ఉరుములు మెరుపులతో సిక్కోలులో జోరువాన

ABN , First Publish Date - 2020-07-28T10:25:07+05:30 IST

జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కరిసింది.

ఉరుములు మెరుపులతో సిక్కోలులో జోరువాన

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, జూలై 27 : జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కరిసింది. వేకువజామున భారీ వర్షం కురిసింది. ఉదయం ఎత్ర తీవ్రంగా కాసింది. దీంతో ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఆ తర్వాత మధ్యాహ్నం అరగంటపాటు వర్షం కురిసింది. ఉరుములు శబ్ధాలతో ప్రజలు భయాందోళన చెందారు. జిల్లా వ్యాప్తంగా వర్షపాతం పరిశీలిస్తే.. అత్యధికంగా నందిగాం మండలంలో 39.75 మి.మీ... అత్యల్పంగా హిరమండలంలో గొట్టాబ్యారేజీ వద్ద 5.50 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా కొత్తూరు మండలం ఓండ్రుజోల గ్రామంలో పిడుగుపడి 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.


సారవకోటలో...

సారవకోట : సారవకోట ప్రాంతంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షం వ్యవసాయ పనులకు ఎంతో ఉపయుక్తమని రైతులు పేర్కొంటున్నారు. వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.  ఎదలు వేసిన పొలాలకు కూడా ఈ వర్షం ఉపయోగపడిందని రైతులు అభిప్రాయపడ్డారు.  


లావేరులో...

లావేరు : మండలంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా సరైన వర్షం లేకపోవ డంతో మొక్క జొన్న, పత్తి తదితర పంటలు ఎండిపోతున్న తరుణంలో సోమవారం కురిచిన వర్షం కాస్త ఊరటనిచ్చింది.


పోలాకిలో...

పోలాకి : మండలంలోని రైతులకు సోమవారం కురిసిన వర్షం రైతులకు ఎంతో ఊరటనిచ్చింది.  ఖరీఫ్‌ సాగుకోసం వరినారు చల్లారు. నారునీరులేక ఎండిపోతోంది. ఈ నేపథ్యంలో వర్షం కురవడంతో నారుకు ఊపిరిపోసినట్లయిందని రైతులు పేర్కొంటున్నారు.  


నందిగాంలో...

నందిగాం : మండలంలో సోమవా రం మధ్యాహ్నం పడిన వర్షం నారు మళ్లు, యద చేనుకు ఊపిరిపోసింది. సుమారు 20 రోజులుగా వర్షాలు లేక ఎండుపోతున్న నారుమళ్లకు ఈ వర్షం ఉపయోగపడింది రైతులు పేర్కొంటున్నారు. 


సీతంపేటలో... 

సీతంపేట : సీతం పేటలో  సోమవారం భారీ వర్షం కురిసింది. ఇప్పటికే మోస్తరుగా వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు ఏజెన్సీలో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆస్పత్రిలో కరోనా బాధితులకు తప్ప సాధారణ రోగులకు వైద్య పరీక్షలు అందించే పరిస్థితి లేదు. దీంతో బాధితులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. 


పిడుగు శబ్దానికి బాలుడి మృతి

పాలకొండ(కొత్తూరు) : కొత్తూరు మండలం ఓండ్రుజోలలో సోమవారం సాయంత్రం పిడుగుపడిన శబ్దానికి కొరాయి సెర్వాన్‌(9) మృతి చెందగా, మృతుడి చెల్లెలు రిత్తిక గాయపడింది.  వర్షం పడుతున్న సమయంలో తన భార్య పిల్లలో కొరాయి ఈశ్వరావు ఇంట్లోనే ఉన్నాడు. ఇంటిపక్కనే ఉన్న తోటలో పెద్ద శబ్దంతో పిడుగు పడింది. అదే సమయంతో నీళ్లు తాగేందుకు వంటింట్లోకి వెళ్లి ఆ ఇద్దరి చిన్నారులు... ఆ శబ్దం తాకిడికి సెర్వాన్‌ మృతి  చెందగా... చిన్నారి రిత్తిక గాయపడింది. ఆ చిన్నారులిద్దరిని కొత్తూరు ఆసుపత్రికి తీసుకురాగా... అప్పటికే  సెర్వాన్‌ మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. కొరాయి ఈశ్వరావు రైల్వేలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కుమారుడి మృతితో ఈశ్వరావు, కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2020-07-28T10:25:07+05:30 IST