స్పీడ్ పెరిగింది
ABN , First Publish Date - 2020-08-01T10:19:32+05:30 IST
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అధికారులు పరీక్షల స్పీడు పెంచారు. లక్షణాలు లేనివారికి, ఉన్నవారికీ మొన్నటి ..

పుంజుకున్న పరీక్షల వేగం
జ్వరం.. ఇతర లక్షణాలున్న వారికే ‘ర్యాపిడ్’ టెస్ట్‌లు
జిల్లాకు మరో ఆర్టీపీసీఆర్ యంత్రం
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి చర్యల్లో భాగంగా అధికారులు పరీక్షల స్పీడు పెంచారు. లక్షణాలు లేనివారికి, ఉన్నవారికీ మొన్నటి వరకు ఒకే తరహాలో పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు ర్యాపిడ్ కిట్లు అందుబాటులోకి రావడంతో.. పరీక్షల వేగం పెరిగింది. రోజువారీ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. జ్వరం, జలుబు, ఆయాసం వంటి లక్షణాలున్న వారికి కరోనా ఉన్నదీ లేనిదీ నిర్ధారించేందుకు అత్యవసర పరిస్థితిలో వినియోగించే ర్యాపిడ్ కిట్లతో పరీక్షిస్తున్నారు.
కొన్ని గంటల వ్యవధిలోనే ఫలితాలు వెల్లడిస్తున్నారు. జిల్లాకు ఇప్పటివరకు 13,000 ర్యాపిడ్ కిట్లు వచ్చాయి. ఇందులో ఇప్పటికే ఏడువేలకుపైగా వినియోగించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో రెండు రోజుల కిందట మొబైల్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మినీ అంబులెన్స్ మాదిరిగా ఉన్న ఈ వాహనంలో వైద్య సిబ్బంది ఉంటున్నారు.
కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు వచ్చే వ్యక్తి ఆధార్ నంబర్, పూర్తిపేరు, ఇతర వివరాలను నమోదు చేస్తున్నారు. తర్వాత వారి నుంచి శ్వాబ్ సేకరిస్తున్నారు. పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలో ప్రక్రియ పూర్తవుతోంది. రోజుకు కనీసం 100 నుంచి 150 మంది వరకు ఇక్కడకు వస్తున్నారు. అయితే ఇక్కడ శ్వాబ్ ఇచ్చిన వెంటనే ఇంటికి వెళ్లిపోవాల్సిందే. ఫలితాల్లో పాజిటివా? నెగిటివా? అనేది అధికారులు ఫోన్ ద్వారా సమాచారం అందజేస్తారు.
అంతవరకూ పరీక్షలు చేసుకున్నవారు ఇంటినుంచి బయటకు రాకూడదు. కానీ ఈ నిబంధన సక్రమంగా అమలుకావడం లేదు. ఇక్కడకు కరోనా పరీక్షకు వచ్చినవారిలో చాలామంది.. నగరంలో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. గురువారం ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో రిపోర్టుల వచ్చిన తర్వాత వారిలో ఎవరికైనా ‘పాజిటివ్’ నిర్ధారణ అయితే.. కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటికే సామాజిక వ్యాప్తి ప్రారంభమైన నేపథ్యంలో ఎవరికివారు స్వీయ నియంత్రణ పాటించాలని యంత్రాంగం పదేపదే చెబుతోంది.
మరికొన్ని చోట్ల ఆలస్యం..
ఇప్పటికీ చాలాచోట్ల పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతూనే ఉన్నాయి. ఈ నెల 21 నుంచి చేసిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెల్లడికాలేదు. పరీక్షలు చేయించుకున్నవారేమో.. తమకు పాజిటివ్ వస్తుందా?.. నెగిటివా? అన్నది తెలియక గందరగోళానికి గురవుతున్నారు. నెగిటివ్ వస్తే సిబ్బంది చెప్పడంలేదు. అయితే నెగిటివ్‌గా ధ్రువీకరించేందుకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో సంబంధిత సిబ్బంది ద్వారానో.. మరెవరి ద్వారానో వెబ్‌సైట్‌లో తెలుసుకునేందుకు వీలు కలిగేది. ప్రస్తుతం గురు, శుక్రవారాల్లో వెబ్‌సైట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది.
జిల్లాకు చేరుకున్న ఆర్టీపీసీఆర్ యంత్రం...
కరోనా నిర్ధారణ కోసం వ్యక్తుల నుంచి సేకరించిన శ్వాబ్‌ను ఆర్టీపీసీఆర్ యంత్రం ద్వారా పరీక్షిస్తారు. రెండు నెలలు ముందు వరకు కాకినాడకు శ్వాబ్‌ను ప్రత్యేక వాహనాల్లో పంపారు. ఆ తర్వాత వీఆర్డీఎల్ ల్యాబ్ జిల్లాకు వచ్చేయడంతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోనే పరీక్షిస్తున్నారు. రోజుకు 2వేల స్వాబ్‌లను పరీక్షించేవారు. ఇందులో పాజిటివ్‌లు వస్తే.. మరింత కచ్చితత్వం కోసం మళ్లీ శ్వాబ్‌ను సేకరించి కాకినాడ పంపేవారు. ఈ ప్రక్రియలో పరీక్షల ఫలితాలు ఆలస్యమయ్యేవి. ఇప్పుడు మరో ఆర్టీపీసీఆర్ యంత్రం జిల్లాకు చేరుకుంది. దీన్ని ఇప్పటికే ఇన్‌స్టాల్ కూడా చేసేశారు. ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు రోజువారీ 4 వేల నుంచి 5వేల వరకు శ్వాబ్‌లను పరీక్షిస్తున్నారు. అదేస్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.
ఫలితాలు వచ్చేవరకు ఇళ్లలోనే ఉండాలి.. చెంచయ్య, డీఎంహెచ్‌ఓ
జిల్లాకు కొత్తగా మరో ఆర్టీపీసీఆర్ యంత్రం వచ్చింది. దీంతో పరీక్షల వేగం పెంచాం. సంజీవిని బస్సుల ద్వారా, మినీ వాహనాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో.. ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు చేస్తున్నాం. జ్వర లక్షణాలున్న వారికి ర్యాపిడ్ కిట్లతో పరీక్షిస్తున్నాం. ఎవరైనా పరీక్షలకు వెళ్లవచ్చు. పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఇళ్లల్లోనే ఉండాలి.