రబీకి సన్నద్ధం

ABN , First Publish Date - 2020-12-21T04:47:25+05:30 IST

వంశధార ప్రధాన ఎడమ కాలువ నుంచి ఈ ఏడాది రబీలో పంటలకు సాగునీరివ్వడం సాధ్యపడదని అధికారులు తెలిపినా టెక్కలి సబ్‌ డివిజన్‌ పరిధిలో సాగుకు రైతన్న సమాయత్తమవుతున్నాడు. ఇరిగేషన్‌ అధికారులు ఎప్పుడో ఒకప్పుడు నీరు వదలరా అన్న ఆశతో సాగువైపు ఆసక్తి కనబరుస్తున్నారు.

రబీకి సన్నద్ధం
జలుమూరు వద్ద వరి నాట్లకు నారు సిద్ధం చేస్తున్న రైతులు


 సాగునీరు కష్టమంటున్న అధికారులు

 నారుమడుల తయారీలో రైతులు

(టెక్కలి/నందిగాం/జలుమూరు)

వంశధార ప్రధాన ఎడమ కాలువ నుంచి ఈ ఏడాది రబీలో పంటలకు సాగునీరివ్వడం సాధ్యపడదని అధికారులు తెలిపినా టెక్కలి సబ్‌ డివిజన్‌ పరిధిలో సాగుకు రైతన్న సమాయత్తమవుతున్నాడు. ఇరిగేషన్‌ అధికారులు ఎప్పుడో ఒకప్పుడు నీరు వదలరా అన్న ఆశతో సాగువైపు ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది కంటే ఎక్కువ మేర సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్న వంటి పంటలపై ఆసక్తి కనబరచడం లేదు. వరిపైనే ఆశలతో నారుమడులను సిద్ధం చేస్తున్నారు. ఒకటి, రెండు తడుల సాగునీరు కాలువ వెంబడి వస్తే ఆ తరువాతే చెరువుల్లో ఉన్న సాగు నీటితో రబీ పండించవచ్చన్న ఆలోచన చేస్తున్నారు. గొట్టాబ్యారేజీలో నీటి నిల్వలు అడుగంటినందున జలుమూరు, సారవకోట, హిరమండలం మండ లాలు మినహా మిగిలిన ప్రాంతాలకు సాగునీరు అందించలేమని ఇరిగేషన్‌ అధికారులు ముందే చెబుతున్నారు. ఇరిగేషన్‌, వ్యవసాయశాఖ ఉన్నతాధి కారులు గత నెల 27న గొట్టాబ్యారేజీ ప్రాంతాన్ని పరిశీలించి ఓ నిర్ణయానికి వచ్చారు. కేవలం 25 వేల ఎకరాల్లో వరి పండించేందుకు సాగునీరందించ గలుగుతామని అంటున్నారు. తరువాత అవకాశం ఉంటే చెరువులు నింపేందుకు చర్యలు తీసుకుంటామన్న ఆలోచనలో అధికారులున్నారు. గత ఏడాది రబీ సీజన్‌లో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల పరిధిలో సుమారు 6,900 హెక్టార్లలో వరి పండించగా ఈ ఏడాది సుమారు 11వేల హెక్టార్లలో పండించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యవసాయశాఖ ఈ ఏడాది ఎర్ర మల్లెలు, 1010, 1150 రకం వరి పండించ వద్దని, కేవలం 120 రోజుల స్వల్పకాలిక పంట రకాలైన 1121, ఆర్‌ ఎల్‌ఆర్‌ 1545 వరి పండించాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. నందిగాం మండలంలో నందిగాం, పెంటూరు, వేణుగోపాలపురం, గొల్లూరు, శివరాంపురం తదితర గ్రామాలతో పాటు జలుమూరు మండలం కోనసింహాద్రిపేట, నామాలపేట, చెన్నాయివలస, పాగో డు, తాళ్లవలస, కరవంజ తదితర గ్రామాల్లో రబీ వరి సాగు చేసి వరి నాట్లు పొలాల్లో వేస్తున్నారు.

 


 

Updated Date - 2020-12-21T04:47:25+05:30 IST