‘చెర’వులు!

ABN , First Publish Date - 2020-12-07T04:15:40+05:30 IST

జిల్లాలో చెరువుల ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. చాలా ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. అక్రమంగా ప్రైవేటు నిర్మాణాలు వెలిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కట్టడాలు చోటుచేసుకున్నాయి. దీంతో కొన్ని చెరువులు రికార్డులకే పరిమితమవుతున్నాయి. వాల్టాచట్టం ప్రకారం భూగర్భ జలాలు, నీటివనరులను పరిరక్షించాల్సిన బాధత్య అధికారులదే. కానీ జిల్లాలో నీటి వనరులు ఆక్రమణకు గురవుతున్నా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇదే విషయం కాగ్‌ నివేదికలో బట్టబయలైంది. 2018 మార్చితో ముగిసిన సంవత్సరానికి రెవెన్యూ సెక్టార్‌పై భారత కంపో్ట్రలర్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో ప్రధానంగా చెరువుల ఆక్రమణను నిర్ధారించింది. రెవెన్యూ పరంగా చోటుచేసుకున్న అక్రమాలను బయట పెట్టింది. గతంలో పురుషోత్తపురం చెక్‌పోస్టులో చోటుచేసుకున్న అక్రమాల తీరును మరోసారి స్పష్టం చేసింది.

‘చెర’వులు!
శ్రీకాకుళంలో ఆక్రమణకు గురైన చెరువు(ఫైల్‌)

ఆక్రమణకు గురవుతున్న చెరువులు

అక్రమంగా ‘ప్రైవేటు’ నిర్మాణాలు

కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కట్టడాలు

ఉదాసీనంగా వ్యవహరిస్తున్న అధికారులు

కాగ్‌ నివేదికలో వెల్లడైన వాస్తవాలు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

జిల్లాలో చెరువుల ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. చాలా ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. అక్రమంగా ప్రైవేటు నిర్మాణాలు వెలిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కట్టడాలు చోటుచేసుకున్నాయి. దీంతో కొన్ని చెరువులు రికార్డులకే పరిమితమవుతున్నాయి. వాల్టాచట్టం ప్రకారం భూగర్భ జలాలు, నీటివనరులను పరిరక్షించాల్సిన బాధత్య అధికారులదే. కానీ జిల్లాలో నీటి వనరులు ఆక్రమణకు గురవుతున్నా.. అధికారులు  చర్యలు తీసుకోవడం లేదు. ఇదే విషయం కాగ్‌ నివేదికలో బట్టబయలైంది. 2018 మార్చితో ముగిసిన సంవత్సరానికి రెవెన్యూ సెక్టార్‌పై భారత కంపో్ట్రలర్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో ప్రధానంగా చెరువుల ఆక్రమణను నిర్ధారించింది. రెవెన్యూ పరంగా చోటుచేసుకున్న అక్రమాలను బయట పెట్టింది. గతంలో పురుషోత్తపురం చెక్‌పోస్టులో చోటుచేసుకున్న అక్రమాల తీరును మరోసారి స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే..  

జిల్లాలో వివిధ చెరువులు భారీ విస్తీర్ణంలో ఉండగా, చాలావరకు ఆక్రమణకు గురయ్యాయని భారత కంపో్ట్రలర్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) నివేదిక స్పష్టం చేసింది. శ్రీకాకుళం నగరానికి ఆనుకుని రెండు చెరువులు రికార్డుల్లో ఉన్నా.. ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించింది. శ్రీకాకుళం నగరంలో సర్వే నంబర్‌ 204లో బుడమయ్యచెరువు వాస్తవ విస్తీర్ణం 4.79 ఎకరాలు. ఈ స్థలమంతా ఆక్రమణకు గురైంది. చెరువు ప్రాంతం మొత్తం వక్ఫ్‌బోర్డుకు చెందింది. పూర్తిగా ఆక్రమణకు గురై.. కనీసం బుడమయ్య ఉనికే లేదు. అలాగే ఇదే నగరంలోని సర్వే నంబర్‌ 149-1లో 5.29ఎకరాల విస్తీర్ణంలో ఓ చెరువు పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల పరమైంది. ఈ రెండు చెరువులు ఉనికిలో లేవు. ఇటువంటి చెరువులు మరో నాలుగు ఉన్నాయని కాగ్‌ నివేదికలో వెల్లడైంది. 

- శ్రీకాకుళం సమీపంలోని పెద్దపాడు గ్రామంలో సర్వే నంబర్‌ 240లో  37.34 ఎకరాల విస్తీర్ణంలో ఊరచెరువు ఉంది. ఇందులో 0.15 సెంట్లు ఆక్రమణకు గురైంది. 5 సెంట్లలో దేవాలయం, 10 సెంట్లలో ప్రభుత్వ రోడ్లు నిర్మించారు. వాల్టా చట్టం నిబంధనలు పాటించలేదు. ఇదే గ్రామంలోని 39.46 ఎకరాల విస్తీర్ణం గల నందిగెడ్డ చెరువులో 0.86 సెంట్లు ఆక్రమణకు గురైంది. 0.4 సెంట్లలో ప్రైవేటు ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. జాతీయ రహదారి నిర్మాణంలో 0.46 సెంట్లు పోయింది. 

