ఉజ్వలమైన బాల్యం కోసం ‘వారధి’

ABN , First Publish Date - 2020-03-15T10:21:13+05:30 IST

బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించి వారికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ ప్రధాన్యాంశం. బాలలకు అత్యున్నతమైన ప్రమాణాలతో విద్యను అందించాలంటే

ఉజ్వలమైన బాల్యం కోసం ‘వారధి’

16న ప్రారంభం


రణస్థలం, మార్చి 14: బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించి వారికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ ప్రధాన్యాంశం. బాలలకు అత్యున్నతమైన ప్రమాణాలతో విద్యను అందించాలంటే మౌలిక వసులు కల్పించడంతో పాటు గుణాత్మక శిక్షణ అవసరం. పిల్లలు అభ్యసన ఫలితాలు సాధించాలంటే నిర్దేశిత అంశాల్లో శిక్షణ ఇవ్వడం అవసరం. ఇందుకోసమే పాఠశాల విద్యా శాఖ ‘వారధి’ పేరుతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించింది. విద్యార్థులు పైతరగతులకు వెళ్లేందుకు అవసరమైన పునాదిని ఏర్పరచడమే లక్ష్యంగా వారధి పేరుతో బ్రిడ్జి కోర్సును 30 రోజులు నిర్వహించనున్నారు. దీన్ని ఈ నెల 16న ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లోని అభ్యసన అంతరాలను గుర్తించి శిక్షణ ఇవ్వడం ద్వారా వారి సామర్థ్యాలను పెంపొందించడం, వినోదం, ఆటలతో ఆహ్లాదకర అభ్యసన వాతావరణాన్ని కల్పిండం, భాషా నైపుణ్యం అభివృద్ధితో పాటు గణితం, పరిసరాల విజ్ఞాన భావనలను పెంపొందించడం దీని లక్ష్యం. ప్రతి విద్యార్థిని దృష్టిలోఉంచుకుని అభ్యసన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తారు.


ప్రాధ్యాన్య అంశాలు ఇవీ...

 • శబ్దానికి, అక్షరానికి మధ్య సంబంధాన్ని గుర్తించడం, వినడం, మాట్లాడటం, అర్థవంతంగా చదవడం, రాయడం.
 • గణితం, పరిసరాల విజ్ఞానంలోని నిర్దిష్ట పదజాల అభివృద్ధి.
 • కృత్యాధార బోధనతో బాలల జట్టులో ఆనందకర అభ్యసనం.
 • దృశ్య, శ్రవణాల ద్వారా భాషా సామర్థ్యాన్ని పెంపొందించడం.

స్థాయి నిర్థారణ కోసం పరీక్షలు

ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్థాయి నిర్థారణ పరీక్షలను ఈనెల 16న నిర్వహిస్తారు. ఇందుకోసం అవసరమైన ప్రశ్నపత్రాన్ని డీసీఈబీ ద్వారా సరఫరా చేస్తారు. ప్రశ్నపత్రం 50 మార్కులకు ఉంటుంది. తెలుగు-15, గణితం-15, ఆంగ్లం-20 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ఈ పరీక్షల్లో పొందే మార్కుల ఆధారంగా విద్యార్థులను ఒకటో స్థాయి, రెండో స్థాయి జట్టుగా విభజిస్తారు. తెలుగు, గణితంలో 8 మార్కుల కన్నా తక్కువ పొందేవారు ఒకటో స్థాయి, తెలుగు గణితంలో 8 కన్నా ఎక్కువ, ఆంగ్లంలో 10 కన్నా ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు రెండో స్థాయిలోకి వస్తారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా అధ్యయన పుస్తకాలను డీసీఈబీ ద్వారా ముద్రించి ఈనెల 17న ఉపాధ్యాయలకు అందజేస్తారు.


స్థాయి సబ్జెక్టు ఆశించిన అభ్యసన ఫలితాలు

1 తెలుగు: వర్ణమాలలో అక్షరాలను గుర్తించడం, మూడక్షరాల పదాలను గుర్తించడం. తప్పులు లేకుండా చదవడం, రాయడం, సరళమైన వాక్యాల లేఖనం.

గణితం: 1 నుంచి 100 సంఖ్యలు, 1 నుంచి 10 అంకెలను పదాలగా రాయడం.

ఆంగ్లం: ఆంగ్ల వర్ణమాల, రెండు నుంచి నాలుగు అక్షరాల పదాలను గుర్తించడం, తప్పులు లేకుండా చదవడం, రాయడం.


2 తెలుగు: సరళమైన వాక్యాలు చదవడం, రాయడం, అర్థవంతంగా చదవడం, సాధారణ వాక్యాలను మాట్లాడటం.

గణితం: 1 నుంచి 100 సంఖ్యలను పదాలుగా  రాయడం, రెండంకెలతో సంకలనం, గుణకారం భాగహారం గణిత పదజాలంపై అవగహన.

ఆంగ్లం: సరళమైన వాక్యాలు చదవడం, రాయడం, అర్థవంతంగా చదవడం, సాధారణ వాక్యాల్లో మాట్లాడటం.


బోధన ప్రక్రియ ఇలా...

 • 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల పాఠ్య పుస్తకాల్లోని గేయాలను నేర్పించాలి.
 • పెద్ద అక్షరాల్లో రాసిన అభినయ గీతాల చార్టులను ప్రదర్శించడం.
 • అభినయ గేయం గురించి విద్యార్థులతో సంభాషించడం.
 • ఉపాధ్యాయుడు మూడు సార్లు పాడి వినిపించడం.
 • ఒక్కో వాక్యం పాడుతూ బాలలతో పాడించడం.
 • విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాడటం.
 • విద్యార్థులు సొంతంగా పాడటం. అభినయిస్తూ ఉపాధ్యాయుడు ఒక్కో వాక్యం పాడటం.
 • గేయాల్లోని కీలక పదాలను గుర్తించడం.
 • అభినయ గేయంలోని ప్రాధాన్య విషయాన్ని విద్యార్థులతో చర్చిండం ద్వారా భావాలు, అందులోని పాత్రలు, వాటి స్వభావంపై అవగహన కల్పించడం.
 • విద్యార్థులు అభినయిస్తూ గేయం మొత్తాన్ని పాడటం.


వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దడానికే...

వెనకబడిన విద్యార్థులను తీర్చిదిద్దడానికే వారధి కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తెలుగు, ఆంగ్లం, గణితంపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం. నెల రోజుల పాటు విద్యార్థులకు బోధన జరుగుతుంది.

- ఎ.త్రినాథరావు, ఎంఈవో, రణస్థలం

Updated Date - 2020-03-15T10:21:13+05:30 IST