వీడని జంట హత్యల మిస్టరీ !

ABN , First Publish Date - 2020-03-18T10:17:23+05:30 IST

జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఏడాది దాటినా ఈ కేసులో

వీడని జంట హత్యల మిస్టరీ !

ఏడాది దాటినా కేసులో కానరాని పురోగతి

కొనసాగు..తున్న దర్యాప్తు

మారుతున్న పోలీసు అధికారులు

ఖాకీలకు సవాల్‌గా మారిన వైనం


శ్రీకాకుళం క్రైం, మార్చి 17: జిల్లాలో  సంచలనం  సృష్టించిన జంట హత్యల కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఏడాది దాటినా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దర్యాప్తు చేపడుతున్న పోలీ సు అధికారులు మారిపోతున్నా కేసు మాత్రం కొలిక్కి రావడం లేదు. ఈ కేసును ఖాకీలు సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతీసారి ప్రెస్‌మీట్లు పెట్టి కేసును ఛేదిస్తున్నామని చెప్పడమే తప్ప లోతుగా దర్యాప్తు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. 


కేసు నేపథ్యం..

గత ఏడాది ఫిబ్రవరి 7న శ్రీకాకుళం నగరంలోని బొందిలీపురం విజయనగరకాలనీ సింధూజ అపార్ట మెంట్‌ రెండో అంతస్థులో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఫ్లాట్‌లో నివాసముంటున్న  జిలానీ అనే చెప్పుల వ్యాపారి భార్య మెహరున్నీషా (35), ఆయన తల్లి జూరాబాయి (65)లను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా చంపేశారు.


ఇంట్లో వారిద్దరే ఉంటారన్న విషయం తెలుసుకుని ఈ దారు ణానికి ఒడిగట్టారు. మెహరున్నీషాను వంట గదిలో, జూరాబాయిని ఇంటి హాల్‌లో హత్య చేశారు.   మారణ ఆయుధాలతో దాడి చేయడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.


జిల్లా కేంద్రంలో పట్టపగలు జరిగిన ఈ ఘటన ఆ రోజు సాయంత్రం వరకూ వెలుగులోకి రాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు డాగ్స్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంలను రంగంలోకి దించారు. సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలతో జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేప ట్టారు. జిలానీ, అతని సోదరుడు రఫీతో పాటు స్థాని కులను కొందరిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయినా కేసులో ఎటువంటి పురోగతి  కనిపించలేదు. 


పోలీసు అధికారుల బదిలీ

జంట హత్యల కేసు దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలో ని వివిధ జిల్లాలతో పాటు ఒడిశా, ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లాయి. అయినా  కేసు చిక్కుముడి వీడలేదు. ఇంతలో జిల్లా పోలీసు బాస్‌తో పాటు, స్థానిక పోలీస్‌ స్టేషన్‌, సర్కిల్‌ అధికారులు   బదిలీ అయ్యారు. దీంతో కేసుపై దృష్టి సారించే అధి కారులు కరువయ్యారు. ఎప్పటికప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి కేసును ఛేదిస్తున్నామని చెప్పడమే కనిపిస్తుంది. విశాఖ రేంజ్‌ డీఐజీ సమక్షంలో ఎస్పీని ఎన్నో పర్యా యాలు జంట హత్యల కేసు విషయపై విలేకరులు ప్రశ్నించినప్పటికీ సమాధానం దాటవేసేవారు.


నెల నెలా నేర సమీక్షా సమావేశాన్ని పొద్దుపోయే వరకూ నిర్వహించే పోలీసు ఉన్నతాధికారులు జంట హత్యల కేసుపై చర్చించిన దాఖలాలు కనబడడం లేదు. సంఘటన జరిగిన రోజున పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించలేదని, తామున్నప్పుడు ఈ ఘటన జరగలే దని చెప్పి ప్రస్తుత పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా జంట హత్యల కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. 

 

 దర్యాప్తు చేపడుతున్నాం

జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును దర్యాప్తు చేపడుతున్నాం. ఈ కేసుకు సంబం ధించి మూడు బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు వివిధ రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నేరస్థుల వేలిముద్రలను జిల్లా జంట హత్య కేసులో సేక రించిన వేలిముద్రలతో సరి చూస్తున్నాయి. 

- ఆర్‌ఎన్‌.అమ్మిరెడ్డి, ఎస్పీ

Updated Date - 2020-03-18T10:17:23+05:30 IST