‘స్థానిక’ పోరుకు.. సై!

ABN , First Publish Date - 2020-03-04T10:02:33+05:30 IST

ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమరావతిలో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

‘స్థానిక’ పోరుకు.. సై!

నెలాఖరు నాటికి ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమరావతిలో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ఖరారు విషయంలో  బీసీలకు యాభై శాతం కంటే ఎక్కువ కల్పించడాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. నెల రోజుల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘స్థానిక’ పోరు మరి కొన్నిరోజులు వాయిదా పడనుందనే వాదనలు వినిపించాయి. మరోవైపు పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ పరీక్షలు సమీపించిన నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల కొరత ఏర్పడుతుందని, ఈ క్రమంలో ఈ పరీక్షల తర్వాతే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే ప్రచారం సాగింది.


కానీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్‌ మొదటి వారంలోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ దిశగా ఏర్పాట్లు చేయాలని సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌ అతి త్వరలోనే వస్తుందని నేతలంతా భావిస్తున్నారు. స్థానిక పోరుకు ఆశావహులు సన్నద్ధమవుతున్నారు. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సిద్ధం చేసిన ఎన్నికల సామగ్రిని మండలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాలెట్‌ పెట్టెలు, నామినేషన్‌ పత్రాలు, పోలింగ్‌, ప్రొసీడింగ్‌ ఆఫీసర్స్‌ డైరీలు, అభ్యర్థుల జాబితాలు, ఓట్ల లెక్కింపు పత్రాలు, డిక్లరేషన్‌ పత్రాలు, బ్యానర్లు, ఇతరత్రా మొత్తం 172 రకాల సామగ్రి కిట్లను మండలాలకు పంపుతున్నారు. జడ్పీ పరిపాలనాధికారి ఎంవీ రంగారావు ఆధ్వర్యంలో ఇప్పటికే 20 మండలాలకు సామగ్రి పంపిణీ పూర్తిచేశారు. 


ఉల్లంఘనులపై ఉక్కుపాదం...

‘స్థానిక’ పోరులో నిబంధనలు కఠినతరం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే చట్ట సవరణ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణల కోసం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చిన ప్రభుత్వం ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు కొత్త చట్టాన్ని తెచ్చింది. ఎన్నికల్లో  డబ్బులు,  మద్యం పూర్తిగా నిరోధించాలనే దృక్ఫథంతో ఆర్డినెన్స్‌ తెచ్చింది. ఈ చట్టాలు ఎంతవరకు అమలవుతాయో వేచి చూడాల్సిందే. స్థానిక ఎన్నికలు పూర్తయిన తరువాత కూడా డబ్బు  పంపిణీ చేసి గెలిచినట్లు రుజువైతే అనర్హత వేటుతో పాటు మూడేళ్లపాటు జైలు శిక్ష పడనుంది. గ్రామ సచివాలయాల్లో, గ్రామాల్లో ఇటీవల ఏర్పాటు చేసిన పోలీసుమిత్రలను, గ్రామ మహిళా పోలీసులను ఈ ఎన్నికల నిర్వహణలో పూర్తిస్థాయిలో వినియోగించుకోనున్నారు. సాధారణ ఎన్నికల తరహాలోనే స్థానిక పోరులో కూడా అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్‌ను అందుబాటులో ఉంచనున్నారు.   


జిల్లాలో పంచాయతీలు : 1188

వార్డులు            : 11,016

ఎంపీటీసీ స్థానాలు  : 678

ఎంపీపీ స్థానాలు          : 38

జడ్పీటీసీ స్థానాలు          : 38

ఓటర్లు          : 19,02,404

మహిళలు                 : 9,54,182

మహిళలు                  : 9,48,097

ఇతరులు          : 125  

Updated Date - 2020-03-04T10:02:33+05:30 IST