ఇద్దరు యువకులు దుర్మరణం
ABN , First Publish Date - 2020-11-16T05:18:14+05:30 IST
పండుగ పూట విషాదం అలుముకుంది.

మరొకరి పరిస్థితి విషమం
వమ్మరవెల్లి జంక్షన్‌లో చెట్టును ఢీకొన్న బైక్
మృతులది ఉత్తరప్రదశ్
పండుగపూట విషాదం
వమరవెల్లి (గార), నవంబరు 15: పండుగ పూట విషాదం అలుముకుంది. శనివారం వమరవెల్లి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కె.మత్స్యలేశం బీచ్‌కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురం భద్రమ్మగుడి ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులు ఎస్.గొండు (28), సంతోష్‌పాల్ (30)తో పాటు సందీప్ నివాసముంటున్నారు. గృహ నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుటుంబాలు ఉత్తరప్రదేశ్‌లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం దీపావళి కావడంతో సరదాగా గడిపేందుకు సాయంత్రం కె.మత్స్యలేశం బీచ్‌కు ఒకే బైక్‌పై వెళ్లారు. కొద్దిసేపు ఆనందంగా గడిపారు. తిరుగు ప్రయాణంలో భాగంగా వమ్మరవెల్లి జంక్షన్‌కు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో గొండు, సంతోష్‌పాల్ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. కొన ఊపిరితో ఉన్న సందీప్‌ను స్థానికులు 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. గార ఎస్‌ఐ హరికృష్ణ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. సంతోష్‌పాల్‌కు ఏడాదిన్నర కిందట వివాహం జరిగింది. నెలల వయస్సు ఉన్న కుమార్తె ఉంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని మృతుల కుటుంబాలకు సమాచారమందించినట్టు పోలీసులు తెలిపారు.