రాజకీయ ముసుగులో... ఇసుక దోపిడీ!

ABN , First Publish Date - 2020-06-23T10:02:43+05:30 IST

రాజకీయ ముసుగులో ఇసుక మాఫియా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఇసుకాసురుల అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం ..

రాజకీయ ముసుగులో... ఇసుక దోపిడీ!

ర్యాంపుల్లో చక్రం తిప్పుతున్న నేతల పుత్రులు 

ఉద్యోగాల నియామకంలోనూ అవకతవకలు


(నరసన్నపేట): రాజకీయ ముసుగులో ఇసుక మాఫియా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఇసుకాసురుల అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టింది. కానీ, ‘శతకోటి అక్రమాలకు.. అనంతకోటి ఉపాయాలు’ అన్న చందంగా.. కొందరు నేతలు ఈ ఆన్‌లైన్‌ విధానాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లను తమ దారికి తెచ్చుకుని.. జిల్లాకు చెందిన ఇద్దరు నేతల కుమారులు ఇసుక ర్యాంపుల్లో చక్రం తిప్పుతున్నారు. ఇసుక ర్యాంపుల్లో ఉద్యోగాలను నియమించే టెండర్లను మరో నేత సమీప బంధువులు దక్కించుకున్నారు. ఉద్యోగాల నియామకాల్లో తమదైన శైలిలో దోచుకుంటున్నారు. 


ప్రభుత్వం ఎన్ని విధానాలు ప్రవేశపెట్టినా.. ఇసుకాసురుల అక్రమాలు ఆగడం లేదు. ఇసుక రీచ్‌లో కొందరు నేతలు చక్రం తిప్పుతూ.. అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. రీచ్‌ల్లో ఉద్యోగాల నియామకాల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లాలో నాగావళి, వంశధార నదులపై 26 ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను అధికారులు గుర్తించారు. వీటిలో ఇప్పటికే కొన్ని ప్రారంభించారు. ప్రస్తుతం చేనులవలస, వెంకటాపురం, లుకలాం, పర్లాం, పురుషోత్తపురం, అన్నవరం, కళ్లేపల్లి, తోలాడ, కిల్లిపాలెం, గోపాలపెంట, పోతయ్యవలస, మడపాం, కరజాడ రీచ్‌ల్లో తవ్వకాలు చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉండడంతో మరికొన్ని ర్యాంపుల్లో తవ్వకాలు నిలిపేశారు. ఇసుక.. ర్యాంపుల నుంచి డంపింగ్‌ ప్రాంతాలకు వెళ్లే సమయంలో  కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు.


తనిఖీ అధికారులకు పట్టుబడకుండా ర్యాంపుల నుంచి వెళ్లే ఇసుక లారీలకు రసీదులు(ఫర్మిట్‌లు) ఇస్తారు. ఈ లారీలు వెళ్లేమార్గంలో తనిఖీలు చేపట్టకపోతే.. ఆ ఇసుకను ప్రైవేటుకు తరలిస్తున్నారు. అదే పర్మిట్‌లు మరోసారి వినియోగిస్తున్నారు. ఒక్కొక్క లారీ ఇసుకను రూ.15వేల నుంచి రూ.30వేల వరకు విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు ఒక్కో ర్యాంపు నుంచి సుమారు 20 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ర్యాంపుల్లో ఉద్యోగుల సాయంతోనే ఈ దందాకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. 


 బల్క్‌ ఆర్టర్‌తో బురిడీ 

ఇసుక మాఫియా బల్క్‌ ఆర్డర్‌తో ప్రభుత్వానికి బురిడీ కొట్టించి ప్రజాధనం దోచుకుంటున్నారు. జిల్లా నుంచి విశాఖపట్నానికి బల్క్‌గా  ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తారు. ట్రావెలింగ్‌ చేపట్టే కాంట్రాక్టర్‌తో కుమ్మక్కు అవుతారు. ఇసుక ర్యాంపుల్లో ఉన్న తన అనుయాయుల ద్వారా లోడింగ్‌ చేసి... అక్రమంగా విక్రయాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా పర్యవేక్షించే డీఎస్‌వో, ఏఎస్‌వోలు ఇసుక మాఫియా చేతిలో కీలుబొమ్మలుగా మారారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు నేతల అండతో మాఫియా సభ్యులు.. ఇసుక అక్రమ రవాణాను నిరోధించే ఎస్‌ఈబీ అధికారులను సైతం తమదారిలోకి తెచ్చుకుని దందా సాగిస్తున్నారు. 


 యువనేతల చేతుల్లో..

జిల్లాకు చెందిన ఇద్దరు నేతల కుమారులు ఇసుక ర్యాంపుల్లో పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండరింగ్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్లను బెదిరించి.. ఈ యువ నాయకులే వారి నియోజకవర్గాల్లోని ర్యాంపుల వద్ద చక్రం తిప్పుతున్నారు. మరికొన్ని ర్యాంపులను తమ అనుయాయులకు అప్పగించారు. ఇందుకు రోజుకు కొంత మొత్తాన్ని కట్టాల్సిందేనని హుకుం జారీచేశారు. దీంతో అంత పెద్ద మొత్తాలు చెల్లించుకోలేమని సంబంధిత కాంట్రాక్టర్లు.. ర్యాంపులను ఆ యువ నాయకులకే అప్పగించినట్టు తెలుస్తోంది. 


 ఉద్యోగాల నియామకంలోనూ కిరికిరి 

ఇసుకరీచ్‌ల్లో ఉద్యోగులను నియమించే కాంట్రాక్టును పొందిన ఒక సంస్థ కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. నియామకాల సమయంలో పోస్టుకు కొంత మొత్తం వసూలు చేస్తోంది. జిల్లాలో మరో నేత బంధువులు సిఫారసు చేసిన వారికి అవకాశం కల్పిస్తోంది. ఒక్కో రీచ్‌లో పది నుంచి 14 మంది నియమించాలి. నిబంధనల ప్రకారం వారి జీతాలను ప్రభుత్వమే సదరు సంస్థకు చెల్లిస్తుంది. ఈ సంస్థ రీచ్‌లలో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించడం లేదు. కొందరు నేతలు తమ అనుయాయులనే నియమించి... సిబ్బంది ఉన్నట్టు రికార్డుల్లో చూపి జీతాలు  తమ ఖాతాల్లో వేసుకుని ప్రభుత్వానికి బోల్తా కొట్టిస్తున్నారు. రోస్టర్‌ విధానంలో సిబ్బందిని నియమించాల్సి ఉన్నా.. పట్టించుకోకుండా తమ వర్గానికే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


అక్రమాలకు తావులేకుండా ..ప్రతాప్‌రాణా, జిల్లా శాండ్‌ అధికారి. 

జిల్లాలో అక్రమాలకు చోటు లేకుండా ఇసుక రీచ్‌లలో అన్ని ఏర్పాట్లు చేశాం. ఇసుక రీచ్‌లపై ప్రభుత్వమే నిఘా పెంచింది. ఉద్యోగుల విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి డేటా అందిస్తున్నాం


Updated Date - 2020-06-23T10:02:43+05:30 IST