కంటైనర్‌లో పండ్లు ఉన్నాయన్నారు.. అనుమానంతో చెక్ చేస్తే ఏమున్నాయో చూసి షాక్..!

ABN , First Publish Date - 2020-06-22T21:25:17+05:30 IST

కూలింగ్‌ ఫ్రిజ్‌ కలిగిన ఆ కంటైనర్‌ అద్దంపై మిల్క్‌ అని అక్షరాలు ఉంటాయి. కానీ అందులో పాలుకు బదులు పశుమాంసం ప్యాకెట్లు ఉన్నాయి. ఇవి కలకత్తా నుంచి చెన్నైకు అక్రమంగా తరలిపోతున్నాయి.

కంటైనర్‌లో పండ్లు ఉన్నాయన్నారు.. అనుమానంతో చెక్ చేస్తే ఏమున్నాయో చూసి షాక్..!

కంటైనర్‌లో.. ‘గో’మాంసం!

ఫ్రూట్స్‌ పేరున వే బిల్లుతో అక్రమ రవాణా

పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన 26 టన్నులు 

రూ10.40 లక్షలు విలువ చేసే సరుకు స్వాధీనం


ఇచ్ఛాపురం(శ్రీకాకుళం జిల్లా): కూలింగ్‌ ఫ్రిజ్‌ కలిగిన ఆ కంటైనర్‌ అద్దంపై మిల్క్‌ అని అక్షరాలు ఉంటాయి. కానీ అందులో పాలుకు బదులు పశుమాంసం ప్యాకెట్లు ఉన్నాయి. ఇవి కలకత్తా నుంచి చెన్నైకు అక్రమంగా తరలిపోతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న భజరంగ్‌దళ్‌ సభ్యులు.. పోలీసుల సహాయంతో అక్రమాల గుట్టును  రట్టు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. సుమారు రూ.10.40 లక్షలు విలువ చేసే 26 టన్నుల పశు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పాల సరఫరా కంటైనర్‌లో కలకత్తా నుంచి చెన్నైకు గో మాంసం అక్రమంగా తరలిపోతున్నట్టు ఒడిశా రాష్ట్రం బరంపురంలోని భజరంగ్‌దళ్‌ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు ఆ కంటైనర్‌ను అనుసరిస్తూనే.. ఇచ్ఛాపురంలోని సీఐ వినోద్‌బాబు, ఎస్‌ఐ సత్యనారాయణకు సమాచారం అందజేశారు. 


ఈ నేపథ్యంలో పోలీసులు పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద ఆ కంటైనర్‌ను అడ్డుకున్నారు. లోపల ఉన్న డ్రైవర్‌ను.. లోడ్‌ ఏమిటని సీఐ అడగ్గా.. ఫ్రూట్స్‌ అని చెప్పారు. కానీ, కంటైనర్‌ డోర్లు తెరవగా.. 26 టన్నుల మాంసం ప్యాకెట్లు కనిపించాయి. ఒక్కొక్కటీ 20 కేజీలు చొప్పున 1300 మాంసం ప్యాకెట్లు వెలుగుచూశాయి. వీటి విలువ రూ.10.40 లక్షలు ఉంటుందని పోలీసులు గుర్తించారు. కంటైనర్‌లో ఉన్నది ఆవు మాంసమా, గేదె మాంసమా అని గుర్తించేందుకు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు అప్పలస్వామిని పిలిపించారు. మాంసం నమూనాను ప్రయోగశాలకు పంపించాలని నిర్ణయించారు. కంటైనర్‌ను స్వాధీనం చేసుకుని.. తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. గోమాంసం అక్రమ రవాణా నేపథ్యంలో తమిళనాడుకు చెందిన కంటైనర్‌ టీఎన్‌36ఏపీ7401 సీజ్‌ చేశామని సీఐ తెలిపారు. లారీ డ్రైవర్‌, క్లీనరు గణపతిశేఖర్‌, ఫ్రాన్సిస్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు.  ఇదిలా ఉండగా, ఒడిశా పశ్చిమబంగ కేంద్రాలుగా ఆంధ్రా, తమిళనాడులకు గోమాంసం పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని భజరంగ్‌దళ్‌ ప్రముఖ్‌ సుశాంత్‌ కుమార్‌ దాస్‌, ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు కోరుతున్నారు. గోమాంసం అక్రమ తరలింపు దురదృష్టకరమని జిల్లా భజరంగదళ్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-06-22T21:25:17+05:30 IST