ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త మృతి

ABN , First Publish Date - 2020-07-22T18:09:35+05:30 IST

పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త రెడ్డి నాగభూషణరావు (58) మంగళవారం రాత్రి..

ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త మృతి

పాతపట్నం/ శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త రెడ్డి నాగభూషణరావు (58) మంగళవారం రాత్రి మృతిచెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. నాగభూషణరావు ఐఆర్‌ఎస్‌ అధికారిగా పనిచేశారు. పార్లమెంటరీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉంటూ వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. ఆయన కొద్దికాలంగా రాజకీయాల్లో ఉన్నారు. గత ఎన్నికల నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన స్వస్థలం ఒడిశాలోని బరంపురం. జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు పాలవలస రాజశేఖరం కుమార్తె శాంతిని వివాహం చేసుకున్నారు. 


వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు శ్రావణ్‌ ఎంబీఏ చేసి వ్యాపార రంగంలో ఉండగా కుమార్తె వేదిత రెడ్డి ఐఏఎస్‌ అధికారిగా పనిచేస్తున్నారు. మరో కుమారుడు ఓం శ్రీకృష్ణ, కుమార్తె త్రయాంబ ప్రియాంక రెడ్డి ఉన్నత చదువుల్లో ఉన్నారు. రాజకీయ కుటుంబం కావడంతో భార్య శాంతిని 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం నుంచి నిలిపారు. ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా..పాతపట్నం నియోజకవర్గంలో మారిన సమీకరణాలతో ఆ స్థానంపై దృష్టిపెట్టారు.  సుమారు మూడేళ్ల పాటు శ్రమించి భార్య శాంతిని అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.


వైసీపీ శ్రేణులతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది.  నాగభూషణరావు ఆకస్మిక మృతిపై వైసీపీ శ్రేణులు దిగ్ర్బాంతి వ్యక్తం చేశాయి. నాగభూషణరావు మృతికి ముఖ్యమంత్రి జగన్‌సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.  మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ కూడా సంతాపం తెలిపారు. పాతపట్నం నియోజకవర్గ నేతలు మిరియాబిల్లి శ్యాంసుందరరావు, కొంచాడ వీరభద్రరావు, లింగాల ఉషారాణి, సవిరిగాన ప్రదీప్‌, యెరుకోల వెంకటరమణారావు, కొండాల అర్జునుడు తదితరులు సంతాపం తెలిపారు.


Updated Date - 2020-07-22T18:09:35+05:30 IST