- శ్రీకాకుళం నగరంలో మండలచెరువు వాస్తవ విస్తీర్ణం 6.85 ఎకరాలు. ఇందులో 4.95 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఇందులోనే డీ-ఫారం పట్టాలు ఇచ్చేశారు. 

- ఇక నగరంలోనే చిన్నచెరువు వాస్తవ విస్తీర్ణం 5.21 ఎకరాలు. ఇందులో 0.6 సెంట్లలో పాఠశాల భవనం, 0.10 సెంట్లలో ప్రైవేటు ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ శాఖ అధికారులు.. అక్రమార్కులకు డీ-ఫారం పట్టాలను కూడా జారీ చేసేశారు. 

- అరసవల్లిలో సూర్యనారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి చెరువు కూడా ఆక్రమణకు గురైంది. పుష్కరిణి విస్తీర్ణం 6.32 ఎకరాలు. ఇందులో ఒక ఎకరా మేర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సత్రాలను, క్షౌరశాలలను నిర్మించేశారు. 

- జాతీయరహదారికి ఆనుకుని శ్రీకాకుళంలో విజయాదిత్య చెరువు వాస్తవ విస్తీర్ణం 11.38 ఎకరాలు. ఇందులో 1.5 ఎకరాల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం, పార్కు, కెఫెటేరియాలను నిర్మించారు. ఇలా జిల్లాలో చెరువులన్నీ ఆక్రమణ చెరలో చిక్కుకుని.. కనుమరుగవుతున్నాయని కాగ్‌ నివేదికలో బహిర్గతమైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. చెరువుల ఆక్రమణలను అడుకోవాల్సిన అవసరం ఉంది. 


పురుషోత్తపురం చెక్‌పోస్టులో అక్రమాల పర్వం : 

పురుషోత్తపురం చెక్‌పోస్టులో గతంలో(2018) అక్రమాలు చోటుచేసుకున్నట్లు కాగ్‌ నివేదికలో మరోమారు స్పష్టమైంది.  2015-16లో రూ.1,627.9లక్షలు, 2016-17లో రూ.1,715.78 లక్షలు, 2017-18లో రూ.2,065.65 లక్షలు ఆదాయం లభించింది. నిబంధనలు ప్రకారం... 30 రోజులు మించకుండా తాత్కాలిక లైసెన్సును చెక్‌పోస్టుల ఎంవీఐ, ఏఎంవీఐలు మంజూరు చేయవచ్చు. అయితే నిబంధనలకు విరుద్ధంగా గడువు దాటిపోయినా సరే చెక్‌పోస్టు అధికారులు పర్మిట్లను మంజూరు చేసిననట్లు కాగ్‌ గుర్తించింది. అలాగే నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై జరీమానాలు విధించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో రోడ్డు ప్రమాదాలు అధికమైనట్లు.. కాలుష్యం కూడా హెచ్చుమీరినట్లు కాగ్‌ నివేదికలో వెల్లడైంది. పర్మిట్లను చెక్‌పోస్టు అధికారులు నమోదు చేసిన నేరాలతో పరస్పరం సరిపోల్చినప్పుడు 2018 మార్చికి మునుపే పలు వాహనాల పర్మిట్ల గడువు ముగిసిపోయిందని వెల్లడైంది. రాష్ట్ర సరిహద్దు నుంచి చాలా కిలోమీటర్ల దూరంలో చెక్‌పోస్టును నెలకొల్పడం వల్ల ఏపీ చెక్‌పోస్టు వద్ద నిర్ధేశిత తనిఖీలను తప్పించుకుంటున్నారు. దీనివల్ల కోట్లాదిగా రెవెన్యూ నష్టపోయినట్లు గుర్తించింది. చెక్‌పోస్టు అధికారి జరీమానా తక్కువగా విధిస్తుండడం వల్ల కాంపౌండింగ్‌ రుసుము తక్కువగా వసూలైనట్లు నిర్ధారించింది. 


మార్పిడి పన్ను తక్కువగా చూపి... : 

వ్యవసాయేతర  భూముల మార్కెట్‌ విలువను తప్పుగా చూపించి... భూమి శిస్తులోనూ శ్రీకాకుళం, టెక్కలి రెవెన్యూ డివిజన్‌లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని కాగ్‌ నిర్ధారించింది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పుచేసుకున్నందుకుగాను భూమి శిస్తు తక్కువగా విధించినట్లు చూపారు.  పలుచోట ముందస్తు అనుమతి పొందకుండా భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పిడ్లి చేసినట్ట కాగ్‌ నివేదికల ద్వారా స్పష్టమైంది. 

 


Updated Date - 2020-12-07T04:15:40+05:30 IST