రిజిస్ట్రేషన్‌ అంతా ఈజీ కాదు!

ABN , First Publish Date - 2020-11-16T04:40:15+05:30 IST

సాధారణంగా అన్ని పత్రాలు సవ్యంగా ఉంటే గంటల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. సాంకేతిక సమస్యలు వస్తే తప్ప జాప్యం జరగదు.

రిజిస్ట్రేషన్‌ అంతా ఈజీ కాదు!
రణస్థలం సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

రణస్థలం కార్యాలయంలో చుక్కలుచూపిస్తున్న సిబ్బంది

 (రణస్థలం)

సాధారణంగా అన్ని పత్రాలు సవ్యంగా ఉంటే గంటల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. సాంకేతిక సమస్యలు వస్తే తప్ప జాప్యం జరగదు. కానీ రణస్థలం సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో అయితే మాత్రం వారం నుంచి పది రోజులు పడుతోంది. ఒక వేళ గంటల వ్యవధిలో కావాలంటే అక్కడ సిబ్బంది చేయి తడపాల్సిందే. గత కొద్ది నెలలుగా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. సిబ్బంది తీరుతో భూ క్రయ విక్రయదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించకపోవడంతో ఇక్కడ సిబ్బంది అడిందే ఆట..పాడిందే పాట అన్న చందంగా మారుతోంది. ఇక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌ నాలుగు నెలల కిందట పదవీవిరమణ పొందారు. అప్పటి నుంచి ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించకుండా తక్కువ మందితో నడిపిస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం కావడంతో భూ క్రయ విక్రయాలు అధికంగా జరుగుతుంటాయి. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. కానీ ఇక్కడి సిబ్బంది రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే క్రయ విక్రయదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎవరు ఎక్కువ నగదు ముట్టజెబితే వారి రిజిస్ర్టేషన్లే ముందుగా జరిపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమయపాలన సైతం పాటించడం లేదు. సిబ్బంది ఎప్పుడు వస్తారో? ఎప్పుడు రారో తెలియని పరిస్థితి.  రోజుల తరబడి రిజిస్ట్రేషన్లు జరగక చాలామంది అసౌకర్యానికి గురవుతున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు సొంత జిల్లాలో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఉన్నతాదికారులు దృష్టిసారించాలని భూ క్రయ విక్రయదారులు కోరుతున్నారు. 


  క్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు

క్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. కార్యాలయానికి సిబ్బంది కొరత ఉంది. కొద్దిరోజులుగా సర్వర్‌ సమస్య ఉంది. అందుకే జాప్యం జరుగుతోంది. ఇబ్బందులకు తావివ్వకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపడుతున్నాం.

-జయ్యమ్మ, ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌, రణస్థలం

 


   ఐదు రోజులు అవుతున్నా...

డాక్యుమెంట్‌ సిద్ధం చేసి ఐదు రోజులు గడుస్తోంది. అప్పటి నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రిజిస్ట్రేషన్‌ మాత్రం జరగలేదు. సిబ్బంది పట్టించుకోవడం లేదు. విలువైన సమయం వృథా అవుతోంది.

-చంటి, రణస్థలం 


  వ్యయప్రయాసలు

నేను విశాఖలో నివాసముంటున్నాను. సొంత గ్రామంలో కొంత భూమిని విక్రయించాను. రిజిస్ట్రేషన్‌ కోసం ధ్రువపత్రాలు సిద్ధం చేసి వస్తే సిబ్బంది పట్టించుకోవడం లేదు. నాలుగు రోజులుగా విశాఖ నుంచి వస్తున్నాను. వ్యయప్రయాసలకు గురవుతున్నా. 

-బి.గిరిధర్‌రెడ్డి, సందుపాలెం


Updated Date - 2020-11-16T04:40:15+05:30 IST