ఇంటి వద్దకే వైద్యసేవలు

ABN , First Publish Date - 2020-04-05T10:23:15+05:30 IST

ఇంటి వద్దకే వైద్య సేవలు అందజేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ నిలిపివేయడంతో సాధారణ రోగులకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు.

ఇంటి వద్దకే వైద్యసేవలు

 ఇంటింటా సర్వే చేస్తున్న బృందాలు

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన


కలెక్టరేట్‌, ఏప్రిల్‌4 : ఇంటి వద్దకే వైద్య సేవలు అందజేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ నిలిపివేయడంతో సాధారణ రోగులకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి బాధలు కళ్లకు కట్టేలా.. ‘వైద్యం దూరం.. అ‘ధన’పు భారం’ అనే శీర్షికన ఈ నెల 3న ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


సాధారణ రోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రాథమిక, సెంకడరీ స్థాయి వైద్య బృందాలు పకడ్బందీగా పనిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు స్పందించి.. వైద్య సేవలు ముమ్మరం చేశారు. శనివారం గ్రామాల్లో వలంటీర్లు, ఆరోగ్య కార్యకర్త, ఏఎన్‌ఎం. ఆశావర్కర్లతో కూడిన బృందాలు ఇంటింటా సర్వే చేశాయి. సాధారణ రోగుల వివరాలు సేకరిస్తున్నాయి. నగర పాలక సంస్థ, మునిసిపాలిటీల్లో కూడా ఇదే సిబ్బందితో కూడిన సెకండరీ బృందాలు వైద్యాధికారితో ఇంటింటా సర్వే చేస్తున్నాయి. రోగులకు చికిత్స అందజేస్తున్నాయి.  రోగులను గుర్తించి ప్రాథమిక చికిత్సలు అందించటమే కాకుండా వ్యాధి తీవ్రతను బట్టి వారిని ఉన్నత ఆసుపత్రులకు తరలించే ప్రక్రియ కూడా ప్రారంభించాయి. రోగులను గుర్తించడమే కాకుండా లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మరణించిన వారి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం చేరవేస్తున్నాయి. వీటితోపాటు విదేశాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కరోనా అనుమానితుల వివరాలు సేకరిస్తున్నాయి.  ఇలా ఇంటింటా సర్వే చేస్తుండడంతో కొంతమేరకు వైద్యసేవలు మెరుగుపడతాయని జిల్లావాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-04-05T10:23:15+05:30 IST