డబ్బుల్లేవు.. బిల్లులు రావు!

ABN , First Publish Date - 2020-11-22T05:18:58+05:30 IST

కరోనా నియంత్రణ విధుల్లో భాగంగా అధికారులు వెచ్చించిన మొత్తానికి చెల్లింపులు నిలిచిపోయాయి. కేంద్రం నుంచి నిధులు రావడం లేదనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి పైసా కూడా విదల్చడం లేదు. దీంతో రూ.13కోట్ల మేర బిల్లులు పేరుకుపోయాయి. చేసిన అప్పులు తీర్చలేక.. వ్యాపారులకు.. కాంట్రాక్టర్లకు సమాధానం చెప్పలేక అధికారులు యాతన పడుతున్నారు.

డబ్బుల్లేవు.. బిల్లులు రావు!

 అందని ‘కొవిడ్‌’ నిధులు

 రూ.13 కోట్ల మేర బకాయిలు

 (శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా నియంత్రణ విధుల్లో భాగంగా అధికారులు వెచ్చించిన మొత్తానికి చెల్లింపులు నిలిచిపోయాయి. కేంద్రం నుంచి నిధులు రావడం లేదనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి పైసా కూడా విదల్చడం లేదు. దీంతో రూ.13కోట్ల మేర బిల్లులు పేరుకుపోయాయి. చేసిన అప్పులు తీర్చలేక.. వ్యాపారులకు.. కాంట్రాక్టర్లకు సమాధానం చెప్పలేక అధికారులు యాతన పడుతున్నారు. 

----------------

‘కరోనా’ నిధుల మంజూరులో ప్రభుత్వం జాప్యం చేస్తోంది.  కొవిడ్‌ నియంత్రణ చర్యల కోసం కేంద్రం... రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేస్తుంది. ఆ నిధులను జిల్లాల వారీగా సర్దుబాటు చేస్తారు. కలెక్టర్‌ నివాస్‌ ఆదేశాల మేరకు కరోనా బాధితుల కోసం తహసీల్దారులు వీటిని వినియోగిస్తారు. రెండు నెలలుగా జిల్లాకు ఈ నిధులు కేటాయించకపోవడంతో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా వ్యాప్తి వేళ.. ‘పాజిటివ్‌’ బాధితులకు తహసీల్దారులు మౌలిక వసతులు కల్పించారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, సంతబొమ్మాళి మండల కేంద్రాల్లో కొవిడ్‌కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. మిగిలిన మండలాల్లో అవసరం మేరకు పునరావాస కేంద్రాలు నెలకొల్పారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వలస కార్మికులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి అవసరమైన చికిత్స, పౌష్టికాహారం అందజేశారు. పునరావాస కేంద్రాల్లో ఒక్కో బాధితుడికి రోజుకు రూ.350 వంతున భోజనానికి ఖర్చు చేశారు. అలాగే టీషర్టు, మాస్కులు, దుప్పటి, శానిటైజర్‌తో కూడిన కిట్లు అందజేశారు. ఒక్కో కిట్టు కోసం రూ.550 వంతున వెచ్చించారు  వీటితో పాటు కరోనా పరీక్షలు చేసే వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం అడ్వాన్సు రూపంలో బిల్లులు చెల్లించకపోవడంతో వ్యాపారుల వద్ద సొంత పూచీకత్తుపై అప్పుచేసి.. మౌలిక వసతులన్నీ కల్పించారు. ఇలా.. జిల్లావ్యాప్తంగా తహసీల్దారులు   రూ.35 కోట్లకుపైగా ఖర్చు చేశారు. దీనికి సంబంధించిన బిల్లులను కలెక్టర్‌కు అందజేశారు. కానీ ఇంతవరకు కేవలం రూ.22 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకా రూ.13కోట్లు నిలిచిపోయాయి. నిత్యం వ్యాపారులు, భోజన కాంట్రాక్టర్లు కార్యాలయానికి వచ్చి తమ బిల్లులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తుండడంతో సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతోందని తహసీల్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన ఖర్చుకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో నిధుల కొరత వెంటాడుతోంది. దీంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు కొత్తగా పాజిటివ్‌ కేసులు వస్తున్నా, వారికి మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ఎక్కడైనా పాజిటివ్‌ కేసు వస్తే, ఆ వీధి మొత్తం పారిశుధ్య పనులు చేపట్టేవారు. అటువైపు ఎవరూ తిరగకుండా బారీకేడ్లు ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కానరావడం లేదు. పారిశుధ్యం పనులు నిలిచిపోతే.. మళ్లీ కరోనా మహమ్మారి విజృంభించే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


 వైద్య సిబ్బందికి వేతన బకాయిలు :

వైద్య ఆరోగ్యశాఖలో కరోనా నియంత్రణకు ప్రత్యేక వైద్య బృందాలు గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. దీనికి వైద్యాధికారులు ట్రాన్స్‌ఫోర్టు, ఇతరత్రా అత్యవసర మందుల కోసం లక్షలాది రూపాయిలు ఖర్చు చేశారు. వైద్య, ఆరోగ్య శాఖకు సుమారు రూ.5 కోట్లకు పైగా బిల్లులు నిలిచిపోయాయని తెలిసింది. తాత్కాలిక వైద్య సిబ్బందికి కూడా వేతన బకాయిలు పేరుకుపోయాయి. కరోనా నివారణకు అత్యవసరమైన సేవలు అందించేందుకు తాత్కాలిక ప్రాతిపదికన వైద్య సిబ్బందిని నియమించారు. జిల్లాలో సుమారు 21 మంది ఎంబీబీఎస్‌ వైద్యులు, 29 మంది ఆయుష్‌ వైద్యులు, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నిషీయన్లు, ఇతరత్రా సిబ్బంది మరో వంద మంది వరకు మూడు నెలలు విధులు నిర్వర్తించారు. వీరి వేతన బిల్లులను అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి.. నెల రోజులు దాటుతున్నా.. నిధులు మంజూరు కావడం లేదు. దీంతో కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించిన తమకు వేతనాల మంజూరులో అధికారులు తాత్సారం చేస్తున్నారని వైద్యసిబ్బంది ఆరోపిస్తున్నారు. కొవిడ్‌ నివారణకు సంబంధించి ఎటువంటి ఖర్చు చేసినా వెంటనే నిధులు విడుదల చేయాల్సి ఉంది. కానీ కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని జిల్లాలకు అరకొరగా సర్దుబాటు చేస్తుండడంతో సమస్య ఉత్పన్నమవుతోందనే ఆరోపణలు ఉన్నాయి.  నాయకులు, ఉన్నతాధికారులు నవరత్నాలు అమలుపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప.. కరోనా నియంత్రణ నిధుల మంజూరుపై శ్రద్ధ చూపడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కరోనా నియంత్రణ బిల్లుల బకాయిలను మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.  

 

Read more