date - 2020-06-23T10:04:31+05:30 IST
క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు సక్రమంగా లేవంటూ.. అందులో ఉంటున్న వలసజీవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

క్వారంటైన్ కేంద్రాల్లో వలసజీవుల ఆందోళన
తిండి... నీరు దొరక్క నరకయాతన పడుతున్నామని ఆవేదన
(కాశీబుగ్గ, జూన్ 22): క్వారంటైన్ కేంద్రాల్లో సౌకర్యాలు సక్రమంగా లేవంటూ.. అందులో ఉంటున్న వలసజీవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తినడానికి సరైన తిండి లేదు. తాగడానికి మంచినీరు లేదు. ఇక్కడ నరకయాతన పడుతున్నాం. మమ్మల్ని మా ఇళ్లకు పంపించేయండి మహాప్రభో’ అంటూ.. అధికారులు, నాయకులకు మొర పెట్టుకున్నారు. ‘క్వారంటైన్’ పీరియడ్ పూర్తయినా తమకు ఇళ్లకు పంపడం లేదంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని ఇంగిలిగాంలో నిర్మించిన హుద్‌హుద్ ఇళ్ల క్వారంటైన్ కేంద్రంలో వలసజీవులు సోమవారం ఆందోళన చేశారు. ఇటీవల ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు 176 మంది వచ్చారు.
అధికారులు వీరందరినీ ఈ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఈ క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు బాగోలేవంటూ వలసజీవులంతా సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆపసోపాలు పడి దూరప్రాంతాల నుంచి వచ్చిన తమకు క్వారంటైన్ కేంద్రంలోనూ ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు. ‘భోజనం, తాగునీటి సౌకర్యం సక్రమంగా లేదు. మమ్మల్ని రోగుల్లా చూస్తూ.. తెచ్చిన ఆహారాన్ని డ్రైనేజీలపై పడేస్తున్నారు. నచ్చితే తినండి.. లేదంటే మానేయండి’ అని అంటున్నారని వలసజీవులు ఆవేదన వ్యక్తం చేశారు. అరటిపండ్లతోనైనా కడుపు నింపుకుందామంటే.. అవి కూడా కుళ్లిపోయినవి ఇస్తున్నారు. దీంతో ఆకలితో అలమటిస్తూ నరకయాతన పడుతున్నామని తెలిపారు. బహిర్భూమి కోసం కొండలపైకి వెళ్లి ఇబ్బందులు పడుతున్నామని, రక్షణ కొరవడుతోందని మహిళలు వాపోయారు. తమను ఇళ్లకు పంపించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ‘హోం క్వారంటైన్’లో ఉంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని తెలిపారు.
20 రోజులు అవుతున్నా..
సంతబొమ్మాళి : సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురం హుద్‌హుద్ కాలనీలోని క్వారంటైన్ కేంద్రంలో కూడా వలస కార్మికులు సోమవారం ధర్నా చేశారు. కొత్తూరు మండలం నుంచి ఇటీవల వచ్చిన వలస కార్మికులు అక్కడ క్వారంటైన్‌లో 14 రోజులు ఉన్నారు. తర్వాత లక్ష్మీపురంలోని క్వారంటైన్ కేంద్రానికి వచ్చారు. ఇక్కడకు వచ్చి 20 రోజులు అవుతున్నా.. తమను ఇంటికి పంపడం లేదంటూ అందోళనకు దిగారు. రిపోర్టులు వచ్చిన తర్వాత ఇళ్ళకు పంపిస్తామని అధికారులు సర్దిచెప్పారు.