ప్రియుడి మోజులో పడి..

ABN , First Publish Date - 2020-11-28T04:13:18+05:30 IST

ప్రియుడి మోజులో పడి భర్తను అడ్డు తొలగించుకోవడానికి నిర్ణయించిందా మహిళ. కట్టుకున్న వాడిని మట్టుబెట్టాలని ప్రియుడినే పురమాయించింది.

ప్రియుడి మోజులో పడి..
అసిరిపోలి మృతదేహం


భర్తను హత్య చేయించిన భార్య

ప్రమాదవశాత్తూ మరణించినట్టు చిత్రీకరణ

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, నవంబరు 27 :  ప్రియుడి మోజులో పడి భర్తను అడ్డు తొలగించుకోవడానికి నిర్ణయించిందా మహిళ.  కట్టుకున్న వాడిని మట్టుబెట్టాలని ప్రియుడినే పురమాయించింది. హత్య చేయించి ప్రమాదవశాత్తూ మృతిచెందినట్టు నమ్మించాలని చూసింది. తీరా పోలీసుల విచారణలో నిందితురాలిగా తేలడంతో ప్రియుడితో పాటు కటకటాలపాలైంది. శ్రీకాకుళం నగరంలో గురువారం రాత్రి జరిగిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎచ్చెర్ల మండలం ముద్దాడకు చెందిన అంబటి అసిరిపోలి (36)కి వెంకన్నగారిపేటకు చెందిన ఓ మహిళతో ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ శ్రీకాకుళం నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేవారు. ఈ నేపథ్యంలో వీరికి గార మండలం అంపోలుకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు గొండు షణ్ముఖరావుతో పరిచయం ఏర్పడింది. ఆ మహిళతో షణ్ముఖరావు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భర్త అసిరిపోలి పలుమార్లు హెచ్చరించాడు. తరచూ వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భర్తను అడ్డు తొలగిస్తే కానీ వివాహేతర సంబంధం కొనసాగదని ఆమె భావించింది. ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గురువారం శ్రీకాకుళం నగరంలోని జీటీ రోడ్డులోని ఓ నగల దుకాణం వద్ద భవన నిర్మాణ పనులకు అసిరిపోలి వెళ్లాడు. అదే పనులకు షణ్ముఖరావు వెళ్లగా..  ఆమె ఫోనచేసి ఎలాగైనా తన భర్తను మట్టుబెట్టాలని సూచించింది. దీంతో సాయంత్రం వరకూ పనులు జరుగుతుండగా.. ఎవరూ లేని సమయంలో అసిరిపోలి తలపై షణ్ముఖరావు రాయితో మోదాడు. అక్కడే నేలకొరిగిన అసిరిపోలిని లిఫ్ట్‌ కోసం తీసిన గోతిలో తోశాడు. ఏమీ తెలియదన్నట్టుగా తన పని ముగించుకొని షణ్ముఖరావు వెళ్లిపోయాడు. ఇంతలో అసిరిపోలి స్నేహితుడు రమణ ఫోన చేయగా... ఎత్తడం లేదు. ఇదే విషయాన్ని అసిరిపోలి భార్యకి ఫోనచేసి అడిగాడు. ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు నలతగా ఉందని చెప్పాడని..తనకు భయంగా ఉందని.. జీటీ రోడ్డులో ఉన్న భవన నిర్మాణ పనులకు వెళ్లాడని చెప్పింది. అక్కడే ఉన్న లిఫ్ట్‌ గోతిలో చూడాలని.. పొంతన లేని సమాధానం చెప్పింది. శుక్రవారం ఉదయం లిఫ్ట్‌ గోతుల్లో మృతదేహం వెలుగుచూడడం, శరీరంపై గాయాలుండడం... అప్పటికే ఆ మహిళకు, షణ్ముఖరావుకు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని దర్యాప్తులో తేలడంతో పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. తమదైన శైలిలో విచారించడంతో ఆ మహిళ, ప్రియుడు షణ్ముఖరావు తప్పును ఒప్పుకున్నారు. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ మహేంద్ర, సీఐ రమణ, ఎస్‌ఐలు ముకుంద, ప్రవళ్లిక పరిశీలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Read more