న‘మోదం’.. ఎప్పుడో?
ABN , First Publish Date - 2020-11-26T05:36:02+05:30 IST
రైతులు సాగు చేసిన వరి విస్తీర్ణం.. వచ్చిన దిగుబడి వివరాలతో రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటేనే వారి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఆన్లైన్లో రైతుల వివరాల నమోదు ప్రక్రియ డిసెంబరు పదిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నా.. సాంకేతిక సమస్య కారణంగా ఆశించిన స్థాయిలో ప్రక్రియ సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా 3,83,650మంది రైతులు ఉండగా.. కేవలం 61,998మంది వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదయ్యాయి. మిగిలిన 3,21,652 మంది రైతులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం నిరీక్షిస్తున్నారు.

రైతుభరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌కు కష్టాలు
సాంకేతిక సమస్యతో ఇబ్బందులు
వరి పంట వివరాల నమోదుకు రైతుల అవస్థలు
(టెక్కలి)
రైతులు సాగు చేసిన వరి విస్తీర్ణం.. వచ్చిన దిగుబడి వివరాలతో రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటేనే వారి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఆన్లైన్లో రైతుల వివరాల నమోదు ప్రక్రియ డిసెంబరు పదిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నా.. సాంకేతిక సమస్య కారణంగా ఆశించిన స్థాయిలో ప్రక్రియ సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా 3,83,650మంది రైతులు ఉండగా.. కేవలం 61,998మంది వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదయ్యాయి. మిగిలిన 3,21,652 మంది రైతులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం నిరీక్షిస్తున్నారు.
----------------------
ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యం విక్రయానికి సంబంధించి రైతుభరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. డిసెంబరు 10లోగా రైతుభరోసా కేంద్రాల్లో రైతుల పంట వివరాలు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు పదేపదే చెబుతున్నారు. రిజిస్ట్రేషన్లకు సాంకేతిక సమస్యలు అడ్డంకిగా నిలుస్తున్నాయి. రైతులు తమ 1బీ, ఆధార్ నెంబరు, బ్యాంకు ఖాతా వంటి వివరాలను రైతుభరోసా కేంద్రాల్లో ఏఈవో వద్దకు వెళ్లి తెలియజేయాలి. ఈ వివరాలు ఆన్లైన్లో నమోదైతే.. రైతుల సెల్ నెంబరుకు వచ్చే ఓటీపీ వివరాలను తిరిగి రైతుభరోసా కేంద్రంలోని వ్యవసాయ గ్రామీణ సహాయకులకు తెలియజేయాలి. అప్పుడే రైతు వివరాలు నమోదైనట్టు లెక్క. ఒక్కో రైతు వివరాల నమోదుకు కనీసం అరగంట పడుతుండడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జాప్యమవుతోంది. సర్వర్ సమస్య కారణంగా నత్తనడకన సాగుతుండడంతో రైతులు గంటల తరబడి కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్నారు. మరోవైపు ఆశించిన స్థాయిలో ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఏఈవోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో మొత్తం 837 రైతుభరోసా కేంద్రాలు ఉన్నాయి. శ్రీకాకుళం, పాలకొండ, రాజాం, నరసన్నపేట, టెక్కలి, రణస్థలం, సోంపేట, పలాస, టెక్కలిలో వ్యవసాయ శాఖ సబ్డివిజన్లు ఉన్నాయి. ఈ తొమ్మిది సబ్డివిజన్లకు సంబంధించి 3,83,650 మంది రైతులు తమ వివరాలను రైతుభరోసా కేంద్రాల్లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. నెల రోజులుగా రిజిస్ర్టేషన్ల ప్రక్రియ సాగుతోంది. ఇప్పటి వరకూ కేవలం 61,998మంది రైతుల వివరాలు మాత్రమే నమోదయ్యాయి. వ్యవసాయ శాఖ సబ్డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. టెక్కలిలో అత్యధికంగా 10,228.. రణస్థలంలో అత్యల్పంగా 4,481 రిజిస్ర్టేషన్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 3,21,652 మంది రైతులు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం నిరీక్షిస్తున్నారు. రిజిస్ర్టేషన్ పూర్తికాక చాలామంది రైతులు ధాన్యం విక్రయించేందుకు అవస్థలు పడుతున్నారు. ఇటువంటి వారిని దళారులు లక్ష్యంగా చేసుకుని.. తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు మరింత ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ విషయమై.. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బీవీ తిరుమలరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. ‘రైతుభరోసా కేంద్రంలో ప్రతి రైతూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఒక్కొక్కరి వివరాల నమోదుకు 20 నిమిషాలకుపైగా పడుతోంది. దీంతో ప్రక్రియ జాప్యమవుతోంది. ఆన్లైన్లో సాంకేతిక సమస్య ఉన్నా.. గడువులోగా వివరాల నమోదుకు సిబ్బంది కృషి చేస్తున్నారు’ అని తెలిపారు.
రైతుభరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు ఇలా..
------------------------------------------------------------------------------------------
వ్యవసాయశాఖ సబ్‌డివిజన్ మొత్తం రైతులు రిజిస్ర్టేషన్లు
------------------------------------------------------------------------------------------
కొత్తూరు 43,917 5,120
పాలకొండ 35,904 5,953
రాజాం 40,129 7,173
శ్రీకాకుళం 48,934 9,501
నరసన్నపేట 52,681 7,844
రణస్థలం 24,610 4,481
సోంపేట 23,199 5,015
పలాస 43,420 6,683
టెక్కలి 70,856 10,228
------------------------------------------------------------------------------------------
3,83,650 61,998
------------------------------------------------------------------------------------------