కొనసాగుతున్న అష్టతీర్థ మహాయోగం
ABN , First Publish Date - 2020-02-08T09:34:50+05:30 IST
శ్రీకూర్మ క్షేత్రంలో జరుగుతున్న అష్టతీర్థ మహాయోగంలో భాగంగా ఆరో రోజు భక్తులు వక్రతీర్థంలో పవిత్ర

వక్రతీర్థంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు
దర్శించుకున్న కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు
వత్సవలస (గార), ఫిబ్రవరి 7: శ్రీకూర్మ క్షేత్రంలో జరుగుతున్న అష్టతీర్థ మహాయోగంలో భాగంగా ఆరో రోజు భక్తులు వక్రతీర్థంలో పవిత్ర స్నానాలు ఆచ రించారు. గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలోని వత్సవలస సమీపంలో ఉన్న ఈ వక్రతీర్థంలో భక్తులు స్నానాలు చేశారు. ఉదయం మేళతాళా లతో శ్రీకూర్మం మాడవీధుల్లో స్వామి శోభా యాత్ర నిర్వహించారు. అక్కడ నుంచి వక్రతీర్థానికి చేరుకొని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి గంగా హారతి సమర్పించారు. అనంతరం భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పితృదేవతలకు ప్రీతిగా ధానధర్మాలు చేశారు. స్నానాల అనంతరం భక్తులు కాలినడకన, ఆటోల్లో శ్రీకూర్మనాథాలయానికి చేరుకొని స్వామిని దర్శించుకున్నారు. ఎస్‌ఐ ఎం.హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శ్రీకూర్మం పీహెచ్‌సీ వైద్యాధికారి ణి ఎస్.పద్మావతి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. శ్రీకూర్మానికి చెందిన యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులకు పులిహోరా ప్రసాదాన్ని అందజేశారు.
అశోకగజపతిరాజు పూజలు
శ్రీకూర్మనాథుని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతిరాజు దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. అష్టతీర్థ మహాయోగంలో భాగంగా శ్రీకూర్మం ఆలయ వంశపారంపర్య ధర్మకర్తయిన అశోకగజపతిరాజు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి శేషవస్త్రాన్ని అందజేశారు. లక్ష్మీతాయారు సన్నిధిని కూడా వారు దర్శించుకున్నారు. స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ ఈవో విజయకుమార్ అందజేశారు. అనంతరం శ్రీకూర్మనాథాలయ స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు రచించిన శ్రీకూర్మక్షేత్ర వైభవం పుస్తకాన్ని అశోకగజపతిరాజు దంపతులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు సీతారామనృశింహాచార్యులు, స్థానాచార్యుడు పద్మనాభాచార్యులు, అధ్యాపకుడు శ్రీనివాసాచార్యులు, పంచాయతీ మాజీ సర్పంచ్ బరాటం రామశేషు, ప్రముఖ శిల్పాచార్యులు, ఆలయ ట్రస్ట్‌బోర్డు పూర్వపు సభ్యుడు దివిలి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
నేడు నారసింహ తీర్థంలో..
అష్టతీర్థ మహాయోగంలో భాగంగా ఏడోరోజు శనివారం నారసింహతీర్థంలో భక్తులు పవిత్రస్నానాలు ఆచరించనున్నారు. శ్రీకూర్మానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని నీలాపుపేట వద్ద ఈ తీర్థం ఉంది. గంగాహారతి, ప్రత్యేక పూజలు అనంతరం భక్తులు ఈ తీర్థంలో పవిత్ర స్నానాలను ఆచరించనున్నారు.