ఉసురుతీసిన కాటుక డబ్బా

ABN , First Publish Date - 2020-11-03T05:38:06+05:30 IST

కాటుక డబ్బా చిన్నారి ఉసురు తీసింది. గొంతుకు..

ఉసురుతీసిన కాటుక డబ్బా
రెహన్స్‌ (ఫైల్ ఫొటో‌)

గొంతులో దిగబడి.. ఊపిరాడక చిన్నారి మృతి

రత్తకన్నలో ఘటన


ఇచ్ఛాపురం(శ్రీకాకుళం): కాటుక డబ్బా చిన్నారి ఉసురు తీసింది. గొంతుకు అడ్డంగా దిగబడడంతో ఊపిరాడక ఏడాది బాలుడు మృతిచెందాడు. ఈ విషాద ఘటన ఇచ్ఛాపురం మునిసిపాలిటీ రత్తకన్నలో సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రత్తకన్న ఒడియా వీధికి చెందిన గీత బిసాయికి కవిటి మండలం నెలవంక గ్రామానికి చెందిన కుమార్‌ దొళాయితో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాది వయస్సు గల కుమారుడు రెహన్స్‌ దొళాయి ఉన్నాడు. ఇటీవలే దసరా పండుగకు కుమారుని తీసుకొని గీతా బిసాయి రత్తకన్నలోని పుట్టింటికి వచ్చింది. పండుగను ఆనందంతో జరుపుకున్నారు. ఈ నెల 4న చిన్నారి మొదటి పుట్టినరోజు వేడుకలు నెలవంకలో చేసేందుకుగానూ సోమవారం ఆమె బయలుదేరింది.


కుమారుడు రెహన్స్‌ దొళాయికి కొత్త దుస్తులు ధరించి సిద్ధం చేసింది. పూజ గదిలోకి వెళ్లి నమస్కరిస్తుండగా... రెహన్స్‌ దొళాయి అక్కడే ఉన్న కాటుక డబ్బాను మింగేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. గొంతులో అడ్డంగా దిగబడడంతో ఊపిరాడక రెహన్స్‌ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. తల్లి గీతా బిసాయి కుమారుడి మృతదేహాన్ని పట్టుకొని గుండెలవిసేలా రోదించింది. ముచ్చటైన మాటలతో సందడిచేసే చిన్నారి రెహన్స్‌ మృతిని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రత్తకన్న, నెలవంక గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 


Updated Date - 2020-11-03T05:38:06+05:30 IST