‘రబీ’పై.. సందిగ్ధం.. సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వని అధికారులు

ABN , First Publish Date - 2020-12-12T05:11:02+05:30 IST

ఎన్నో ఒడిదొడుకుల మధ్య ఖరీఫ్‌ సీజన్‌ నుంచి బయటపడిన అన్నదాతలకు.. రబీ కష్టాలు మొదలయ్యాయి. సాగునీటి విడుదలపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో సందిగ్ధం నెలకొంది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తోటపలి, వంశధార ప్రాజెక్టులకు మరమ్మతులు దృష్ట్యా నీటి సరఫరాకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. మడ్డువలసలో పుష్కలంగా నీరు ఉన్నా.. కాలువల ద్వారా విడుదలపై స్పష్టత లేదు. దీంతో ఈ ఏడాది రబీ సీజన్‌లో తమకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సాగునీటి విడుదలకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

‘రబీ’పై.. సందిగ్ధం.. సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వని అధికారులు
నీరు లేని వంశధార కాలువ


ప్రాజెక్టుల్లో తగ్గిన నీటి నిల్వలు 

ఆందోళనలో రైతులు

(నరసన్నపేట/వంగర/రాజాం)

ఎన్నో ఒడిదొడుకుల మధ్య ఖరీఫ్‌ సీజన్‌ నుంచి బయటపడిన అన్నదాతలకు.. రబీ కష్టాలు మొదలయ్యాయి. సాగునీటి విడుదలపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో సందిగ్ధం నెలకొంది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తోటపలి, వంశధార ప్రాజెక్టులకు మరమ్మతులు దృష్ట్యా  నీటి సరఫరాకు అవాంతరాలు ఎదురవుతున్నాయి.  మడ్డువలసలో పుష్కలంగా నీరు ఉన్నా.. కాలువల ద్వారా విడుదలపై స్పష్టత లేదు. దీంతో ఈ ఏడాది రబీ సీజన్‌లో తమకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సాగునీటి విడుదలకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

-------------------------

‘ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తాం. ఖరీఫ్‌, రబీలో మూడు పంటలకు సరిపడా నీరు విడుదల చేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. గొట్టా బ్యారేజీతో పాటు వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌లో నీటిని స్థిరీకరించాం’..అంటూ అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో రైతులు ఎంతగానో ఆనందించారు. రబీలో అపరాలకు బదులు వరిసాగుకి సమాయత్తమయ్యారు. కానీ కొద్దిరోజులుగా వంశధార నదితో పాటు కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో నీరు తగ్గుముఖం పట్టడంతో పునరాలోచనలో పడ్డారు. ఆరు తడి పంటలే మేలని భావిస్తున్నారు. వంశధార ఎడమ ప్రధాన కాలువ హిరమండలం, సారవకోట, జలుమూరు, నరసన్నపేట, పోలాకి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 104 కిలోమీటర్ల మేర ఉంది. లక్షా 40 వేల ఎకరాలకు సాగునీరందిస్తోంది. కుడి ప్రధాన కాలువ హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్‌, గార మండలాల్లో 53 కిలోమీటర్లు ప్రవహించి 60 వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తోంది. గొట్టాబ్యారేజీకి తోడు వంశధార ఫేజ్‌-2 రిజర్వాయర్‌ నుంచి సాగునీరు విడుదల చేస్తున్నారు. రబీకి ఎటువంటి లోటు లేకుండా నీరందిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు అపరాల బదులు వరి సాగు చేయాలని నిర్ణయించారు. 1010, ఆర్‌ఎల్‌ ఎన్‌ఆర్‌ వంటి రకాల వరి విత్తనాలను కొనుగోలు  చేసుకున్నారు. వరి నారుమళ్లు సైతం సిద్ధం చేశారు. కొద్దిరోజులుగా కాలువలో నీరు గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దీంతో రైతుల్లో ఆనుమానాలు ప్రారంభమయ్యాయి. వంశధార అధికారులను అడుగుతుంటే సరైన సమాధానం కరువవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సాగునీటి ఇబ్బందుల దృష్ట్యా అపరాల సాగుకే మళ్లీ సన్నద్ధమవుతున్నారు. దీనిపై డీఈ మురళీమోహన్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. రబీకి ఎడమ ప్రధాన కాలువ ద్వారా 20 వేల ఎకరాలకు సాగునీరందిస్తామని చెప్పారు. మరమ్మతు పనుల దృష్ట్యా కుడి ప్రధాన కాలువ ద్వారా నీటి సరఫరా ఉండదని తెలిపారు.  


