-
-
Home » Andhra Pradesh » Srikakulam » Must buy each grain nut
-
ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేయండి
ABN , First Publish Date - 2020-12-31T05:28:17+05:30 IST
‘ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు. కేంద్రాలకు తెచ్చిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలి’ అని కలెక్టర్ నివాస్ అధికారులను ఆదేశించారు. ఇచ్ఛాపురం, సోంపేట మండలాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచిలోని కొనుగోలు కేంద్రంలో వివిధ సమస్యలను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

కలెక్టర్ నివాస్ ఆదేశం
తేలుకుంచిలో టన్నుకు 20 కేజీల తగ్గింపుపై ఆగ్రహం
కొర్లాంలో రికార్డుల నిర్వహణ తీరుపై అసంతృప్తి
(ఇచ్ఛాపురం రూరల్/సోంపేట రూరల్)
‘ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు. కేంద్రాలకు తెచ్చిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలి’ అని కలెక్టర్ నివాస్ అధికారులను ఆదేశించారు. ఇచ్ఛాపురం, సోంపేట మండలాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచిలోని కొనుగోలు కేంద్రంలో వివిధ సమస్యలను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ టన్నుకు 20 కేజీలు తగ్గిస్తున్నారని, పంటలు దెబ్బతిని ఇబ్బంది పడుతున్న సమయంలో ఇలా చేయడం వల్ల మరింత నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ... అలా ఎందుకు చేస్తున్నారంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. కొనుగోళ్లు వేగవంతానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ నివాస్‌ను రైతులు కోరారు. తమకు భూములు తక్కువగా ఉన్నా.. ఇటీవల సర్వేలో ఎక్కువ ఉన్నట్టు చూపిస్తూ బియ్యం కార్డులు తొలగించారని కొంతమంది గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యంకార్డులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సోంపేట మండలం కొర్లాంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. రికార్డులు పరిశీలించి, నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఈ కేంద్రంలోనూ వివిధ సమస్యలను రైతులు వివరించారు. క్షేత్రస్థాయిలో అధికారులు కనిపించడం లేదని.. ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. అనంతరం కర్తలిపాలెంలో సచివాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పలాసపురం అన్నపూర్ణ రైసు మిల్లును కూడా పరిశీలించారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉపకలెక్టర్ టి.సీతారామ్మూర్తి, ఏవో బి.నరసింహమూర్తి, సీఎస్‌డీటీ శంకరరావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి టి.సీతారామయ్య, తహసీల్దార్ గురుప్రసాద్, ఎంపీడీవో చల్లా శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐ గాయత్రి పాల్గొన్నారు.