దారులన్నీ బంద్‌

ABN , First Publish Date - 2020-07-17T10:18:06+05:30 IST

కరోనా కట్టడిలో భాగంగా పలాస-కాశీబుగ్గలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. గురువారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు ..

దారులన్నీ బంద్‌

 పలాస-కాశీబుగ్గలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు


(పలాస/కాశీబుగ్గ, జూలై 16): కరోనా కట్టడిలో భాగంగా పలాస-కాశీబుగ్గలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. గురువారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులతో పాటు దుకాణాలన్నీ మూతపడ్డాయి. మెడికల్‌ షాపులు, కొన్ని ఆసుపత్రులు మాత్రమే తెరుచుకున్నాయి. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నెల రోజుల నుంచి జంట పట్టణాలతో పాటు పలాస నియోజకవర్గమంతా కరోనా వ్యాప్తి కారణంగా అధికంగా పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. గత నెల 18 నుంచి లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. తాజాగా గురువారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తూ ఆంక్షలు మరింత కఠినం చేశారు. మూడు రోడ్ల జంక్షన్‌, ఆర్టీసీ, పెట్రోల్‌ బంక్‌.. తదితర ప్రధాన జంక్షన్లన్నీ గేట్లతో మూసేశారు. నగరంలో మొత్తం ఐదు కంటైన్మెంట్‌ జోన్లలో కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. 24 గంటల పాటు పోలీసులు, రెవెన్యూ, ఆరోగ్యశాఖ, మునిసిపల్‌ సిబ్బంది, వార్డు వలంటీర్లు పహారా కాస్తున్నారు.


ఎక్కడికక్కడ రాకపోకలు కట్టడి చేశారు. గురువారం మధ్యాహ్నం డీఎస్పీ శివరామిరెడ్డి, ఇన్‌చార్జి కమిషనర్‌ ఎన్‌.రమేష్‌నాయుడు, తహసీల్దార్‌  మధుసూదనరావు, సీఐ వేణుగోపాలరావులు కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పర్యటించారు. సిబ్బందికి సూచనలు చేశారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్న స్థానికులు బయటకు వెళ్లకుండా, ఇతరులు లోపలకు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో వలంటీర్లపై స్థానికులు తిరుగుబాటు చేస్తున్నారు. అటువంటి వారిని గుర్తించి కోవిడ్‌ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని డీఎస్పీ శివరామిరెడ్డి సిబ్బందికి ఆదేశించారు.


కూరగాయలు, నిత్యావసర సరకులు డోర్‌ డెలివరీ చేసుకోవచ్చని, సంబంధిత వ్యాపారుల ఫోన్‌ నెంబర్లు కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పెట్టారు. పాలు, గ్యాస్‌కు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. నిబంధనలు పాటిస్తూ.. ఉదయం 7 గంటలలోగా పాలు ఇంటింటా సరఫరా చేసుకోవచ్చని సూచించారు. ఇదిలా ఉండగా, మూడు రోజుల నుంచి కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. దీంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజలు ఇదే స్ఫూర్తితో సహకరిస్తే.. పూర్తిస్థాయిలో కరోనా కట్టడి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-07-17T10:18:06+05:30 IST