పరేషన్‌!

ABN , First Publish Date - 2020-12-06T05:13:20+05:30 IST

కరోనా వేళ ఇన్నాళ్లూ.. ఉచితంగా పొందిన రేషన్‌ సరుకులు ఇక నుంచి ప్రియం కానున్నాయి. చౌక ధరల దుకాణాల నుంచి పేదలకు రాయితీపై అందించే సరుకుల ధరలను ప్రభుత్వం పెంచేసింది. కేజీ కందిపప్పుపై రూ.27, అర కేజీ పంచదారపై రూ.7 అదనంగా పెంచింది. ఈ నెల నుంచే ఈ ధరలు అమలు కానుండగా.. పేదలపై మరింత భారం పడనుంది.

పరేషన్‌!
రేషన్‌ సరుకులు తీసుకుంటున్న కార్డుదారులు..

 రేషన్‌ సరుకుల ధరల పెంపు

 నిలిచిన ఉచిత పంపిణీ

 పేదలపై రూ.2.85 కోట్లు భారం  

ఇచ్ఛాపురం, డిసెంబరు 5: కరోనా వేళ ఇన్నాళ్లూ.. ఉచితంగా పొందిన రేషన్‌ సరుకులు ఇక నుంచి ప్రియం కానున్నాయి. చౌక ధరల దుకాణాల నుంచి పేదలకు రాయితీపై అందించే సరుకుల ధరలను ప్రభుత్వం పెంచేసింది.  కేజీ  కందిపప్పుపై  రూ.27, అర కేజీ పంచదారపై రూ.7 అదనంగా పెంచింది. ఈ నెల నుంచే ఈ ధరలు అమలు కానుండగా.. పేదలపై మరింత భారం పడనుంది. 

జిల్లాలో 1996 రేషన్‌ డిపోలు ఉండగా, 8,41,046మంది కార్డుదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ కార్డులు 51,490, అన్నపూర్ణ కార్డులు 901, తెలుపుకార్డులు 7,88,655 ఉన్నాయి. గతంలో ఒక్కో వ్యక్తికి ఐదు కేజీల చొప్పున బియ్యం (కేజీ రూపాయికే) పంపిణీ చేసేవారు. ఒక్కో కార్డుకి కందిపప్పు కేజీ రూ.40, అరకేజి పంచదార పది రూపాయలకు అందజేసేవారు. బహిరంగ మార్కెట్‌తో  పోల్చితే ఈ ధరలు చాలా తక్కువగా ఉండేవి. ఈ నెల నుంచి ఈ ధరలు పెరగనున్నాయి. అన్ని కార్డులపై కందికప్పు(కేజీ)కి రూ.27,  పంచదార(అరకేజీ)పై  ఏడు రూపాయలను ప్రభుత్వం పెంచింది. దీంతో ఒక్కోకార్డుదారుడిపై రూ.34.చొప్పున అదనపు భారం పడనుంది. ఏఏవై కార్డుదారులకు మాత్రం కేజీ పంచదారను రూ.13.50కే అందజేస్తారు. ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు. కాగా, జిల్లాలో ఈ నెలకు సంబంధించి కందిపప్పు 8,41,046 కేజీలు, పంచదార 4,20,523 కేజీలు కేటాయించారు. దీని ప్రకారం కందిపప్పుపై రూ.2,27,08,242, పంచదారపై రూ.58,87,322 పెంచిన భారం ప్రజలపై పడనుంది.  మొత్తం రూ.2,85,95,564 భారాన్ని ప్రభుత్వం ప్రజలపై మోపింది.  వాస్తవానికి నాలుగు నెలల కిందటే ధరల పెంపు అమలులోకి రావాల్సి ఉంది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కింద పేదలకు 17 విడతలు ఉచితంగా రేషన్‌ సరుకులు పంపిణీ చేసింది. ఈ ఉచిత పంపిణీ గత నవంబరు నుంచి నిలిచిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి రేషన్‌ సరుకుల ధరల పెంపును అమలులోకి తెచ్చింది. 


సరుకులు ఉచితం కాదు

కరోనా సమయంలో 17 విడతలు రేషన్‌ సరుకులను కార్డు దారులకు ఉచితంగా అందించాం. ఈ నెల నుంచి మాత్రం ఉచితంగా ఇవ్వడం లేదు.  బియ్యం, కందిపప్పు, పంచదారకు డబ్బులు చెల్లించి కార్డుదారులు కొనుగోలు చేయాల్సిందే.  ధరల పెంపును అమలు చేస్తాం. పక్కాగా సరుకులు పంపిణీకి  చర్యలు తీసుకుంటాం. 

-వెంకటరమణ, డీఎస్‌వో

  

Updated Date - 2020-12-06T05:13:20+05:30 IST