మడ్డువలసదీ అదే పరిస్థితి!


మడ్డువలస రిజర్వాయర్‌ ఆయకట్టు రైతులకూ సాగునీటి కష్టాలు తప్పడం లేదు. జలాశయంలో పుష్కలంగా సాగునీరు ఉన్నా, కాలువల ద్వారా రబీకి ఇంతవరకూ విడుదల చేయలేదు. దీంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా వంగర, రేగిడి, సంతకవిటి, రాజాం, జి.సిగడాం, పొందూరు మండలాల్లో 24,700 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. ప్రస్తుతం వరి కోతలు దాదాపు పూర్తయ్యాయి. రబీలో భాగంగా రైతులు పెసర, మినుము, మొక్కజొన్న, వేరుశెనగ, రాగులు, చెరకు వంటి పంటలు వేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే అదును దొరకడంతో దుక్కులు సైతం చేస్తున్నారు. కానీ రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలకు సంబంధించి అధికారులు స్పందించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌ నిండుకుండలా ఉంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 64.50 మీటర్ల ఎత్తులో నీటి నిల్వలు ఉన్నాయి. ఇటీవల అడపాదడపా వర్షాలతో అధికారులు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పెంచారు. కానీ కాలువల ద్వారా నీటి విడుదల విషయంలో చొరవచూపడం లేదు. దీనిపై మడ్డువలస ఏఈ గణేష్‌ వద్ద ప్రస్తావించగా.. కలెక్టర్‌ అధ్యక్షతన త్వరలో ఉన్నతస్థాయి సమావేశం జరుగుతుందని.. నీటి విడుదల ఖరారు చేయనున్నట్టు చెప్పారు. రబీకి పుష్కలంగా సాగునీరందిస్తామన్నారు. 


 తోటపల్లి నీరు కష్టం!


రబీకి తోటపల్లి నీరందించలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడమే కారణమని చెబుతున్నారు. ప్రాజెక్ట్‌ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతోంది. ఖరీఫ్‌ వరకూ పర్వాలేకున్నా..రబీ విషయంలో మాత్రం అధికారుల ప్రణాళిక కొరవడుతోంది. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటోంది. జిల్లాలో వీరఘట్టం, పాలకొండ, రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం,  రణస్థలం, లావేరు మండలాల రైతులకు కాలువల ద్వారా నీరందుతోంది. మండలాలవారీ పరిశీలిస్తే రాజాంలో 12,398 ఎకరాలు, వంగరలో 2,834 ఎకరాలు, రేగిడిలో 7,547 ఎకరాలు, సంతకవిటిలో 2,282 ఎకరాలు, జి.సిగడాంలో 6,374 ఎకరాలు, లావేరులో 11,009 ఎకరాలు, రణస్థలంలో 21,591 ఎకరాలకు సాగు నీరందేది. కానీ కాలువ ఆధునికీకరణ పనులు నిలిచిపోవడంతో ప్రస్తుతం సాగునీటి విడుదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శివారు ఆయకట్టుగా ఉండడంతో చాలా ప్రాంతాలకు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది రబీకి సంబంధించి ఈ నెల 20 వరకూ ఆయకట్టు పరిధిలో చెరువులు నింపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. కానీ రిజర్వాయర్‌లో నీటి స్థిరీకరణ అంతంతమాత్రమే. దీంతో పూర్తిస్థాయిలో చెరువులు నింపే కార్యక్రమం పూర్తయ్యేనా? అన్న అనుమానం నెలకొంది. దీనిపై తోటపల్లి ప్రాజెక్ట్‌ ఈఈ రామచంద్రరావు వద్ద ప్రస్తావించగా.. కాలువ పెండింగ్‌ పనుల దృష్ట్యా రబీకి సాగునీరు కష్టమేనన్నారు. ‘ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం చెరువులు నింపేందుకు సాగునీటిని విడుదల చేస్తున్నాం. త్వరలోనే పనులు పూర్తిచేసి.. సాధ్యమైనంత వరకూ రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతా’మని తెలిపారు.  


Updated Date - 2020-12-12T05:11:02+05:30 IST