-
-
Home » Andhra Pradesh » Srikakulam » Missed threat to speaker
-
స్పీకర్‌కు తప్పిన ముప్పు
ABN , First Publish Date - 2020-11-22T05:10:59+05:30 IST
రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్‌కు పెద్ద ప్రమాదమే తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొనగా.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో అంతా క్షేమంగా బయటపడ్డారు.

వంజంగి సమీపంలో ప్రమాదం
తమ్మినేని కారును ఢీకొన్న ఆటో
పొలాల్లోకి దూసుకెళ్లి.. నిలిచిన వాహనం
ఆమదాలవలస,నవంబరు 21 : రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్‌కు పెద్ద ప్రమాదమే తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొనగా.. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో అంతా క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. స్పీకర్ తమ్మినేని సీతారాం శనివారం ఉదయం కలెక్టరేట్‌లో టెలీకాన్ఫరెన్స్ అనంతరం ఆమదాలవలసకు తిరుగు ప్రయాణమయ్యారు. వంజంగి-లంకాం రోడ్డు జంక్షన్‌లో స్పీకర్ కారును ఓ ఆటో ఢీకొంది. కాన్వాయ్ వెనుక స్పీకర్ వాహనం వెళ్తుండగా.. ఆమదాలవలస నుంచి మితిమీరిన వేగంతో ప్రయాణికులతో వస్తున్న ఆటో ప్రమాదవశాత్తూ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడగా.. డ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్పీకర్ వాహనం రోడ్డుపై నుంచి పొలాల వైపు కాస్త దూసుకెళ్లి కల్వర్టు సమీపంలో నిలిచిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన సెక్యూరిటీ పోలీసులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది స్పీకర్ వద్దకు పరుగులు తీశారు. ఘటన నుంచి కోలుకున్న సీతారాం.. తనకేమీ కాలేదని... ముందు ఆటోలో ఉన్న ప్రయాణికుల పరిస్థితి చూడాలని సూచించారు. భద్రతా సిబ్బంది ఆటోను సరిచేసి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్పీకర్ వాహన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని అదుపు చేశారు. లేదంటే పక్కనే ఉన్న కల్వర్టులో వాహనం పడినా.. ముందున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినా పెను ప్రమాదమే సంభవించేదని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో ట్రాఫిక్ నిలిచిపోగా.. భద్రతా సిబ్బంది క్రమబద్ధీకరించారు. అనంతరం స్పీకర్ మరో వాహనంలో ఇంటికి చేరుకున్నారు. విషయం తెలిసిన వారంతా స్పీకర్ యోగక్షేమాలపై ఆరా తీయగా.. దేవుడి దయ వల్ల తనకేమీ కాలేదని.. క్షేమంగానే ఉన్నానని సీతారాం తెలిపారు.
ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి : నిర్లక్ష్యం, మితిమీరిన వేగంతో స్పీకర్ వాహనాన్ని ఢీకొన్న ఆటోడ్రైవర్ దుప్పాడ రమేష్‌పై శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ రాజేష్ వెల్లడించారు.