మూడు రాజధానులని ముంచొద్దు

ABN , First Publish Date - 2020-09-16T08:10:49+05:30 IST

అమరావతి కోసం భూములు త్యాగం చేస్తే.. ప్రస్తుత పాలకులు మూడు రాజధానులని ముంచుతున్నారని రైతులు, మహిళలు వాపోయారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాల

మూడు రాజధానులని ముంచొద్దు

అమరావతి లేకుండా చేస్తే రాష్ట్రం అనాఽథే 

273వ రోజు ఆందోళనల్లో రైతులు, మహిళల ఆవేదన 


తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ, సెప్టెంబరు: 15: అమరావతి కోసం భూములు త్యాగం చేస్తే.. ప్రస్తుత పాలకులు మూడు రాజధానులని ముంచుతున్నారని రైతులు, మహిళలు వాపోయారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తోన్న ఉద్యమం మంగళవారానికి 273వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రాజధానులు అంటూ నడివీధిలో నిలబెట్టి ఆనందిస్తున్నారంటూ పాలకులపై రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉసురు తగిలి అనుభవిస్తారని మండిపడ్డారు.


ఉద్ధండ్రాయుపాలెం దీక్షా శిబిరం వద్ద మహిళలు, రైతులు మోకాళ్ల మీద నిల్చొని నిరసన తెలిపారు. అమరావతి అభివృద్ధి కొనసాగాలని తుళ్లూరులో మహిళలు హనుమాన్‌చాలీసా పఠించి,  పూజలు చేశారు. అనంతవరం, నేలపాడు, వెలగపూడి, మందండం, ఐనవోలు గ్రామాలలో దీక్షలు కొనసాగించారు.  


 అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని తాడేపల్లి మండలం పెనుమాకలో నిరసన దీక్షలు కొనసాగాయి. రైతులు, రైతు కూలీలు ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు మనజాలవన్నారు. దీక్షలో కళ్లం రాజశేఖర్‌రెడ్డి, దండమూడి శ్రీహరి, ముప్పెర సదాశివరావు, పలగాని సాంబశివరావు, ఎం తాతయ్య, సాబ్‌జాన్‌, మన్నవ వెంకటేశ్వరరావు, కళ్లం రామిరెడ్డి, గోగినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.


 మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాలలో రైతులు, మహిళలు మంగళవారం నిరసనలు కొనసాగించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధానిలో ఇన్‌సైడ్‌ ట్రెడింగ్‌కు పాల్పడిన వారిని అరెస్టు చేసి అమరావతిని కొనసాగించాలన్నారు. 

Updated Date - 2020-09-16T08:10:49+05:30 IST